వారిది షేర్డ్ సైకోటిక్ డిజార్డర్ కావచ్చు!
మదనపల్లెలో ఇద్దరు విద్యాధికులైన తల్లిదండ్రులు ఒక ఉన్మాదం లాంటి స్థితిలో తమ ఇద్దరు కూతుళ్లనూ హత్య చేశారు. కలియుగం అంతమైపోయి ఆ మర్నాటి నుంచి సత్యయుగం ప్రారంభమవుతుందని నమ్మారు. తమ కూతుళ్లను ఆ యుగంలోకి పంపేందుకు పూజలు నిర్వహిస్తూ బిడ్డలను హతమార్చారు. పైగా తమ బిడ్డలు మరణించలేదనీ... కొద్దిసేపట్లో జీవించి తిరిగి లేస్తారని చెబుతున్నారు. యుగాంతమైపోతుందన్న నిహిలిస్టిక్ డెల్యూషన్స్‌తో పాటు మరెన్నో భ్రాంతులకు లోనైన ఈ తాజా సంఘటన ఇటీవలే మదనపల్లెలో చోటుచేసుకుంది.
సరిగ్గా పైన చెబుతున్న సంఘటనతో పోలికలు కనిపిస్తున్న ఉదంతం దాదాపు రెండేళ్ల కిందట ఢిల్లీ బురారీలో జరిగింది. ఆ సంఘటనలో ఒకే ఇంట్లో పదకొండు మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సంఘటనలో... చాలాకాలం కిందటే ఢిల్లీలోని నారాయణి దేవి అనే ఆవిడ భర్త చనిపోయాడు. ఆయన మరణించాక ఆ కుటుంబం కష్టనష్టాలకు లోనైంది. ఆ తర్వాత కుటుంబ పెద్ద తాలూకు రెండో కొడుకైన లలిత్ భాటియా తీవ్రమైన సైకోటిక్ డిజార్డర్‌కు గురయ్యాడు. దాంతో కొన్ని భ్రాంతులకు లోనయ్యాడు.
ఆ భ్రాంతులనే నిజమని నమ్ముతూ... తమ నాన్న తమతో మాట్లాడుతూ, బిజినెస్ సలహాలు ఇస్తున్నాడని భ్రమపడేవాడు. వాటిని పాటిస్తున్నందువల్లనే బిజినెస్ పుంజుకుందనీ, తమ కష్టాలు గట్టెక్కాయని నమ్ముతుండేవాడు. ఈ నమ్మకం ముదిరి, తాంత్రిక పూజల్లోకి దిగి, వటవృక్ష పూజ అనే తంతును నిర్వహిస్తే... కుటుంబ సభ్యులందరికీ మోక్షం తప్పదనీ, వటవృక్షపు ఊడల్లా వేలాడుతూ, తాము ఉరికి పాల్పడితే కొంత సమయం తర్వాత తామంతా తిరిగి బతుకుతామనీ విశ్వసించారు. దాంతో కుటుంబసభ్యులంతా పూజలో భాగంగా ఉరేసుకున్నారు. ఉరివేసుకున్న తర్వాత వారు బతకలేదు సరికదా... కుటుంబంలోని 11 మందీ చనిపోయారు.
ఈ రెండు సంఘటనలలో ఇంట్లో ఎవరికో ఒకరికి పూజలూ, ప్రాణాలను అర్పించడాలపై నమ్మకం కలిగింది. కాకపోతే అక్కడ లలిత్భాటియా నమ్మాడు. అలాగే మదనపల్లెలో కుటుంబపెద్ద పురుషోత్తం నాయుడో లేదా అతడి భార్య పద్మజనో నమ్మారనుకుందాం. మరి కూతుళ్ల విచక్షణ ఏమైంది? ఆ పూజలతో తాము తిరిగి బతుకుతామనే నమ్మకానికి ఎందుకు వచ్చారనే ప్రశ్నలు ఉద్భవిస్తాయి.
