సర్వే ప్రక్రియను త్వరితగతిన నిర్వహించాలి
జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ
కాకినాడ సిటీ : ఏడీబీ, కెనాల్ రోడ్ల విస్తరణ, ఏలేరు ఆధునికీకరణ, కోటిపల్లి – నర్సాపురం రైల్వే లైన్ సర్వే ప్రక్రియను త్వరితగతిన నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కోర్టు హాలులో రెవెన్యూ, ఆర్అండ్బీ, ఇరిగేషన్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాలో రోడ్ల విస్తరణ, ఏలేరు ఆధునీకరణ కోసం భూసేకరణ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ – రాజమండ్రి కెనాల్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు వీలుగా సేకరించి, పరిహారం అందించిన భూముల్లో ఉన్న కట్టడాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. అలాగే నిర్వాసితుల పునరావాసం కల్పిస్తున్న తూరంగి, ఏటిమొగ స్థలాలను అభివృద్ధి చేయాలన్నారు. ఏడీబీ రోడ్ విస్తరణ కోసం పెగ్ మార్కింగ్, బౌండరీ రాళ్ల ఏర్పాటు చేపట్టి, రివైజ్డ్ ఎల్పీ షెడ్యూల్ వెంటనే అందజేయాలని, తొలగించాల్సిన కట్టడాలు, చెట్ల విలువ నిర్ణయించి తెలియజేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. కోటిపల్లి – నర్సాపూర్ బ్రాడ్గేజ్ రైల్వే లైను అభివృద్ధి పనుల కోసం రామచంద్రపురం డివిజన్ కోటిపల్లి గ్రామంలో, అమలాపురం డివిజన్లో భట్నవిల్లి నుంచి సఖినేటిపల్లి వరకూ ఉమ్మడి సర్వే కార్యక్రమాలను వెంటనే చేపట్టాలన్నారు. ఏలేరు ఆధునికీకరణలో భాగంగా సబ్ డివిజన్ స్క్రూట్నీ ప్రక్రియను సత్వరం పూర్తి చేయాలని, రివైజ్డ్ ఎల్పీ షెడ్యూల్ సిద్ధం చేసి ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీకి ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓలు డేవిడ్రాజు, విశ్వేశ్వరరావు, ఏలేరు ఈఈ జగదీశ్వరరావు, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు.