‘రాక్షస కావ్యం’ మూవీ రివ్యూ
టైటిల్: రాక్షస కావ్యం
నటీనటులు: అభయ్ నవీన్ బేతినేని, అన్వేష్ మైఖేల్, దయానంద్ రెడ్డి, పవాన్ రమేష్, రోహిణి ఆరెట్టి కుశాలిని తదితరులు
నిర్మాతలు: దాము రెడ్డి, సింగనమల కల్యాణ్
దర్శకత్వం: శ్రీమాన్ కీర్తి
సంగీతం: రాజీవ్ రాజ్, శ్రీకాంత్ ఎమ్
సినిమాటోగ్రఫీ: రుషి కోనాపురం
విడుదల తేది: అక్టోబర్ 13, 2023
‘రాక్షస కావ్యం’ కథేంటంటే..
అజయ్ (అభయ్ బేతగంటి) ఓ కాంట్రాక్ట్ కిల్లర్. చదువుకున్న వాళ్లంటే అతనికి చాలా గౌరవం. చిన్నప్పుడే తల్లి చనిపోవడం.. తండ్రి తాగుబోతు కావడంతో చదవు మానేసి కాంట్రాక్ట్ కిల్లర్‌గా మారతాడు. మరోపక్క విజయ్(అన్వేష్ మైఖేల్)కి సినిమాల పిచ్చి. హీరోల కంటే విలన్లు అంటేనే ఎక్కువ ఇష్టం. విలన్లకు న్యాయం చేయడానికై తనే ఓ సినిమా తీయాలని ప్రయత్నిస్తాడు. మరోవైపు అజయ్ చంపేందుకై స్నేహితులతో కలిసి తిరుగుతుంటాడు. అసలు అజయ్, విజయ్‌లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అజయ్ తల్లి ఎలా చనిపోయింది? హత్యలు, సెటిల్మెంట్స్ చేస్తూ సంపాదించిన డబ్బును అజయ్ ఏం చేశాడు? సొంత తండ్రిని ఎందుకు దూరం పెట్టాడు? అజయ్, విజయ్‌ల బ్యాక్ స్టోరీ ఏంటి అనేది తెలియాలంటే రాక్షస కావ్యం చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
మైథాలజీని నేటి సామాజిక పరిస్థితులకు అన్వయించి తెరకెక్కించిన ఒక కొత్త తరహా సినిమా ‘రాక్షస కావ్యం’. ఈ సినిమా కథ రా అండ్ రస్టిక్‌గా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు రియల్ లైఫ్‌కి చాలా దగ్గరగా ఉంటాయి. కామెడీ, ఎమోషన్స్, లవ్ సన్నివేశాలతో, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథను రాసుకున్నాడు దర్శకుడు. అయితే ఫస్టాఫ్‌పై క్రియేట్ చేసినంత ఇంట్రెస్ట్‌ని.. సెకండాఫ్‌పై చేయడంలో విఫలం అయ్యాడు.
సినిమా ప్రారంభమే చాలా విచిత్రంగా ఉంటుంది. సినిమాలోని ప్రధాన పాత్రలను పురాణాల నుంచి ప్రేరణగా తీసుకొని.. ప్రస్తుతం వాళ్లు భూమిపై ఉంటే ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన పాయింట్‌తో సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కాంట్రాక్ట్ కిల్లర్‌గా అజయ్ ఎంట్రీ వెరైటీగా అనిపిస్తుంది. ఓ ఇంజనీరింగ్ విద్యార్థితో దగ్గరుండి మరీ హత్యలు చేయించడం.. ఈ నేపథ్యంలో సాగే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అజయ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీతో కథంతా ఎమోషనల్ వైపు టర్న్ తీసుకుంటుంది. హీరో కాంట్రాక్ట్ కిల్లర్‌గా మారడం వెనుక ఉన్న కారణం కన్విన్సింగ్‌గా అనిపిస్తుంది.
మదర్ సెంటిమెంట్ సాగే సన్నివేశాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఇక ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచేలా ఉంటుంది. అయితే ద్వితియార్థంలో మాత్రం కథనం ఆసక్తికరంగా సాగదు. విజయ్ పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. అయితే అతను అలా మారడానికి బలమైన కారణాన్ని చూపించలేకపోయాడు. మన సినిమాల్లో విలన్స్‌ను ఎలా తక్కువ చేసి చూపిస్తున్నారు, హీరోలను ఎలా హైప్ చేస్తున్నారు అని చెప్పే సీన్స్ నవ్వులు పూయిస్తాయి. అజయ్ పాత్రకు కనెక్ట్ అయినట్లుగా ఆడియన్స్ విజయ్ పాత్రకు కనెక్ట్ కాలేరు. పైగా చాలా చోట్ల రిపీటెడ్ సీన్స్ చిరాకు కలిగిస్తాయి. క్లైమాక్స్ సాగదీతగా అనిపిస్తుంది. సెకండాఫ్ కథను మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. దర్శకుడు ఓ ప్రయోగం అయితే చేశాడు కానీ అందులో కొతమేర వరకే సక్సెష్ అయ్యాడు.
ఎవరెలా చేశారంటే..
ఈ మధ్య వరుస సినిమాతో దూసుకెళ్తున్న అభయ్ బేతగంటి.. ఈ చిత్రంలో మరో డిఫరెంట్ పాత్ర పోషించాడు. కాంట్రాక్ట్ కిల్లర్ అజయ్ పాత్రలో అభయ్ ఒదిగిపోయాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కగా నటించాడు. ఇక విజయ్‌గా ‘కొత్త పోరడు’ ఫేమ్ అన్వేష్ మైఖేల్ తనదైన స్క్రీన్ ప్రెజన్స్‌తో ఆకట్టుకున్నాడు. సీనియర్ యాక్టర్ దయానంద్ రెడ్డి మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు.
చైతన్య అనే ఇంజనీరింగ్ స్టూడెంట్ పాత్రకు పవన్ రమేష్ న్యాయం చేశాడు. తన ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలీవరీ నవ్వులు పూయించాయి. యాదమ్మ రాజు, కోట సందీప్ తదితరులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాకొస్తే... ఈ సినిమాకు ప్రధాన బలం సంగీతం అని చెప్పాలి. రాజీవ్ రాజ్, శ్రీకాంత్ ఎమ్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.
- రేటింగ్: 2.75/5