అలా ఒకరి నమ్మకాన్ని... కుటుంబసభ్యులందరూ కలిసి బలంగా విశ్వసించి, అలా తాను నమ్మిన సైకోటిక్ వైఖరిని మిగతావారికీ ‘షేర్’ చేసే వ్యాధి పేరే ‘‘షేర్డ్ సైకోసిస్’’. ఢిల్లీలో కుటుంబపెద్ద విశ్వాసానికి 11 మంది ప్రాణాలు కోల్పోతే... మదనపల్లె సంఘటనలో మంచి భవిష్యత్తు ఉన్న యువతులు తమ జీవితాలను కోల్పోయారు. పైగా ఈ సంఘటనలో పురుషోత్తం నాయుడు భార్య పద్మజ తనను తాను శివుని అంశగానూ, కొన్నిసార్లు, శివుడిగానే కొన్నిసార్లు భ్రమిస్తున్నారు. ఇలా భ్రాంతులకు (డెల్యూషన్స్కు) గురవడాన్ని డెల్యూషనల్ డిజార్డర్‌గా కూడా చెప్పవచ్చు. ఇక్కడ ఆ కుటుంబం రెండు రకాల డెల్యూషన్స్లో ఉంది. ఒకటి షేర్డ్ సైకోసిస్ డిజార్డర్ కాగా ఆమె భ్రాంతులతో కూడిన డెల్యుషన్ డిజార్డర్‌తోనూ బాధపడుతున్నారు. ఇక్కడ ఈ భార్యాభర్తల్లో ఎవరో ఒకరు మరొకర్ని ప్రభావితం చేసి ఉండవచ్చు. దాంతో భార్యాభర్తలలో సైకోసిస్ ‘షేర్’ అయి ఉండవచ్చు.
‘షేర్డ్ సైకోసిస్’ అంటే?
ఇది భ్రాంతులు కలిగించే ఒక రుగ్మత. దీన్నే ఇండ్యూస్డ్ డెల్యూజన్ డిజార్డర్ అని కూడా అంటారు. ఈ భ్రాంతి రుగ్మతకు వైద్యపరమైన మరో ఫ్రెంచ్ పేరు కూడా ఉంది. అదే ‘ఫోలీ ఎ డ్యుయో’ అంటే వాస్తవంగా డ్యుయో అంటే రెండు అని అర్థం. మదనపల్లె ఉదంతంలోనూ భార్యాభర్తలు ఇరువురి లో ఒకరు మరొకరిని ప్రభావితం చేసి ఉండవచ్చు. అలాంటప్పుడు ఇది ‘ఫోలీ ఏ డ్యూయో’ అవుతుంది.
ఒకవేళ ఇది కుటుంబ సభ్యుల్లో ఇద్దరికంటే ఎక్కువగా చాలామందికి వచ్చిందనుకోండి. అప్పుడు దీన్నే ‘ఫోలీ ఎన్ ఫ్యామిలే’ అంటారు. కానీ కూతుళ్లు ప్రభావితమయ్యారో లేదో అని ముందే అనుకున్నాం. ఒకవేళ అదే కుటుంబాన్ని దాటి ఇంకా చాలామందికి వచ్చిందనుకోండి. అప్పుడు దాన్ని ‘ఫోలీ ఎ ప్లసియర్స్’ అంటారు. ఇక మదనపల్లె దంపతుల్లో వారు యుగాంతం వస్తుందని నమ్మారు. ఇలా నమ్మడాన్ని ‘నిహిలిస్టిక్ డెల్యూషన్స్’ అంటారు. ఇలా ఆ దంపతులు ఈ నిహిలిస్టిక్ డెల్యూజన్స్ అనే మరో భ్రాంతికీ గురయ్యారు.
ఢిల్లీలోని బురారీ కుటుంబంలో ఒకరు ప్రేరేపించడం వల్ల అందరూ ఆత్మహత్యలు చేసుకుంటే, మదనపల్లెలో మళ్లీ బతుకుతారంటూ తల్లిదండ్రులే కూతుళ్లను చంపేశారు. పోలీసులు రావడం ఆలస్యమైతే వారూ చనిపోయేరంటూ వస్తున్న వార్తలను బట్టి చూస్తే ఇది కూడా షేర్డ్ సైకోసిస్‌లోని పోలీ ఎన్ ఫ్యామిలే అనేందుకే ఆస్కారం ఎక్కువగా కనిపిస్తోంది. షేర్డ్ సైకోసిస్ అనే ఈ రకమైన సైకియాట్రీ ప్రవర్తనను, రుగ్మతను ఫ్రెంచ్ సైకియాట్రిస్ట్‌లు అయిన చార్లెస్ లేసెగ్, జీన్ పెర్రీ ఫార్లెట్ను 19వ శతాబ్దంలో కనుగొన్నారు. అందుకే దీన్ని లేసెగ్–ఫార్లెట్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఈ వ్యాధిలోని చిత్రం ఏమిటంటే... కనీసం ఇద్దరు భ్రాంతులకు గురైనప్పుడు కానీ దీన్ని గుర్తించడం సాధ్యం కాదు.
గుర్తించడమెలా?
