పుష్కరాలకు తెలంగాణకు రండి
♦‘ఆస్క్ కేటీఆర్’ కార్యక్రమంలో నెటిజన్లతో మంత్రి కేటీఆర్
♦ రాజకీయాలు సహా వివిధ ప్రశ్నలకు సమాధానం
సాక్షి, హైదరాబాద్: ‘నా అభిమాన నటుడు షారూక్‌ఖాన్... ఎస్.ఎస్.రాజమౌళి అద్భుత దర్శకుడు... గోదావరి పుష్కరాలకు తెలంగాణకు రండి..’. ఇవీ నెటిజన్లతో మంత్రి కె. తారక రామారావు (కేటీఆర్) పంచుకున్న మనోభావాలు. శుక్రవారం ‘వుయ్ ఆర్ హైదరాబాద్’ ట్వీటర్ హ్యాండిల్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఆస్క్ కేటీఆర్ కార్యక్రమం ద్వారా రాజకీయాలు సహా పరిపాలన గురించి నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. ‘గోదావరి పుష్కరాలకు ఆంధ్రకు వెళతారా..’ అని అడగ్గా.. గోదావరి నది 70 శాతం తెలంగాణలోనే ప్రవహిస్తున్నందున మీరంతా (నెటిజన్లు) తెలంగాణకు రావాలంటూ ఆహ్వానించారు.
ఓటుకు కోట్ల వ్యవహారంలో ‘బాస్’ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారన్న ప్రశ్నకు స్పందిస్తూ.. చట్టం తనపని తాను చేసుకుపోతుందని, చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన గురించి భయాందోళనలు అక్కర్లేదని, ఇటువంటి మంచి ప్రయత్నాలకు మద్దతివ్వాలని నెటిజన్లను కేటీఆర్ కోరారు. ఐటీ రంగంలో ప్రపంచంతో తాము పోటీపడుతున్నామని, ఇతర రాష్ట్రాలతో కాదన్నారు. యువతకు నైపుణ్యాల శిక్షణ ఇచ్చేందుకు టాస్క్ ఏర్పాటు చేశామని, త్వరలోనే టీ-హబ్ ప్రారంభం కానుందన్నారు. ఆంధ్ర ప్రజలపట్ల తమకు ఎటువంటి ద్వేషం లేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.