రబ్బరు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
ఐదుగురికి తీవ్రగాయాలు
వంట చేసుకుంటుండగా ప్రమాదం జరిగిందని బుకాయింపు
అంబులెన్స్‌లో కాకుండా ఆటోలో హుటాహుటిన తరలింపు
కడప అర్బన్ : కడప నగర శివార్లలో పారిశ్రామిక వాడలో సోమవారం ఉదయం మణి రబ్బరు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆస్తి నష్టం పెద్దగా జరగలేదు కానీ, అక్కడ పనిచేస్తున్న ఐదుగురు కార్మికులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ సంఘటనలో యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్లు కనిపిప్తోంది.
– బాధితుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి. కడప నగర శివార్లలోని మణి రబ్బరు ఫ్యాక్టరీలో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రామచంద్ర్(35), మానస్ (20), సరోజ్ (22), వికాస్ (25), కమలాపురానికి చెందిన సత్యనారాయణలు కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరంతా రోజూ మాదిరిగానే సోమవారం కూడా రబ్బరు తయారీలో భాగంగా ఫ్యాక్టరీలో వున్న బ్రాయిలర్లోకి పొట్టును గంపలతో వేయసాగారు. ఈక్రమంలో అందులో నుంచి ఒక్కసారిగా మంటలు వీరిపైకి దూసుకొచ్చాయి. దీంతో తీవ్రగాయాల పాలయ్యారు. అక్కడి నుంచి వారిని ఫ్యాక్టరీలోని కార్మికుల మేస్ట్రీ వెంట రిమ్స్‌కు తరలించారు. సంఘటన స్థలానికి అగ్నిమాపక శాఖ వారు తమ వాహనంతో వస్తే, వారిని కూడా వెనక్కి పంపించేశారు. అనంతరం రిమ్స్‌లో వైద్యులు, సిబ్బంది తమ వంతుగా వైద్య సేవలను అందించారు. అనంతరం ఫ్యాక్టరీ యాజమాన్యం వీరిని బలవంతంగా ఆసుపత్రి నుంచి ఆటోల్లో తీసుకెళ్లారు. ఫ్యాక్టరీ వద్దకు మీడియా బందం విషయం కనుగొనేందుకు వెళ్లగా.. అక్కడ వాచ్మెన్ విధులు నిర్వర్తిస్తూ, బాధితులు వంట చేసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగిందని బుకాయించే ప్రయత్నం చేశాడు. గాయపడ్డవారిలో సరోజ్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వీరు కడప నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రిమ్స్ ఎస్ఐ రామాంజనేయులు కేసు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు.