పోలవరం, విశాఖ ఉక్కు, రైల్వే జోన్‌లపై చర్చ
అమరావతికి ప్రకటించిన రూ.15 వేల కోట్లు వచ్చేలా చూడాలని వినతి
జన్‌పథ్–1లోని నివాసంలో బాబును కలిసిన అశ్వినీ వైష్ణవ్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు సోమవారం భేటీ అయ్యారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సోమవారం ఢిల్లీ వచ్చిన చంద్రబాబు నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లారు. కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయులుతో కలిసి దాదాపు గంటపాటు ప్రధాన మంత్రితో వివిధ అంశాలపై చర్చించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
పోలవరం రెండో విడత నిధులు, విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ప్రధానంగా చర్చించినట్లు చెప్పారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో అమరావతి అభివృద్ధికి ప్రకటించిన రూ.15 వేల కోట్లు త్వరితగతిన విడుదలయ్యేలా చొరవ చూపాలని ప్రధానిని చంద్రబాబు కోరారు. ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉండి కూడా నిధులు తెచ్చుకోవడంలో ఆలస్యం జరుగుతున్న కారణంగా ప్రతిపక్షం నుంచి విమర్శలు, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని మోదీకి చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. ప్రధానితో భేటీ అనంతరం చంద్రబాబు జన్‌పథ్–1లోని అధికారిక నివాసానికి చేరుకున్నారు. ఇక్కడ బాబుతో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ భేటీ అయ్యారు. విశాఖ రైల్వే జోన్‌పై ఈ ఇద్దరి మధ్య చర్చ జరిగింది.
ఎంపీలకు విందు
ఎన్‌డీఏ కూటమిలో ఉన్న ఎంపీలకు సీఎం చంద్రబాబు తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. అధికారిక నివాసంలోని డైనింగ్ హాలు, మీటింగ్ హాలును మంత్రులు, ఎంపీలతో కలిసి బాబు ప్రారంభించారు. అనంతరం జరిగిన విందులో ఎంపీలతో పాటు బీజేపీలోని అత్యంత కీలకమైన నేతలు హాజరైనట్లు సమాచారం.
నేడు అమిత్‌షా, నిర్మలా సీతారామన్, గడ్కరీ తదితరులతో భేటీ
సీఎం చంద్రబాబు మంగళవారం పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తదితరులతో
సమావేశమవనున్నారు.
ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు: చంద్రబాబు
‘ప్రధాన మంత్రితో జరిగిన సమావేశంలో పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ వ్యయ అంచనాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినందుకు మోదీకి కృతజ్ఞతలు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఆయనకు వివరించాను. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడికి సంబంధించిన విషయాలలో కేంద్ర ప్రభుత్వం చేయూత, మద్దతు ఇచ్చేందుకు, రాజధాని అమరావతికి ప్రధాన మంత్రి మోదీ మద్దతు తెలపడాన్ని అభినందిస్తున్నాను’ అంటూ సీఎం చంద్రబాబు ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment