ఊరూవాడా సంబరం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా మూడో రోజు శనివారం కూడా పాదయాత్రలు, ర్యాలీలు, బైక్ ర్యాలీలు, ముఖ్యమంత్రి జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు, పుష్పాభిషేకాలు కొనసాగాయి. మూడో రోజు విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీల్లో పాల్గొన్నారు.
‘సీమ’లో ర్యాలీలు, మానవహారాలు
కొత్త జిల్లాల ఏర్పాటుపై రాయలసీమ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అన్నమయ్య, శ్రీ సత్యసాయి పేర్లతో జిల్లాలను ఏర్పాటు చేయడంపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో వేలాది మంది విద్యార్థులతో వైఎస్సార్సీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు మానవహారం చేపట్టారు. రాయచోటి నియోజకవర్గం చిన్నమండెంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ అనంతపురం జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్లమాడలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అంతకుముందు వేలాదిమందితో బైక్ ర్యాలీ చేపట్టారు. కదిరి, కల్యాణదుర్గంలలో స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. మడకశిరలో ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళల భారీ మానవహారం
అనంతపురం కేఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థినులు ‘థాంక్యూ సీఎం సార్’ అంటూ అక్షర క్రమంలో కూర్చొన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, పూతలపట్టు, సత్యవేడు నియోజకవర్గాల్లో జిల్లాల పునర్విభజనకు సంఘీభావంగా భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. థాంక్యూ సీఎం సార్ అంటూ నినదిస్తూ ప్రదర్శనలు చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు ఆదిమూలం, ఎంఎస్ బాబు, మహిళా నేత బియ్యపు పవిత్రారెడ్డి పాల్గొన్నారు. కర్నూలు జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో సుపరిపాలనకు బాటలు పడ్డాయని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. నంద్యాలను జిల్లాగా ఏర్పాటు చేయడంతో బనగానపల్లె నియోజకవర్గం అవుకులో భారీ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, పత్తికొండ, ఆస్పిరి, కొసిగి పట్టణాల్లో కూడా స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ర్యాలీలు చేపట్టాయి.
గోదావరి జిల్లాల్లో సంబరాలు
కొత్త జిల్లాల ఏర్పాటును హర్షిస్తూ తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సంబరాలు నిర్వహించారు. అంబాజీపేటలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, ఎంపీ చింతా అనురాధ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువజన సంఘాల నేతలు పాదయాత్ర చేశారు. మలికిపురం ప్రధాన కూడలిలో విద్యార్థులతో నిర్వహించిన మానవహారంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నేత చందన నాగేశ్వర్ ఆధ్వర్యంలో ధవళేశ్వరంలో 25 అడుగుల ఎత్తున పూలతో సీఎం జగన్ కటౌట్ ఏర్పాటు చేసి పుష్పాభిషేకం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో పాదయాత్రలు, బైక్ ర్యాలీలు చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని ర్యాలీలో పాల్గొన్న పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ తదితరులు
కొవ్వూరులో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో సంఘీభావ యాత్ర చేశారు. పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గణపవరంలో ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆ«ధ్వర్యంలో కళాశాల విద్యార్థులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు జూనియర్ కళాశాల నుంచి గణపవరం సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించి మానవహారం చేపట్టారు. ద్వారకా తిరుమలలో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు బైక్ ర్యాలీ నిర్వహించారు. నూతన జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ 50 మంది టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. దెందులూరులో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి నాయకత్వంలో సంఘీభావ యాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సింహపురిలో క్షీరాభిషేకాలు, పుష్పాభిషేకాలు
జిల్లాల విభజనను స్వాగతిస్తూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతలు ర్యాలీలు నిర్వహించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో 2 వేల మంది మహిళలతో భారీ ర్యాలీ చేపట్టారు. సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కోట షాదీమంజిల్ వద్ద గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నెల్లూరు నగరంలో మహిళా కార్పొరేటర్లు ర్యాలీ నిర్వహించారు.