తమకు ఎవరెవరో కనిపిస్తున్నారనీ, ఏవేవో వినిపిస్తున్నాయనీ చెప్పే స్కీజోఫ్రీనియా వంటి లక్షణాలు వీరిలోనూ కనిపిస్తాయి. పైగా వీరిలో కొందరు అందరికీ కనిపించే తాను తాను కాదనీ, తాను దైవాన్ననీ చెబుతూ ఉంటారు. యుగాంతం సంభవించబోతుందని అంటారు. రకరకాల భ్రాంతులకు గురవుతూ అవి నిజమని నమ్ముతుంటారు.
చికిత్స
ఇలాంటి సైకోటిక్ రుగ్మతలు కౌన్సెలింగ్‌తో తగ్గవు. తప్పనిసరిగా మందులతో చికిత్స తీసుకోవాల్సిందే. పేషెంట్స్ మెదడులో జరిగిన మార్పుల కారణంగా ఆ భ్రాంతులు వాళ్లవరకు నిజమే. కానీ ఆరోగ్యవంతులు అది సరికాదంటూ వారితో వాదించకూడదు. అందుకే పేషెంట్స్‌తో వ్యవహరించాల్సిన తీరుపై కుటుంబసభ్యులకు కొంత కౌన్సెలింగ్ అవసరమవుతుంది. కానీ ఈ వ్యాధులు కౌన్సెలింగ్‌తో తగ్గవు. ఈ తరహా రోగులకు యాంటీసైకోటిక్ మందులు, యాంగై్జటీని తగ్గించే మందులు, నిద్రలేమికి ఇవ్వాల్సిన ట్రాంక్విలైజర్లతో చికిత్స చేయాల్సి రావచ్చు.
ఏమిటీ డెల్యూషన్ డిజార్డర్లు
షేర్డ్ సైకోసిస్’కు వ్యక్తులు ఎందుకు, ఎలా గురవుతారో తెలుసుకునే ముందర... అసలు సైకోసిక్ అనే మానసిక రుగ్మతకు ఎలా గురవుతారోతెలుసుకోవాలి. మన మెదడులో పది పక్కన పన్నెండు సున్నాలు పెట్టినంత పెద్ద సంఖ్యలో నాడీకణాలు ఉంటాయి. మళ్లీ ఒక్కో కణానికీ పక్కనున్న పొరుగు కణాలతో అనేక కనెక్షన్లు ఉంటాయి. ఈ కనెక్షన్ల మధ్య కొన్నిచోట్ల ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ఖాళీ స్థలంలో మెదడుకు సంబంధించిన కొన్ని రసాయనాలు ఉంటాయి. మెదడులోని రసాయనాలలో డోపమైన్, సెరిటోనిన్, ఎపీనెఫ్రిన్ వంటివి కొన్ని రసాయనాలు ఉంటాయి.
ఈ రసాయనాలు తమ నార్మల్ స్థాయిని దాటి పెరిగినప్పుడు ‘సైకోటిక్ డిజార్డర్స్’ వస్తాయి. అంటే నిజానికి ఏ సంఘటనా జరగకపోయినా, మెదడు లో ఈ రసాయనాల మార్పులు జరిగినప్పుడు... వారికి నిజంగా ఏదో జరిగినట్లు భ్రాంతి కలుగుతుంది. అలా జరగని సంఘటనను జరిగినట్లుగా భావించే అనుభూతినే ఇంగ్లిష్‌లో ‘హేలూసినేషన్స్’ అంటారు. ఈ హేలూసినేషన్స్తో సైకోసిస్‌కు గురైన వారు మళ్లీ... ఇతరులను ప్రభావితంచేస్తే... పక్కవారిలోనూ కనిపించే మానసిక సమస్యనే ‘షేర్డ్ సైకోసిస్’ అంటారు. దాంతోపాటు తల్లిదండ్రులిద్దరూ డెల్యూషన్ డిజార్డర్‌తోనూ బాధపడుతున్నారు.
డాక్టర్ శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై
హెచ్ఓడీ అండ్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ, ఎమ్జీఎమ్ గవర్నమెంట్ హాస్పిటల్, వరంగల్
సూచన: ఎవరైనా విచిత్రంగా, వింతగా వ్యవహరించడం, వాళ్ల ఆలోచనలూ అసాధారణంగా ఉండి, వివరణలకు అందకుండా ఉండటం వంటి లక్షణాలతో మానసిక రుగ్మతలను తేలిగ్గా గుర్తించవచ్చు.
ఇలా ఎవరైనా ప్రవర్తిస్తూ ఉంటే వారిని తక్షణం గుర్తించి, వీలైనంత త్వరగా వారిని సైకియాట్రిస్ట్‌ల దగ్గరికి తీసుకెళ్లడం అవసరం.