రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం
సాక్షి, బళ్లారి : రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం పాలైన దుర్ఘటన గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సింధనూరుకు చెందిన పూర్ణయ్య (63) కోటేశ్వరమ్మ (55) దంపతులు మరో ముగ్గురితో కలిసి బళ్లారికి మారుతీ స్విఫ్ట్ కారులో వస్తుండగా బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకా సింధిగేరి గ్రామ సమీపంలో ఉదయం 7 గంటల సమయంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టుకు ఢీకొనడంతో పూర్ణయ్య, కోటేశ్వరమ్మ అక్కడికక్కడే మృతి చెందారు.
డ్రైవర్‌తోపాటు కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ స్పృహ కోల్పోయాడు. అయితే క్షతగాత్రులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే బళ్లారి రూరల్ డీఎస్పీ రుద్రమని, కురుగోడు సీఐ లక్ష్మికాంతయ్య, ఎస్ఐ సోమశేఖర్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కురుగోడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.