ఆయకట్టుకు సాగునీరు అందించాలి
కోడేరు : సెప్టెంబర్ మొదటి వారంకల్లా ఆయకట్టుకు సాగునీరు అందించాలని కేఎల్ఐ ప్రాజెక్టు ఈఈ రాంచంద్రయ్యకు మంత్రి జూపల్లి కష్ణారావు సూచించారు. ఆదివారం కోడేరు మండలంలోని జొన్నలబొగుడ రెండో ఎత్తిపోతలను సందర్శించారు. ఇందులోభాగంగా పస్పుల, బావాయిపల్లి, కొండ్రావుపల్లి శివారులోని పెద్దకాల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీటికి ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే చేయాలని, కంపచెట్లను తొలగించాలన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలతో రైతులకు సాగునీరు అందించే విషయంలో అందరూ సహకరించాలన్నారు. దీనిపై రాజకీయం చేస్తున్న కొందరు నాయకులు తమ పద్ధతిని మార్చుకోకుంటే రాబోయే రోజుల్లో వారికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కోడేరు, పెద్దకొత్తపల్లి ఎంపీపీలు రాంమోహన్‌రావు, వెంకటేశ్వర్రావు, జెడ్పీటీసీ సభ్యుడు బస్తీరాంనాయక్, పస్పుల డాక్టర్ గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.