సాగర్ క్రస్ట్‌గేట్ల మరమ్మతులు ప్రారంభం
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్‌గేట్ల బ్రిడ్జి రూలర్ల మరమ్మతు పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. అస్తవ్యస్తంగా ఉన్న రేడియల్ క్రస్ట్ గేట్ల వ్యవస్థపై గతంలో పలుమార్లు ‘సాక్షి’ దినపత్రికలో కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో స్పందించిన అధికారులు నిపుణులను పిలిపించి రూలర్లను పరిశీలించారు. వీటికి మరమ్మతులు చేపట్టకపోతే గేట్లు, ఎత్తడం, దించే సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయని తేల్చడంతో పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదటి బ్లాకులో వంగిన రూలర్లను జాకీల సహాయంతో లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం బ్లాకుల మధ్య ఉన్న రివిట్మెంట్లను గ్యాస్‌కట్టర్‌తో విడదీస్తున్నారు. ఈ పనులను తెలంగాణ ప్రాజెక్టుల రక్షణ కమిటీ సభ్యులు ఎన్. కన్నయ్యనాయుడు, డ్యాం మెయింటెనెన్స్ ఎస్ఈ రమేశ్, డీఈ విజయకుమార్, జేఈ కృష్ణయ్యలు పర్యవేక్షిస్తున్నారు.
బ్రిడ్జి గ్యారంటీ పీరియడ్ పూరై్తంది – కన్నయ్యనాయుడు
సాగర్ క్రస్ట్ గేట్ల బ్రిడ్జి గ్యారంటీ పీరియడ్ పూరైందని తెలంగాణ ప్రాజెక్టుల రక్షణ కమిటీ సభ్యుడు కన్నయ్యనాయుడు అన్నారు. వాలిపోయిన రూలర్లను సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నాం. 26 గేట్ల బ్రిడ్జి విడివిడిగా ఉంటే ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మరమ్మతులు చేస్తే సరిపోయేది. ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నం ఫలించకపోతే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి టెయిల్‌పాండ్ ప్రాజెక్టుకు ఏర్పాటు చేసినట్లుగా ఆటోమేటిక్ గేట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.