నీటి ఎద్దడి సమస్యపై బీజేపీ రాస్తారోకో
పింప్రి, న్యూస్‌లైన్: సమస్యల పరిష్కారం కోసం నగరంలో గురువారం బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఆ పార్టీ నగర శాఖ అధ్యక్షుడు ఏక్నాథ్ పవార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పుణే’-ఆలంది మార్గాన్ని ఆధునీకరించడంతోపాటు నగరవాసులు ఎదుర్కొంటున్న నీటి కొరత, విద్యుత్ సరఫరాలో కోత సమస్యలను పరిష్కరించాలని, శ్మశాన వాటికకు తక్షణమే స్థలం కేటాయించాలంటూ ఆ పార్టీ నాయకులు ఈ సందర్భంగా కార్పొరేషన్‌ను డిమాండ్ చేశారు. కాగా రాస్తారోకోలో భాగంగా మహిళలు ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
రాస్తారోకో అనంతరం ఆ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ నీటి కొరత సమస్య కారణంగా నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలో విద్యార్థులకు మంచినీరు సదుపాయం లేదని అవస్థలు పడుతున్నారన్నారు. వెంటనే నీరు, రహదారులు, విద్యుత్ తదితర కనీస అవసరాలను తీర్చాలని కోరారు. ఆలంది మార్గం, చోవిస్వాడి, వడముఖ్ తదితర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ’మోడల్ సిటీ‘ అనే నినాదం కల కలగానే మిగిలిపోయిందని, వెంటనే కార్పొరేషన్ కమిషనర్ పది రోజుల్లో అన్ని సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రమోద్ తాహ్మణ్కర్, శీతల్ షిండే, యువమోర్చా నేత అనూప్ మోరే పాల్గొన్నారు.