విషజ్వరంతో డిగ్రీ విద్యార్థిని మృతి
వీరఘట్టం (శ్రీకాకుళం జిల్లా): విషజ్వరంతో డిగ్రీ విద్యార్థిని ఎం.పుణ్యవతి మృతి చెందింది. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం విక్రమపురం గ్రామానికి చెందిన ఎం.పుణ్యవతి ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు అప్పారావు, రమణమ్మ కూలిపనులుచేసి జీవనం గడుపుతున్నారు. గతనెల 24వ తేదీన వీరందరూ గోదావరి పుష్కరాలకు వెళ్లివచ్చారు. అప్పటి నుంచి పుణ్యవతి జ్వరంతో బాధపడుతోంది.
ప్రైవేట్ వైద్యుల వద్ద చూపించినా ప్రయోజనం లేకపోవడంతో ఈనెల 4వ తేదీన శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మలేరియా జ్వరం విషమించిందని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్ కు తీసుకెళ్లాలని సూచించారు. దాంతో గురువారం కేజీహెచ్‌కు తీసుకెళుతుండగా మార్గంమధ్యలోనే పుణ్యవతి మృతిచెందింది.