మనోజ్ ఉద్యమం.. రాజమౌళి, కేటీఆర్ భాగస్వామ్యం!
రైతుల ఆత్మహత్యలు జరగకుండా ఉండాలని.. రైతులను రక్షించాలని టాలీవుడ్ హీరో మంచుమనోజ్ సంకల్పించాడు. అందుకోసం ''సేవ్ ద ఫార్మర్'' అనే ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు, ఈ ఆశయంలో ఎలాంటి ఆటంకం రాకుండా ఉండేందుకు దీన్ని సమర్థంగా నడిపించగల ఐదుగురిని ఎంపిక చేసుకున్నానని, వారు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, రానా, సాయి ధరమ్ తేజ్, జీవీ కేశవ్ అని చెప్పాడు. విశాఖపట్నంలో హుద్ హుద్ తుపాను వచ్చిన సమయంలో మొదలుపెట్టిన యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే ఇది జరుగుతుందన్నాడు. గత కొంత కాలంగా తన గుండెను తొలుస్తున్న విషయంపై పోరాడాలన్న ఆలోచనను ఆచరణలో పెట్టే సమయం వచ్చిందని మనోజ్ తెలిపాడు. అన్నం పెట్టే అమ్మను ప్రేమించడం ఎంత అవసరమో.. పండించే రైతును ప్రేమించడం కూడా అంతే అవసరమని, కానీ ప్రతియేటా ఎన్నో బతుకులు బలైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. పండించే రైతుకు పట్టెడన్నం పెట్టాలన్న ప్రేమ నుంచి పుట్టుకొచ్చిందే ఈ "సేవ్ ద ఫార్మర్" ఉద్యమమని తెలిపాడు.
తాను ఒక్కడినేనని, తనకున్నవి రెండే చేతులని, కానీ కొందరి కన్నీటినైనా ఇవి తుడవగలవన్న నమ్మకం తనకుందని అన్నాడు. అలాంటప్పుడు అందరి చేతులు కలిస్తే ఇంకెంతమంది అన్నదాతల కన్నీళ్లు తుడవచ్చని ప్రశ్నించాడు. ఇప్పుడు చేసే ఒక్క ఆలోచన ఒక చావును ఆపొచ్చు, ఒక కడుపు నింపొచ్చు, ఒక బతుకు చక్కబెట్టొచ్చని, ఏడాది ఆదాయంలో ఒక్కరోజు సంపాదన ఒక కుటుంబాన్ని నిలబెట్టే అవకాశం ఉందని తెలిపాడు. ఇక మీదట ఈ నాగలీ మూగబోకూడదని, ఏ కష్టమూ కరిగిపోకూడదని, ఏ రైతన్నా బలైపోకూడదని ఆశిస్తున్నానని మనోజ్ అన్నాడు. రైతులను కష్టాల నుంచి కాపాడి అన్నదాత ముఖంపై చెదిరిపోయిన చిరునవ్వును మాళ్లీ తిరిగి రప్పించడమే తమ యూనిటీ లక్ష్యమని వివరించాడు. ఇప్పటికే చాలా సంస్థలు ఈ సమస్యపై కృషి చేస్తున్నాయని, వాళ్లతో పాటు తాను కూడా తన వంతు కృషి చేసి రైతు రుణం తీర్చుకోవాలన్నదే తన తాపత్రయమని అన్నాడు. జై కిసాన్! జై జవాన్! జై హింద్! అంటూ తన విజ్ఞప్తిని ముగించాడు.
#Unity is an action for a cause! Donate your one-day wages & brighten up a needy farmers future. Help us: share! pic.twitter.com/DjGZDdSHwW
— Manoj Manchu (@HeroManoj1) 23 May 2017
I nominate these 5 people & take the #SaveTheFarmer initiative ahead. Tag your friends & donate your salary worth a day. Spread the word. pic.twitter.com/Q52Jyhglgb
— Manoj Manchu (@HeroManoj1) 23 May 2017
Farmers are feeding us but who's feeding them? #Unity is trying to take up that job & improve their standard of living. This is our motto. pic.twitter.com/fUsmJyBtgt
— Manoj Manchu (@HeroManoj1) 22 May 2017