అనంత అభివృద్ధికి రహదారుల నిర్మాణమే కీలకం
అనంతపురం సిటీ : అనంత అభివద్ధికి రహదారుల నిర్మాణం కీలకమని ఆర్అండ్బి ఎస్ఈ సుబ్రమణ్యం తెలిపారు. రాష్ట్రంలోనే జాతీయ రహదారులు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇదేనన్నారు. జిల్లాలో 250 కిలో మీటర్లు మేర జాతీయ రహదారుల పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. 125 కిలో మీటర్లు పనులు త్వరలో పూర్తవుతాయని చెప్పారు. మిగిలిన 125 కిలో మీటర్లు రహదారుల నిర్మాణపు పనులను డిసెంబరులో ప్రారంభిస్తామన్నారు.
ఈ పనులు పెనుకొండ నుంచి రొద్దం, గోరంట్ల నుంచి ఓడీ చెర్వు, ఎన్ఎస్ గేటు నుంచి పేరూరుల మధ్య జరుగుతున్నాయని తెలిపారు. అలాగే బళ్లారి – గుత్తి పట్టణాలను అనుబంధంగా సాగుతున్న రహదారుల పనులు రూ.500 కోట్లు, మదనపల్లి రహదారి పనులు రూ.300 కోట్లు, బళ్లారి – అనంతపురం మధ్య జరుగుతున్న రోడ్డు నిర్మాణాల పనులు రూ.350 కోట్లతో జరుగుతున్నాయని వెల్లడించారు.