Radhika murder
-
రాధిక హత్య కేసు: వీడిన మిస్టరీ..
కరీంనగర్ క్రైం: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కన్నతండ్రే నిందితుడు కావడం గమనార్హం. కూతురనే కనికరం కూడా లేకుండా తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దిండుతో ఊపిరి ఆడకుండా చేసి ప్రాణం తీసి, ఆ తర్వాత కత్తితో గొంతు కోశాడు. అంతేకాకుండా కేసును తప్పుదారి పట్టించేందుకు ఇంట్లో చోరీ జరిగినట్లు నాటకం ఆడాడు. ఫిబ్రవరి 10న విద్యానగర్‌లో రాధిక దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో రాధిక తండ్రి కొమరయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీ కమలాసన్ రెడ్డి సమక్షంలో నిందితుడిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. (చదవండి: హంతకుడు ఎవరు..?!) ఈ సందర్భంగా సీపీ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ.. రాధికకు ఓవైపు వైద్యానికి అయ్యే ఖర్చులు, మరోవైపు పెళ్లి ఖర్చులు భరించలేకే కూతురిని కొమరయ్య హతమార్చినట్లు తెలిపారు. అయితే సీన్ డిస్టర్బ్ చేయకపోవడంతో తండ్రిపై ఎలాంటి అనుమానం రాలేదన్నారు. కొమరయ్య బనియన్, చెప్పులపైకంటికి కనిపించని రక్తపు మరకలను జర్మన్ టెక్నాలజీతో గుర్తించినట్లు వెల్లడించారు. డీఎన్ఏ నిర్థారణతో అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తానే రాధికనే హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నాడని తెలిపారు. ఈ కేసులో దాదాపు 60 మందిని విచారించడంతో పాటు 200 మందికిపైగా కాల్‌డేటాలు పోలీసులు పరిశీలించారు. 21 రోజులుగా 8 బృందాలకు సంబంధించి దాదాపు 75 మందికి పైగా పోలీసుల అహర్నిశలు శ్రమించారు. కాగా రాధిక హత్య జరిగిన ఫిబ్రవరి 10 తేదీన కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుంటూ పోలీసు అధికారులకు సూచనలిచ్చారు. ఇక్కడి క్లూస్‌టీం ఆధారాలతో కొన్ని విషయాలు నిర్ధారణ కాకపోవడంతో సీపీ హైదరాబాద్ నుంచి ప్రత్యేక క్లూస్‌టీం బృందాన్ని కరీంనగర్‌కు రప్పించి జర్మన్ టెక్నాలజీతో ఆధారాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. (చదవండి: క్లైమాక్స్‌కు రాధిక హత్య కేసు..?) లభించిన ఆధారాల నివేదికలతో రాధిక తండ్రిపై పోలీసుల దృష్టి సారించారు. అయితే రాధిక హత్యను పక్కదారి పట్టించేందుకే చోరీ నాటకం ఆడాడు. రాధిక హత్య జరిగిన రోజు ఇంట్లో చోరీ జరిగిందని రూ.99 వేలతో పాటు 3 తులాల బంగారం పోయిందని ఆమె తండ్రి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పొంతన లేని సమాధానాలతో పోలీసులకు కొమరయ్యపై అనుమానం వచ్చింది. దీంతో ఆ కోణంలో పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. -
అత్తింట్లోనే వివాహిత సమాధి
-
అత్తింట్లోనే వివాహిత సమాధి
- నట్టింట్లో గొయ్యి తీసి పాతిపెట్టిన బంధువులు - పిల్లలకు న్యాయం చేయాలని ఆందోళన కాశిబుగ్గ: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఓ వివాహితను ఆమె బంధువులే ఆమె అత్తగారి ఇంట్లోనే సమాధి చేసిన ఉదంతం సోమవారం వరంగల్ నగరంలోని ఏనుమాములలో జరిగింది. నట్టింట్లో గొయ్యి తీసి ఆమె మృతదేహాన్ని సమాధి చేసిన బంధువులు పిల్లలకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. ఏనుమాములకు చెందిన ఆమెర రాధిక ఆదివారం వేకువన అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే, భర్త విజయ్‌కుమార్‌తో పాటు అత్తింటి వారు వేధించి రాధికను హత్య చేశారని ఆమె తండ్రి యాకయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం జరగగా, బంధువులు ఆమె మృతదేహాన్ని నేరుగా రాధిక అత్తగారింటికి తీసుకొచ్చారు. నట్టింట్లో గొయ్యి తీసి సమాధి చేశారు. రాధ భర్త విజయ్‌కుమార్ పేరున ఉన్న ఆస్తి మొత్తాన్ని మృతురాలి ముగ్గురు పిల్లలకు రాసి ఇవ్వాలని, కలెక్టర్ వచ్చి న్యాయం చేయాలంటూ ఇంటి ముందు బైఠాయించారు. ఏసీపీ చైతన్య కుమార్ వచ్చి మృతురాలి బంధువులకు నచ్చజెప్పారు. ఆస్తి గురించి సంతకాలు తమ ముందే చేయించాలని పట్టుపట్టారు. స్థానిక కార్పొరేటర్ తూర్పాటి సులోచనను పిలిపించి.. మృతురాలి బంధువులు ఐదుగురు స్టేషన్‌కు వస్తే అందరి సమక్షంలో సంతకాలు చేయిస్తానని ఏసీపీ హామీ ఇచ్చారు. ఇంటి వద్ద ఎవరూ ఉండకూడదని, సంతకాల బాధ్యత తనదేనని ఏసీపీ చెప్పినా మృతురాలి బంధువులు ఇంటి వద్దనే ఉన్నారు. దీంతో పోలీసులు ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.