Public and private hospitals
-
మిథ్యగా నగదు రహిత వైద్యం..!
♦ ప్రభుత్వ ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ♦ కేన్సర్‌తో వచ్చిన ఓ ఉద్యోగి భార్యను నెలన్నర తిప్పి గాలికొదిలేసిన నిమ్స్ ♦ రూ. 200 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీకి బకాయి ఉన్నందునే ఈ పరిస్థితి ♦ సమస్యను పరిష్కరించడంలో వైద్య ఆరోగ్యశాఖ వైఫల్యం సాక్షి, హైదరాబాద్: అతను ఖమ్మం జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. భార్యకు కేన్సర్ సోకడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కేన్సర్ ఆస్పత్రిలో చేర్చాడు. అక్కడ నగదు రహిత వైద్యం అమలు కాక ప్రతి 21 రోజులకు ఒకసారి వేయాల్సిన సూదిమందుకు వేలాది రూపాయలు చెల్లించాడు. 4 నెలలు ఇబ్బందులు పడి వైద్యం చేయిం చాడు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం.. సన్నిహితుల సూచన మేరకు భార్యను నిమ్స్‌లో చేర్చాడు. నగదు రహిత వైద్యం అందిస్తామని.. 21 రోజుల తర్వాత వస్తే సూది మందు వేస్తామని నిమ్స్ వైద్యులు చెప్పారు. 21 రోజులకు వస్తే.. ఈసారికి ప్రైవేటు ఆస్పత్రిలో సూదిమందు వేయించుకోమని సలహా ఇచ్చారు. గత్యంతరం లేక అప్పు చేసి మందు వేయించాడు. మళ్లీ 21 రోజుల తర్వాత రెండోసారి నిమ్స్‌కు వస్తే.. తాము నగదు రహిత వైద్యం చేయలేమని చేతులెత్తేశారు. నెలన్నరపాటు తిప్పి చివరకు గాలికొదిలేశారు. గత్యంతరం లేక భార్య ప్రాణాలు కాపాడుకునేందుకు ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించాడు. ఇలాగే ప్రభుత్వ వైద్య గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నేత కూడా తన తండ్రికి నగదు రహిత వైద్యం చేయించుకోలేకపోయారు. దీంతో ఆయన ఇటీవలే కన్నుమూశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం ఎంత గొప్పగా అమలవుతుందో ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ప్రభుత్వాన్ని నమ్ముకున్న వేలాది మంది ఉద్యోగులకు ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులు చుక్కలు చూపిస్తున్నాయి. ఆరోగ్య కార్డులకు విలువేది? తెలంగాణ రాష్ట్రంలో 5.5 లక్షల మంది ఉద్యోగులు, మరో లక్షన్నర మందికిపైగా పింఛన్‌దారులు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులతో కలుపుకుంటే దాదాపు 22 లక్షల మందికిపైగా ఉన్నారు. వారందరి కోసం ప్రభుత్వం నగదు రహిత వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నీ ఉద్యోగులందరికీ ఉచిత వైద్య సేవలు అందించాలి. కానీ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కడా నగదు రహిత చికిత్సలు అందక వేలాది మంది ఉద్యోగులు సొంత డబ్బులు చెల్లిస్తున్నారు. ఇక కార్పొరేట్ ఆస్పత్రులైతే నగదు రహిత వైద్యం చేయబోమని సర్కారుకు తేల్చిచెప్పేశాయి. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలను సర్కారు ప్రారంభించినా.. ఆయా ఆస్పత్రులు దీన్ని ఏమాత్రం పట్టించుకోవడంలేదు. రూ. 200 కోట్ల బకాయిలు.. ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి రూ. 200 కోట్ల మేర బకాయిలు పడింది. దీంతో ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకున్న పేదలు, ప్రభుత్వ ఉద్యోగుల తరఫున బిల్లులు పెట్టిన ఆస్పత్రులకు చెల్లింపులు జరగలేదు. బకాయిలు చెల్లించకపోవడంతో ఉద్యోగులకు వైద్య సేవలను ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు దాదాపు నిలిపివేశాయి. ఉచిత ఓపీ సేవలనూ ఆస్పత్రులు అమలు చేయడంలేదు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఉద్యోగుల కోసమే ప్రత్యేక ఓపీ సేవలు అందించాలని నిర్ణయించి నా.. పూర్తిస్థాయిలో ఉచిత ఓపీ సేవలు అందడంలేదని ఉద్యోగులు చెబుతున్నారు. -
వణికిస్తున్న జ్వరాలు
ఆస్పత్రుల పాలవుతున్న రోగులు బెలగాం, న్యూస్‌లైన్: పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా జ్వరాలు వణికిస్తున్నాయి. పార్వతీపురం పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కువగా వైరల్ జ్వరాలతో బాధపడుతూ అస్పత్రులకు వస్తున్నారు. దీంతో గురువారం నాటికి ఏరియా ఆస్పత్రిలో సుమారు 130మంది రోగులు చికిత్స పొందుతున్నారు. జ్వరాల కేసులు ఎక్కువగా ఉంటున్నాయని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. పార్వతీపురం పట్టణం, మండలంతో పాటు గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, తదితర మండలాలనుంచి జ్వరపీడితులు పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి వస్తున్నారు. ప్రతిరోజూ ఓపీలో దాదాపు 500మంది చికిత్స కోసం వ స్తే వారిలో 300మంది వరకు జ్వరపీడితులే ఉంటున్నారు. తీవ్రమైన ,తలనొప్పి, కాళ్లు, చేతుల పీకులు,కండరాల నొప్పులు తదితర లక్షణాలతో బాధపడుతున్నవారు ఆస్పత్రిలో చేరుతున్నారు. ప్రస్తుతం ఇక్కడి రెండు వార్డుల్లో 40మంది జ్వరపీడితులు చికిత్స పొందుతున్నారు. వాతావరణ మా ర్పుల కారణంగా జ్వరాలు ప్రబలుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. జాగ్రత్తలు పాటించాలి... వాతావరణ మార్పుల వల్లే జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం వైరల్ జ్వరాల ఉనికి కనిపిస్తోంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే జ్వరాల బారిన పడకుండా ఉండవచ్చు. మంచినీటిని మరిగించి చల్లార్చి వడపోసి తాగడం మేలు. నిల్వ ఆహారపదార్థాలను తీసుకోకూడదు. ఎండ వాతావరణంలో బయటకు వెళ్లేవారు తల, ముఖానికి కప్పుకోవడం మంచిది. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే దోమలు వృద్ధి చెందవు. జాగ్రత్తలు పాటిస్తూ దోమతెరలు వినియోగించడం ఎంతో ఉపయుక్తం. - డాక్టర్ జి.నాగభూషణరావు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్