అమెరికాలో ఉన్మాది కాల్పులు
నలుగురి మృతి
లాస్‌ఏంజిలిస్: అమెరికా మళ్లీ కాల్పుల మోతతో దద్దరిల్లింది. కాన్సాస్‌లోని లాన్ మూవర్ ఫ్యాక్టరీ వద్ద గురువారం రాత్రి ఓ ఉన్మాది రైఫిల్‌తో వీరంగం సృష్టించాడు. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించగా.. 14 మంది గాయపడ్డారు. తర్వాత పోలీసు కాల్పుల్లో దుండగుడు మరణించాడు.
కాల్పులు జరిపిన దుండగుడ్ని ఎక్సెల్ ఇండస్ట్రీస్‌లో పనిచేస్తున్న ఉద్యోగిగా గుర్తించారు. తొలుత తన కారులో బయల్దేరిన అతను మోటార్‌సైకిల్‌పై వెళుతున్న ఇద్దరిపై కాల్పులు జరిపాడు. అనంతరం ఓ ట్రక్కును దొంగిలించి లాన్‌మూవర్ ఫ్యాక్టరీకొచ్చి పార్కింగ్ ప్రదేశంలో మహిళను రైఫిల్‌తో కాల్చాడు. తర్వాత లోపలికొచ్చి కాల్పులు జరిపాడని పోలీసు అధికారి వాల్టన్ తెలిపారు. దుండగుడి పేరును సెడ్రిక్ ఫోర్డ్(38) అని స్థానిక మీడియా పేర్కొంది.