విఎండీఏకి ఓకే
- వుడా బోర్డు ఆమోదముద్ర
- నెల రోజుల్లో మళ్లీ బోర్డు సమావేశం
విశాఖపట్నం సిటీ: వీఎండీఏ ప్రతిపాదనకు వుడా బోర్డు ఓకే చెప్పింది. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. ఈ సమావేశం మళ్లీ నెల రోజుల్లో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. 80 అంశాల్లో 70 అంశాలు మాత్రమే చర్చించారు. మిగిలిన వాటితో పాటు కొత్త అంశాలను రూపొందించి వచ్చే బోర్డు సమావేశానికి ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. పట్టణ పురపాలక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కరికల వలవన్ అధ్యక్షతన జరిగిన వుడా బోర్డు సమావేశం సుధీర్ఘంగా జరిగింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకల్లా పూర్తవుతాదని భావించిన ఈ సమావేశం రాత్రి 7.30 గంటల వరకూ జరిగింది. ముందుగా అనుకున్న అన్ని అంశాలకు బోర్డు ఆమోదం పొందింది. ఇవీ నిర్ణయాలు.
- వుడాలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఎన్ఎంఆర్, టైం స్కేల్ ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో కనీసం రూ. లక్ష ప్రయోజనం కల్పించనున్నారు.
- సంస్థనే నమ్ముకుని వికలాంగులుగా మారిన ఉద్యోగులకు రూ. 3 లక్షల ప్రయోజనం కల్పించనున్నారు.
- మాస్టర్ రోడ్లు, పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తారు.
-వుడాలో ఖాళీగా ఉన్న దాదాపు 106 ఉద్యోగాలను భర్తీ చేసుకునేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయనున్నారు.
- శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ లక్ష్మీనర్సింహం బోర్డు సమావేశంలో ప్రతీ అంశాన్ని గుచ్చిగుచ్చి ప్రశ్నించడంతో అవసరమైన జీవోలన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకునే సరికి బాగా ఆలస్యమైనట్టు అధికారులంటున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచే తీర్మానం కూడా వచ్చే సమావేశంలో పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.