Pujai
-
శ్రుతికి ప్రత్యేక రక్షణ
సెలబ్రిటీలకు స్వేచ్ఛ కరువవుతోందా? వారి జీవితం దిన దిన గండంగా భయభ్రాంతులమయంగా మారుతోందా? నటి శ్రుతి హాసన్ ఇక్కట్లు చూస్తే ఇలాంటి సందేహాలే కలుగుతాయి. ఎందుకంటే ఆమెకిప్పుడు స్వేచ్ఛే కరువవుతోంది. బయట ప్రపంచంలోకి ప్రవేశిస్తే రక్షణ వలయంతో గడపాల్సిన పరిస్థితి. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ భారతీయ నటిగా గుర్తింపు పొందిన శ్రుతి హాసన్ ముంబాయిలో నివశిస్తున్నారు. శ్రుతి గ్లామర్ విషయాల్లో పరిధులు దాటి నటిస్తున్నారనే అపవాదు ఉంది. ఆ మధ్య హిందీలో డి-డే అనే చిత్రంలో వేశ్యగా నటించి పలు విమర్శలను మూటగట్టుకున్నారు. ఆ సమయంలో ఒక అగంతకుడు శ్రుతి అద్దెకుంటున్న ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడికి చేసే ప్రయత్నం చేశాడు. శ్రుతి ఫిర్యాదుతో ముంబాయి పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. అలాగే ఎవడు అనే తెలుగు చిత్రంలో శ్రుతిమించి అందాలార బోసిన ఫొటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేశాయి. ఇది అంతా నిర్మాత దుశ్చర్యే నంటూ శ్రుతి ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. ఇటీవల డెహ్రాడూన్‌లోని హోటల్లో బస చేసిన శ్రుతిహాసన్ గది తలుపు తట్టి ఒక తాగుబోతు అల్లరి చేసే ప్రయత్నం చేశాడు. అతనిపై శ్రుతి హాసన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి అల్లరోళ్ల చిల్లర ప్రవర్తనతో శ్రుతి భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో ఆమెకు ప్రత్యేక భద్రత అవసరం అయ్యింది. ప్రస్తుతం శ్రుతిహాసన్ తమిళంలో విశాల్ సరసన పూజై చిత్రంతోపాటు హిందీలో యారా అనే చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్ ప్రాంతాల్లో శ్రుతికి ప్రత్యేక రక్షణ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆమె షూటింగ్ ముగించుకుని హోటల్ రూమ్‌కు వెళ్లే వరకు భద్రతా వలయంలోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది. -
పూజై ఫస్ట్‌లుక్‌కు విశేష ఆదరణ
పూజై చిత్ర ఫస్ట్‌లుక్ ఫొటోలకు విశేష ఆదరణ లభించింది. విశాల్, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న చిత్రం పూజై. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న మూడవ చిత్రం ఇది. దీనికి కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమైన ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ దేశంలోని ముఖ్యమైన సమస్యపై హీరో చేసే పోరాటమే ఈ చిత్ర ప్రధానాంశమన్నారు. దాన్ని కుటుంబ నేపథ్యంలో చక్కని ప్రేమ సన్నివేశాలను జోడించి చిత్రీకరిస్తున్నామని చెప్పారు. ముక్కోణపు ప్రేమ కథలా ఇది ముక్కోణపు యాక్షన్ కథా చిత్రమని తెలిపారు. గత చిత్రాల మాది రిగానే ఈ పూజైలోను జనరంజక అంశాలు ఉంటాయని వివరించారు. ఇంతకుముందు విశాల్ హీరోగా చేసిన తామరభరణి చిత్రం పూర్తిగా యాక్షన్ ఓరియంటెండ్ కథా చిత్రం కాదన్నారు. పూజై మాత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కథా చిత్రమన్నారు. ఈ చిత్ర కథ కోయంబత్తూరు నేపథ్యంలో సాగుతుందన్నారు. పూజై చిత్రానికి అందమైన హీరోయిన్ అవసరం అయ్యారని చెప్పారు. అలాంటి మోడ్రన్ లుక్, ఫ్రెష్‌నెస్ టచ్‌కు శ్రుతిహాసన్ కరెక్టుగా ఉంటుందని భావించి, ఆమెను ఎంపిక చేశామని చెప్పారు. చిత్రంలో శ్రుతిహాసన్ పాత్ర ఆరంభం నుంచి చివరి వరకు ఉంటుందని దర్శకుడు హరి పేర్కొన్నారు.