Pyramid Party of India
-
నామినేషన్ల సందడి
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో నామినేషన్ల సందడి జోరందుకుంది. మంగళవారం విశాఖ లోక్‌సభకు 3, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు 33 మొత్తంగా 36 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు రెండు నుంచి నాలుగు సెట్లు వేశారు. విశాఖ లోక్‌సభకు బుద్ద చంద్రశేఖర్ స్వతంత్ర అభ్యర్థిగా 2 సెట్లు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి దాడి జ్యోతి భవాని ఒక సెట్ నామినేషన్ వేశారు. ముఖ్యంగా వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థులు పాయకరావుపేటకు చెంగల వెంకట్రావు, విశాఖ-పశ్చిమకు దాడి రత్నాకర్‌లు అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. భారీగా ర్యాలీలతో సందడి చేశారు. చెంగల వెంకటరావు నక్కపల్లి తహశీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వీఆర్ఎన్ఎల్ శర్మకు రెండు సెట్ల నామినేషన్లు అందజేశారు. డమ్మీగా ఆయన సతీమణి చెంగల పుష్పకూడా రెండు సెట్లు వేశారు. అదే స్థానానికి చెవ్వేటి తలుపులు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. విశాఖ పశ్చిమానికి దాడి రత్నాకర్ జ్ఞానాపురం ప్రాంతంలోని జీవీఎంసీ జోన్-4 కార్యాలయంలో ఎన్నికల అధికారికి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అంతకు ముందు ర్యాలీగా వచ్చిన ఆయనకు జనం అడుగడుగునా హారతులు పట్టారు. ప్రతీ వీధిలోను ఆయతో కలిసి అడుగులు వేశారు. దీంతో రోడ్లన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలతో నిండిపోయాయి. ఇదే సెగ్మెంట్‌కు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి సేనం సాయి అరవింద్ నామినేషన్ వేశారు. విశాఖ-ఉత్తరం నియోజకవర్గానికి లోక్‌సత్తా పార్టీ అభ్యర్థి భీశెట్టి అప్పారావు, స్వతంత్రులుగా సరిపల్లి దేముళ్లు, సింగంశెట్టి ప్రసాదరావు, అరకువేలీకి సీపీఎం అభ్యర్థి కిల్లో సురేంద్ర 3 సెట్లు, పెందుర్తికి జైసమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థి మేడపు రెడ్డి నూతన్ కుమార్, యలమంచిలికి వీసం వెంకట సత్యనారాయణమూర్తి స్వతంత్ర అభ్యర్థిగా 4 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. నర్సీపట్నంకు టీడీపీ అభ్యర్థి చింతకాల అయ్యన్నపాత్రుడు 2 సెట్లు, టీడీపీ డమ్మీ అభ్యర్థిగా చింతకాయల విజయ్ 2 సెట్లు, లోక్‌సత్తా అభ్యర్థి తవ్వ చిరంజీవిరావు 3 సెట్ల నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల హోరు బుధవారం నుంచి మరింత పెరగనుంది. ప్రధాన పార్టీ అభ్యర్థులందరూ 16, 17 తేదీల్లోనే నామినేషన్లు వేయనున్నారు. భారీ ర్యాలీలతో బలప్రదర్శన చేయనున్నారు. ఈ పరిస్థితి దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద ప్రత్యేక బలగాలను మోహరిస్తున్నారు. -
నేడే ఆఖరు
సాక్షి,సిటీబ్యూరో: నవమి నాడు నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలకు మంగళవారం మొత్తం 11నామినేషన్లు దాఖలయ్యాయి. హైదరాబాద్ లోక్‌సభ కు పౌరహక్కుల సంఘం నేత జయవింధ్యాల సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ముఖేష్‌కుమార్‌మీనాకు అందజేశారు. అలాగే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా బింగి రాజశేఖర్, స్వతంత్ర అభ్యర్థులుగా సయ్యద్మహ బూబ్, మహ్మద్ఉస్మాన్ తమ నామినేషన్లు సమర్పించారు. ఇప్పటికీ మొత్తం ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని, వీరంతా ఒక్కో సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించగా, ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ మాత్రం రెండుసెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. సికింద్రాబాద్‌కు నామినేషన్ల జోరు: సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి మంగళవారం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటివరకుమొత్తం 10 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పార్టీ అభ్యర్థిగా కుమార్‌చౌదరియాదవ్, ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్ అభ్యర్థిగా కరనుకోటి కృష్ణ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా శక్తి సత్యవతి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా బి.దీపక్‌కుమార్, అఖిలభారత ముస్లింలీగ్ సెక్యులర్ పార్టీ అభ్యర్థిగా అబుదస్ సత్తార్ ముజాహిద్, స్వతంత్ర అభ్యర్థులుగా మొహ్మద్ అబుబాకర్ పర్వేజ్ సిద్ధిఖీ, మైఖేల్ డేనియల్ ఓవిజ్..తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. దీపక్‌కుమార్ నాలుగుసెట్లు, కె.నరేందర్, కుమార్‌చౌదరి రెండేసి సెట్లు నామినేషన్ పత్రాలను సమర్పించగా, మిగిలిన వారంతా ఒక్కో సెట్‌ను అందజేశారు. అదనపు బందోబస్తుకు ఆదేశం : నామినేషన్ల దాఖలుకు బుధవారం చివరి రోజు కావడంతో, ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈనేపథ్యలో జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని, కలెక్టరేట్ ప్రాంగ ణంలో అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటుకు ఆదేశించారు.