ఉత్తరాంధ్రలో ఉరిమే ఉత్సాహం
కొత్త జిల్లాలను ఏర్పాటును హర్షిస్తూ విశాఖపట్నం జిల్లావ్యాప్తంగా బైక్ ర్యాలీలు, ర్యాలీలు, క్షీరాభిషేకాలు నిర్వహించారు. మాడుగుల, చోడవరం, పాయకరావుపేట, అరకు, పాడేరు, యలమంచిలి, భీమిలి, గాజువాక, విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు చేపట్టారు. మరికొన్ని చోట్ల పాదయాత్రలు చేశారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ ఆధ్వర్యంలో గోకుల్ పార్క్ నుంచి ఆర్కే బీచ్ వరకు 900 మంది కేరళ డప్పులు, ఒంటె, పులి వేషాలు ధరించి కోలాటమాడారు. ఆర్కే బీచ్‌లో 26 జిల్లాల రాష్ట్ర మ్యాప్ సైకత శిల్పాన్ని ఆవిష్కరించారు.
వైఎస్సార్ జిల్లా పులివెందులలో విద్యార్థుల భారీ ర్యాలీ
ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, రాష్ట్ర మైనార్టీ, రెల్లి కార్పొరేషన్ చైర్మన్లు జాన్ వెస్లీ, వడ్డాది మధుసూదన్‌రావు పాల్గొన్నారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మధురవాడ క్రికెట్ స్టేడియం నుంచి జీవీఎంసీ జోనల్ కార్యాలయం వరకు ఐదు వేల మందితో భారీ చైతన్య ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు, విజయనగరంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, పూసపాటిరేగలో ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, ఎస్.కోటలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ర్యాలీలు సాగాయి. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు ర్యాలీలు నిర్వహించారు.
రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా ప్రకటిస్తూ గిరిజన ప్రాంతంలో మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలను ఏర్పాటు చేయడం, ఎచ్చెర్లను శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగించడాన్ని జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతించారు. ఈ మేరకు శనివారం శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏలో జరిగిన పాలకవర్గ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి అప్పలరాజు, కలెక్టర్ శ్రీకేష్, ఎంపీ మాధవి, ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, రెడ్డి శాంతి, కంబాల జోగులు, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్, మాధవ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, తదితరులు పాల్గొన్నారు.
కోటప్పకొండకు పాదయాత్ర.. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో విద్యార్థుల భారీ ర్యాలీ
నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేయడం పట్ల సంఘీభావం తెలియజేస్తూ గుంటూరు జిల్లా నరసరావుపేటలో శివుడి బొమ్మ వద్ద నుంచి కోటప్పకొండ వరకు 14 కి.మీ. పాదయాత్ర నిర్వహించారు. ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు పాదయాత్రను ప్రారంభించారు. ఇందులో వేలాది మంది పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో వందలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ షేక్ సజీల, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేస్తున్న పార్టీ శ్రేణులు, ప్రజలు
వినుకొండలో విద్యార్థులు, ప్రజలతో కలిసి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్‌బాబు, కరణం బలరామకృష్ణమూర్తి పాల్గొని సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఏపీ శాప్‌నెట్ చైర్మన్ బాచిన కృష్ణచైతన్య ఆధ్వర్యంలో అద్దంకిలో విద్యార్థులు, యువత ర్యాలీ నిర్వహించారు. కనిగిరి, చీరాలలో కూడా ర్యాలీలు కొనసాగాయి. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని హర్షిసూత్ పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక పాల్గొన్నారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి ఆధ్వర్యంలో కానూరు నుంచి యనమలకుదురు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్, ఆర్టీసీ రీజనల్ చైర్పర్సన్ తాతినేని పద్మావతి పాల్గొన్నారు. ఎన్టీఆర్ అభిమానులు చెన్నుపాటి హరనాథ్, లింగమనేని శివకుమార్, వెలగపూడి బబ్లు వైఎస్సార్సీపీలో చేరారు. కైకలూరు నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలో విలీనం చేసినందుకు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు నేతృత్వంలో కైకలూరులో భారీ కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు.
ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ పాల్గొన్నారు. ఘంటసాలలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు బైక్ ర్యాలీ నిర్వహించారు. మచిలీపట్నాన్ని జిల్లాగా ప్రకటించినందుకు పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ బంటుమిల్లిలో సంఘీభావ ర్యాలీ చేపట్టారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ విద్యార్థి, యువజన సంఘాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. తిరువూరు రెవిన్యూ డివిజన్ ఏర్పాటును స్వాగతిస్తూ ఎమ్మెల్యే కె.రక్షణనిధి ఎ.కొండూరు మండల కేంద్రంలో పార్టీ శ్రేణులతో పాదయాత్ర చేశారు.