గోదావరి తల్లి రుణం తీర్చుకుందాం
♦ పుష్కరాల్లో గోదావరివాసులు మమేకం కావాలి
♦ పుష్కర శంఖ ం పూరించిన సీఎం చంద్రబాబు
♦ కన్నులపండువగా నిత్యహారతి ఆరంభం
సాక్షి, రాజమండ్రి : ‘గోదావరి నది తెలుగు ప్రజల జీవనాడి. ఆ తల్లి రుణం తీర్చుకునే సమయం ఇదే. ఇవి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు మాత్రమే కావు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా పుష్కరమిది. దీన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇందులో గోదావరివాసులు భాగస్వాములు కావాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. గోదావరి నిత్య హారతి ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన బుధవారం రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. సంక్రాంతి, ఉగాది పండుగల కంటే గొప్పగా పుష్కరాలను నిర్వహించాలని చెప్పారు.
‘2003 పుష్కరాలకు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఆ పుష్కరాలను చరిత్రలో నిలిచిపోయేంత గొప్పగా నిర్వహించాను. ఈసారి అంతకన్నా గొప్పగా, మహా కుంభమేళా తరహాలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది’ అని సీఎం తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా లెక్క చేయకుండా దాదాపు రూ.1,600 కోట్లు ఖర్చు పెట్టి పుష్కరాలు నిర్వహిస్తున్నామన్నారు. గోదావరి తల్లి కరుణిస్తే రాష్ట్రంలో పేదరికం అనేదే ఉండదని చెప్పారు.
నదుల అనుసంధానం ద్వారా గోదావరి నీటిని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ తీసుకువెళ్లాలనే కృతనిశ్చయంతో తమ ప్రభుత్వం, కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఉన్నాయన్నారు. దీనిలో భాగంగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రం మద్దతుతో పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నానని చెప్పారు. పుష్కరాల సందర్భంగా కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వంటకాలు, పంటలను ప్రదర్శిస్తామన్నారు. రాజమండ్రిని సాంస్కృతిక కేంద్రం చేస్తానని ప్రకటించారు.
గోదావరికి పూజలతో హారతి
గోదావరి నిత్యహారతి కార్యక్రమం అట్టహాసంగా ఆరంభమైంది. దేవాదాయశాఖ, బుద్ధవరపు చారిటబుల్ ట్రస్టుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత గోదావరికి పూజలు చేసి హారతి ఇచ్చారు. వేదమంత్రోచ్ఛరణలు, బాజాభజంత్రీల నడుమ కన్నులపండువగా సాగిన నిత్య హారతి వేలాదిగా తరలివచ్చిన భక్తులను అలరించింది. ‘గంగా హారతి తరువాత దేశ ప్రజలు చెప్పుకునే స్థాయిలో, చూడాల్సిన స్థాయిలో గోదావరి హారతి జరగాలి.
చరిత్ర ఉన్నంత వరకు ఇది ఘనంగా కొనసాగాలి’ అని చంద్రబాబు అన్నారు. అనంతరం ఆయన పుష్కర శంఖాన్ని పూరించారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, పైడికొండల మాణిక్యాలరావు, పి.నారాయణ, పీతల సుజాత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, బుద్ధవరపు ట్రస్ట్ ఈడీ బి.ఎస్.ఎన్.కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.