రచ్చబండ ప్రచారం!
- డీఎంకే యూత్ నిర్ణయం
- ప్రజల్లో మమేకానికి స్టాలిన్ పిలుపు పలు అంశాలపై తీర్మానం
రచ్చబండ ప్రచార సభలకు డీఎంకే యువజన విభాగం నిర్ణయించింది. ప్రజల్లో మమేకమై, వారి మన్ననల్ని అందుకుని అసెంబ్లీ ఎన్నికల ద్వారా అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా యువజనుల చేత డీఎంకే కోశాధికారి ఎంకే.స్టాలిన్ ప్రతిజ్ఞ చేయించారు. పలు అంశాలపై తీర్మానించారు.
సాక్షి, చెన్నై:డీఎంకేకు వెన్నెముకగా యువజన విభాగం వ్యవహరిస్తోంది. ఈ విభాగానికి డీఎంకే దళపతి ఎంకే.స్టాలిన్ ప్రధాన కార్యదర్శిగా ఏళ్ల తరబడి వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ విభాగంలోని నాయకులకు ప్రమోషన్ కల్పించే విధంగా పార్టీ ప్రక్షాళ పర్వంలో పదవులు అప్పగించేందుకు స్టాలిన్ పావులు కదుపుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లోపు యువజన విభాగాన్ని మరింత పటిష్టవంతం చేయడం, ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే కార్యక్రమాలు చేపట్టే రీతిలో కార్యాచరణను సిద్ధం చేశారు. దీనిపై చర్చించి యువజన నేతల్లో ఉత్సాహం నింపడంతో పాటు ప్రజల్లోకి పంపించే రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువజన నేతలతో చెన్నైలో శుక్రవారం స్టాలిన్ సమావేశమయ్యారు.
ప్రచారం : అన్నా సాలైలోని అన్భగం అన్నా మండ్రంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా యువజన నేతలు తరలి వచ్చారు. డీఎంకే కోశాధికారి, యువజన ప్రధాన కార్యదర్శి ఎంకే.స్టాలిన్, సంయుక్త కార్యదర్శులు ఎం.సుబ్రమణియన్, సుగవనం నేతృత్వం వహించారు. ఆయా జిల్లాల్లోని సమస్యలు, యువజన విభాగాల్లో పార్టీ కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్న వారి వివరాల్ని సేకరించారు. పార్టీ బలోపేతం లక్ష్యంగా రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాల్ని వివరించారు. యువజన నేతలు సమష్టిగా ముందుకు వెళ్లాల్సిన విధానం, అసెంబ్లీ ఎన్నికల్లోపు ప్రజల్లో చొచ్చుకు వెళ్లే రీతిలో వ్యవహరించాల్సిన అంశాల్ని చర్చించారు. అలాగే, యువజన నేతలకు ప్రమోషన్లు దక్కనున్న దృష్ట్యా, ఆ విషయంగా ప్రస్తావన సాగినట్టు తెలిసింది. చివరకు రచ్చ బండ ప్రచారాలతో ప్రజల్ని ఆకర్షించే విధంగా కొన్ని తీర్మానాలు చేశారు.
తీర్మానాలు
అన్నా జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు కవితలు, వక్తృత్వ తదితర పోటీలు నిర్వహించేందుకు నిర్ణయించారు. అక్టోబర్ 11, 12 తేదీల్లో తొలి విడతగా జిల్లా స్థాయిపోటీలు, 18, 19 తేదీల్లో మలి విడత పోటీ నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. అక్టోబర్ 25, 26 తేదీల్లో రాష్ట్ర స్థాయి పోటీలు జరపనున్నారు. ముల్లై పెరియార్ డ్యామ్ హక్కుల పరిరక్షణ సాధనలో పార్టీ అధినేత కరుణానిధి పాత్ర ఉందని వివరిస్తూ, ఆయనకు కతృజ్ఞతలు తెలుపుతూ మరో తీర్మానం చేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు పౌష్టికాహర పథకం ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ, రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతల పరిరక్షణ నినాదంతో పోరాటాలకు నిర్ణయించారు. ప్రజా సమస్యలపై పాలకుల్ని నిలదీసే విధంగా కార్యక్రమాలకు చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా ప్రభుత్వ విధానాల్ని, వైఫల్యాల్ని, అరచాకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కరపత్రాల పంపిణీ, వీధి సభల్ని విస్తతృ పరచనున్నారు. అలాగే, రచ్చబండ ప్రచారం పేరుతో ప్రతి రోజూ తమతమ ప్రాంతాల్లోని యువజన నేతలు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నారు.