మృత్యుంజయురాలు కృష్ణవేణి
హిరమండలం: చెన్నైలో మూడు రోజుల కిందట జరిగిన దుర్ఘటన నుంచి గొట్టాకు చెందిన ఓ మహిళ ప్రాణాలతో బైటపడింది. బహుళ అంతస్తుల భవనం శిథిలాల కింద చిక్కి రెండు రోజులు నరకం అనుభవించిన ఆమెను సోమవారం సాయంత్రం సహాయక బృందం సభ్యులు ప్రాణాలతో బైటకు తీశారు. ఈ సమాచారం అందిన వెంటనే ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇది ఆమెకు పునర్జన్మేనని గ్రామస్తులు అంటున్నారు. వివరాలు ఇవీ... చెన్నైలో జరిగిన దుర్ఘటనలో శిథిలాల కింద హిరమండలం మండలం గొట్టకు చెందిన మీసాల శ్రీను, ఆయన కుమార్తె భవాని, కొంగరాపు కృష్ణవేణి, ఆమె భర్త శ్రీను, లక్ష్మీపురానికి చెందిన పెసైక్కి జ్యోతి చిక్కుకున్న విషయం పాఠకులకు తెలిసిందే.
శిథిలాలు తొలగిస్తుండగా కృష్ణవేణి ప్రాణాలతో బయటపడింది. విషయం తెలిసి ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా తతిమా వారు కూడా ప్రాణాలతో బైటపడొచ్చన్న ఆశ గ్రామస్తుల్లో చిగురిస్తోంది. దుర్ఘటన జరిగిన వెంటనే ఇక్కడి నుంచి చెన్నై వెళ్లిన వారు ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఇక్కడకు చేరవేస్తునే ఉన్నారు. వీరిలో ఒకరైన ఆర్ఐ శంకర్‌ను సంప్రదించగా కృష్ణవేణి ఆరోగ్యం నిలకడగా ఉందని, స్వల్ప గాయాలు తగలడంతో రామచంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని చెప్పారు. కాగా కృష్ణవేణి తన పిల్లలు సాయి, సుశ్మితతో ఫోన్లో మాట్లాడారు. తాను క్షేమంగానున్నానని త్వరలోనే ఇంటికొచ్చేస్తానని చెప్పింది.
సంఘటన జరిగిన సమయంలో భర్త తనను బయటకు నెట్టివేయడం వల్లే బతికానని, ఆయన ఆచూకీ ఇంకా తెలియరాలేదని చెప్పిందని గ్రామస్తులు తెలిపారు. అలాగే పెసైక్కి సింహాచలం ఫోన్లో మాట్లాడుతూ తన భార్య జ్యోతి ఇంకా శిథిలాల కిందే ఉందని చెప్పారు. అయితే సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. చైన్నై అధికారులు భోజనాల ఏర్పాట్లు చేస్తున్నారని, కానీ కుటుంబ సభ్యులు చిక్కుకోవడంతో తామే పస్తులుంటున్నామని చెప్పారు. పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, పాలకొండ ఆర్డీవో తేజ్‌భరత్, రాజాం తహశీల్దార్ జె.రామారావు, హిరమండలం ఆర్ఐ శంకర్ రావడంతో తమకు మానసిక స్థైర్యం వచ్చిందన్నారు.