మనోజ్ ఉద్యమం.. రాజమౌళి, కేటీఆర్‌ భాగస్వామ్యం! | tollywood hero manoj manchu starts save the farmer movement | Sakshi
Sakshi News home page

మనోజ్ ఉద్యమం.. రాజమౌళి, కేటీఆర్‌ భాగస్వామ్యం!

Published Tue, May 23 2017 5:35 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

మనోజ్ ఉద్యమం.. రాజమౌళి, కేటీఆర్‌ భాగస్వామ్యం! - Sakshi

మనోజ్ ఉద్యమం.. రాజమౌళి, కేటీఆర్‌ భాగస్వామ్యం!

రైతుల ఆత్మహత్యలు జరగకుండా ఉండాలని.. రైతులను రక్షించాలని టాలీవుడ్ హీరో మంచుమనోజ్ సంకల్పించాడు. అందుకోసం ''సేవ్ ద ఫార్మర్'' అనే ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు, ఈ ఆశయంలో ఎలాంటి ఆటంకం రాకుండా ఉండేందుకు దీన్ని సమర్థంగా నడిపించగల ఐదుగురిని ఎంపిక చేసుకున్నానని, వారు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, రానా, సాయి ధరమ్‌ తేజ్, జీవీ కేశవ్ అని చెప్పాడు. విశాఖపట్నంలో హుద్ హుద్ తుపాను వచ్చిన సమయంలో మొదలుపెట్టిన యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే ఇది జరుగుతుందన్నాడు. గత కొంత కాలంగా తన గుండెను తొలుస్తున్న విషయంపై పోరాడాలన్న ఆలోచనను ఆచరణలో పెట్టే సమయం వచ్చిందని మనోజ్ తెలిపాడు. అన్నం పెట్టే అమ్మను ప్రేమించడం ఎంత అవసరమో.. పండించే రైతును ప్రేమించడం కూడా అంతే అవసరమని, కానీ ప్రతియేటా ఎన్నో బతుకులు బలైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. పండించే రైతుకు పట్టెడన్నం పెట్టాలన్న ప్రేమ నుంచి పుట్టుకొచ్చిందే ఈ "సేవ్ ద ఫార్మర్"  ఉద్యమమని తెలిపాడు.

తాను ఒక్కడినేనని, తనకున్నవి రెండే చేతులని, కానీ కొందరి కన్నీటినైనా ఇవి తుడవగలవన్న నమ్మకం తనకుందని అన్నాడు. అలాంటప్పుడు అందరి చేతులు కలిస్తే ఇంకెంతమంది అన్నదాతల కన్నీళ్లు తుడవచ్చని ప్రశ్నించాడు. ఇప్పుడు చేసే ఒక్క ఆలోచన ఒక చావును ఆపొచ్చు, ఒక కడుపు నింపొచ్చు, ఒక బతుకు చక్కబెట్టొచ్చని, ఏడాది ఆదాయంలో ఒక్కరోజు సంపాదన ఒక కుటుంబాన్ని నిలబెట్టే అవకాశం ఉందని తెలిపాడు. ఇక మీదట ఈ నాగలీ మూగబోకూడదని, ఏ కష్టమూ కరిగిపోకూడదని, ఏ రైతన్నా బలైపోకూడదని ఆశిస్తున్నానని మనోజ్ అన్నాడు. రైతులను కష్టాల నుంచి కాపాడి అన్నదాత ముఖంపై చెదిరిపోయిన చిరునవ్వును మాళ్లీ తిరిగి రప్పించడమే తమ యూనిటీ లక్ష్యమని వివరించాడు. ఇప్పటికే చాలా సంస్థలు ఈ సమస్యపై కృషి చేస్తున్నాయని, వాళ్లతో పాటు తాను కూడా తన వంతు కృషి చేసి రైతు రుణం తీర్చుకోవాలన్నదే తన తాపత్రయమని అన్నాడు. జై కిసాన్! జై జవాన్! జై హింద్! అంటూ తన విజ్ఞప్తిని ముగించాడు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement