కరీంనగర్ క్రైం: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కన్నతండ్రే నిందితుడు కావడం గమనార్హం. కూతురనే కనికరం కూడా లేకుండా తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దిండుతో ఊపిరి ఆడకుండా చేసి ప్రాణం తీసి, ఆ తర్వాత కత్తితో గొంతు కోశాడు. అంతేకాకుండా కేసును తప్పుదారి పట్టించేందుకు ఇంట్లో చోరీ జరిగినట్లు నాటకం ఆడాడు. ఫిబ్రవరి 10న విద్యానగర్‌లో రాధిక దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో రాధిక తండ్రి కొమరయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీ కమలాసన్ రెడ్డి సమక్షంలో నిందితుడిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు.
(చదవండి: హంతకుడు ఎవరు..?!)
ఈ సందర్భంగా సీపీ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ.. రాధికకు ఓవైపు వైద్యానికి అయ్యే ఖర్చులు, మరోవైపు పెళ్లి ఖర్చులు భరించలేకే కూతురిని కొమరయ్య హతమార్చినట్లు తెలిపారు. అయితే సీన్ డిస్టర్బ్ చేయకపోవడంతో తండ్రిపై ఎలాంటి అనుమానం రాలేదన్నారు. కొమరయ్య బనియన్, చెప్పులపైకంటికి కనిపించని రక్తపు మరకలను జర్మన్ టెక్నాలజీతో గుర్తించినట్లు వెల్లడించారు. డీఎన్‌ఏ నిర్థారణతో అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తానే రాధికనే హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నాడని తెలిపారు.
ఈ కేసులో దాదాపు 60 మందిని విచారించడంతో పాటు 200 మందికిపైగా కాల్‌డేటాలు పోలీసులు పరిశీలించారు. 21 రోజులుగా 8 బృందాలకు సంబంధించి దాదాపు 75 మందికి పైగా పోలీసుల అహర్నిశలు శ్రమించారు. కాగా రాధిక హత్య జరిగిన ఫిబ్రవరి 10 తేదీన కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుంటూ పోలీసు అధికారులకు సూచనలిచ్చారు. ఇక్కడి క్లూస్‌టీం ఆధారాలతో కొన్ని విషయాలు నిర్ధారణ కాకపోవడంతో సీపీ హైదరాబాద్ నుంచి ప్రత్యేక క్లూస్‌టీం బృందాన్ని కరీంనగర్‌కు రప్పించి జర్మన్ టెక్నాలజీతో ఆధారాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు.
(చదవండి: క్లైమాక్స్‌కు రాధిక హత్య కేసు..?)
లభించిన ఆధారాల నివేదికలతో రాధిక తండ్రిపై పోలీసుల దృష్టి సారించారు. అయితే రాధిక హత్యను పక్కదారి పట్టించేందుకే చోరీ నాటకం ఆడాడు. రాధిక హత్య జరిగిన రోజు ఇంట్లో చోరీ జరిగిందని రూ.99 వేలతో పాటు 3 తులాల బంగారం పోయిందని ఆమె తండ్రి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పొంతన లేని సమాధానాలతో పోలీసులకు కొమరయ్యపై అనుమానం వచ్చింది. దీంతో ఆ కోణంలో పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment