క్షేత్రస్థాయికి వెళ్లి చక్కదిద్దండి
పుష్కర పనులపై అధికారులకు సీఎం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు కేవలం మరో నెలరోజులే గడువున్నప్పటికీ పనులు మాత్రం ఆశించిన రీతిలో సాగకపోవడంపై ప్రభుత్వం అధికారులపై గుర్రుగా ఉంది. ఈనెల 15 నాటికే పనులన్నీ పూర్తిచేయాలని నిర్ణయించినప్పటికీ ఇప్పటివరకు కేవలం 70 శాతం మేర మాత్రమే పనులు పూర్తవడం, చాలా పనులు ఇంకా మొదలే కాకపోవడంపై సర్కారు ఆందోళన చెందుతోంది.
దీనిపై ఇటీవలే సమీక్షించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, సీఎస్ రాజీవ్‌శర్మలు పనుల్లో జాప్యానికి గల కారణాలు, పనుల నాణ్యతలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి పర్యవేక్షించాలని ఆదేశించారు. పనుల జాప్యం, నాణ్యతపై నివేదికలు అందిస్తే తదునుగుణంగా సత్వర చర్యలు తీసుకోవచ్చని సూచిం చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో ఐదు జిల్లాల పరిధిలో పనులను పర్యవేక్షించేందుకు ఇరిగేషన్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ప్రజారోగ్యం, దేవాదాయ శాఖలకు చెందిన కార్యదర్శులు, ఈఎన్సీలతో కూడిన ఉన్నతస్ధాయి బృందం కదలి వెళ్లనుంది.