pusharalu
-
గోదావరి తల్లి రుణం తీర్చుకుందాం
♦ పుష్కరాల్లో గోదావరివాసులు మమేకం కావాలి ♦ పుష్కర శంఖ ం పూరించిన సీఎం చంద్రబాబు ♦ కన్నులపండువగా నిత్యహారతి ఆరంభం సాక్షి, రాజమండ్రి : ‘గోదావరి నది తెలుగు ప్రజల జీవనాడి. ఆ తల్లి రుణం తీర్చుకునే సమయం ఇదే. ఇవి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు మాత్రమే కావు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా పుష్కరమిది. దీన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇందులో గోదావరివాసులు భాగస్వాములు కావాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. గోదావరి నిత్య హారతి ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన బుధవారం రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. సంక్రాంతి, ఉగాది పండుగల కంటే గొప్పగా పుష్కరాలను నిర్వహించాలని చెప్పారు. ‘2003 పుష్కరాలకు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఆ పుష్కరాలను చరిత్రలో నిలిచిపోయేంత గొప్పగా నిర్వహించాను. ఈసారి అంతకన్నా గొప్పగా, మహా కుంభమేళా తరహాలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది’ అని సీఎం తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా లెక్క చేయకుండా దాదాపు రూ.1,600 కోట్లు ఖర్చు పెట్టి పుష్కరాలు నిర్వహిస్తున్నామన్నారు. గోదావరి తల్లి కరుణిస్తే రాష్ట్రంలో పేదరికం అనేదే ఉండదని చెప్పారు. నదుల అనుసంధానం ద్వారా గోదావరి నీటిని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ తీసుకువెళ్లాలనే కృతనిశ్చయంతో తమ ప్రభుత్వం, కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఉన్నాయన్నారు. దీనిలో భాగంగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రం మద్దతుతో పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నానని చెప్పారు. పుష్కరాల సందర్భంగా కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వంటకాలు, పంటలను ప్రదర్శిస్తామన్నారు. రాజమండ్రిని సాంస్కృతిక కేంద్రం చేస్తానని ప్రకటించారు. గోదావరికి పూజలతో హారతి గోదావరి నిత్యహారతి కార్యక్రమం అట్టహాసంగా ఆరంభమైంది. దేవాదాయశాఖ, బుద్ధవరపు చారిటబుల్ ట్రస్టుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత గోదావరికి పూజలు చేసి హారతి ఇచ్చారు. వేదమంత్రోచ్ఛరణలు, బాజాభజంత్రీల నడుమ కన్నులపండువగా సాగిన నిత్య హారతి వేలాదిగా తరలివచ్చిన భక్తులను అలరించింది. ‘గంగా హారతి తరువాత దేశ ప్రజలు చెప్పుకునే స్థాయిలో, చూడాల్సిన స్థాయిలో గోదావరి హారతి జరగాలి. చరిత్ర ఉన్నంత వరకు ఇది ఘనంగా కొనసాగాలి’ అని చంద్రబాబు అన్నారు. అనంతరం ఆయన పుష్కర శంఖాన్ని పూరించారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, పైడికొండల మాణిక్యాలరావు, పి.నారాయణ, పీతల సుజాత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, బుద్ధవరపు ట్రస్ట్ ఈడీ బి.ఎస్.ఎన్.కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పుష్కరాలకు తెలంగాణకు రండి
♦‘ఆస్క్ కేటీఆర్’ కార్యక్రమంలో నెటిజన్లతో మంత్రి కేటీఆర్ ♦ రాజకీయాలు సహా వివిధ ప్రశ్నలకు సమాధానం సాక్షి, హైదరాబాద్: ‘నా అభిమాన నటుడు షారూక్‌ఖాన్... ఎస్.ఎస్.రాజమౌళి అద్భుత దర్శకుడు... గోదావరి పుష్కరాలకు తెలంగాణకు రండి..’. ఇవీ నెటిజన్లతో మంత్రి కె. తారక రామారావు (కేటీఆర్) పంచుకున్న మనోభావాలు. శుక్రవారం ‘వుయ్ ఆర్ హైదరాబాద్’ ట్వీటర్ హ్యాండిల్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఆస్క్ కేటీఆర్ కార్యక్రమం ద్వారా రాజకీయాలు సహా పరిపాలన గురించి నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. ‘గోదావరి పుష్కరాలకు ఆంధ్రకు వెళతారా..’ అని అడగ్గా.. గోదావరి నది 70 శాతం తెలంగాణలోనే ప్రవహిస్తున్నందున మీరంతా (నెటిజన్లు) తెలంగాణకు రావాలంటూ ఆహ్వానించారు. ఓటుకు కోట్ల వ్యవహారంలో ‘బాస్’ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారన్న ప్రశ్నకు స్పందిస్తూ.. చట్టం తనపని తాను చేసుకుపోతుందని, చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన గురించి భయాందోళనలు అక్కర్లేదని, ఇటువంటి మంచి ప్రయత్నాలకు మద్దతివ్వాలని నెటిజన్లను కేటీఆర్ కోరారు. ఐటీ రంగంలో ప్రపంచంతో తాము పోటీపడుతున్నామని, ఇతర రాష్ట్రాలతో కాదన్నారు. యువతకు నైపుణ్యాల శిక్షణ ఇచ్చేందుకు టాస్క్ ఏర్పాటు చేశామని, త్వరలోనే టీ-హబ్ ప్రారంభం కానుందన్నారు. ఆంధ్ర ప్రజలపట్ల తమకు ఎటువంటి ద్వేషం లేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. -
జూన్ 11 వరకే పెళ్లిసందడి
కొవ్వూరు :గోదావరి పుష్కరాల నేపథ్యంలో జూన్ 11 తర్వాత ఏడాది పాటు వివాహాలు చేయకూడదని పండితులు సూచిస్తున్న నేపథ్యంలో తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల్లో పెళ్లిళ్ల సందడి ఊపందుకుంది. ఇప్పటికే వేలాది పెళ్లిళ్లు జరిగాయి. వివాహాది శుభకార్యాల నిర్వహణ, ముహుర్తాల విషయంలో పండితులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాలు పూర్తయ్యూక ఆరునెలల పాటు చేయకూడదని కొందరు, ఏడాది పాటు శుభకార్యాలు నిర్వహించకూడదని మరికొందరు చెబుతున్నారు. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పటి (జూలై 14 పుష్కరాల ప్రారంభం) నుంచి నదికి తూర్పుభాగంలో ఉన్నవారు ఏడాది పాటు, పశ్చిమతీరంలో ఉన్న వారు విజయదశమి వరకు (నాలుగు నెలలపాటు) వివాహాది శుభకార్యాలు చేసుకోకూడదని పండితులు సూచిస్తున్నారు. సింహరాశిలో ఉన్న తొమ్మిది పాదాలలో మొదటి ఐదు పాదాలు అనగా జూలై 14 నుంచి సెప్టెంబర్ 30 వరకు, పుబ్బ రెండో పాదంలో గురు అతిచారంతో దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలోనైనా శుభకార్యాలు చేయడం సింహ, గురు దోషం వల్ల నిషిద్ధమని పండితులు చెబుతున్నారు. అక్టోబర్ 25 నుంచి గోదావరి నదికి పశ్చిమ తీరంలో ఉన్నవారు వివాహాది శుభకార్యాలు చేసుకోవచ్చునంటున్నారు. గోదావరి నదికి అంత్య పుష్కరాలున్నందున తూర్పు ప్రాంతంలో ఉన్న తూర్పు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లావాసులు ఏడాదిపాటు వివాహాది శుభకార్యాలు చేసుకోకూడదని పండితుల అభిప్రాయం. ఈ ఏడాది జూన్ 17నుంచి ఆగష్టు 14 వరకు అధిక ఆషాడం, నిజ ఆషాడం శూన్యమాసాలు అయినందున వివాహాది శుభకార్యాలకు అనువైన రోజులు కాదని పండితులు చెబుతున్నారు. ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 9 వరకు గురుమౌఢ్యం, ఆగస్టు 10 నుంచి 20వ తేదీ మధ్య శుక్రమౌఢ్యం ఉండడం వల్ల, భాద్రపదమాసం సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 12 వరకు శూన్యమాసం కావడంతో వివాహాది శుభకార్యాలకు ముహుర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. విజయదశమి నుంచి పశ్చిమగోదావరి జిల్లాతో పాటు గోదావరి నదికి పశ్చిమ ముఖంగా ఉన్న కృష్ణ, గుంటూరు ఇతర జిల్లాల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు చేసుకోవచ్చునని కొందరు పండితులు చెబుతున్నారు. ఈనెలలో 8, 9, 11, 12, 14, 15, 21, 22, 25 తేదీలు, మార్చినెలలో 4, 6, 7, 8, 11 నుంచి 15 వరకు, ఏప్రిల్ నెలలో 10, 22, 29, మేనెలలో 6, 7, 9, 10, 20, 27, 28, 30, 31వ తేదీలు, జూన్‌లో 3, 5, 6, 7, 10, 11వ తేదీలు వివాహాలకు అనువైన రోజులని పండితులు చెబుతున్నారు.