కోతిలా ఉన్నావంటూ అవమానించారు..!
ఒకప్పుడు ఆమెను అందరూ చాలా చులకనగా చూశారు. అంతకుమించి చెప్పాలంటే.. నువ్వు కోతిలా ఉన్నావు. నువ్వు కూడా ఒలింపిక్స్ లో పాల్గొంటావా అంటూ హేళన చేశారు. 2012 లండన్ ఒలింపిక్స్ లో పాల్గొని ఒట్టి చేతులతో స్వదేశానికి తిరిగొచ్చింది. ఆమె పతకంతో తిరిగిరాలేదు.. కానీ, పతకం సాధించాలన్న కసితో ఎగిసిన కెరటంలా తన ప్రతాపం చూపించింది. ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చిన బ్రెజిల్‌కు తొలి స్వర్ణాన్ని అందించింది. దేశం గర్వపడేలా, తన దేశ క్రీడాకారులందరూ తలెత్తుకునేలా చేసింది. ఆమె మరోవరో కాదు.. జూడోలో స్వర్ణం సాధించిన రాఫీలా సిల్వ.
రియో ఒలింపిక్స్ జూడోలో మహిళల 57 కేజీల విభాగంలో బరిలోకి దిగిన రాఫీలా.. ఏకంగా స్వర్ణాన్ని కొల్లగొట్టింది. ఇందులో భాగంగా ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్, మంగోలియాకు సుమియా డార్జుసురెన్ ను కూడా ఓడించింది. 'జూడో నా కెరీర్, జీవితం. సొంతగడ్డపై స్వర్ణాన్ని సాధించడం మరిచిపోలేని అనుభూతి. సొంత అభిమానుల మద్ధతు ఉండటంతో నా విజయం సాధ్యమైంది. వారికి ధన్యవాదాలు' అని స్వర్ణం సాధించిన రాఫీలా ఉద్వేగానికి లోనైంది. రియోలో ఇప్పటివరకూ బ్రెజిల్ సాధించిన ఏకైక స్వర్ణం గతంలో జాతి వివక్షకు గురైన ఆమె సాధించనదే కావడం గమనార్హం.
లండన్ 2012లో రూల్స్ ఉల్లంఘించిన కారణంగా కొన్ని రౌండ్లలోనే ఇంటి దారి పట్టింది. ఆమె కోతిలా ఉందని, ఇలాంటి వారు జూలో ఉంటారని సిల్వపై అప్పట్లో చాలా రకాల కామెంట్లు చేశారు. బ్రెజిల్ లోని అతిపెద్ద మురికివాడ ఫవేలా నుంచి వచ్చిన ఆమె.. 2013లో మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్ గా అవతరించిన దేశ తొలి క్రీడాకారిణిగా నిలిచింది. బోనులో ఉండాల్సిన కోతి లండన్ కు వచ్చిందంటూ అప్పట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న తాను నేడు స్వదేశంలో స్వర్ణంతో సమాధానం చెప్పాను అని రాఫీలా తన మనసులోని బాధను వెల్లడించింది. జాత్యహంకారంతో వివక్ష చూపితే ఎంత కష్టంగా ఉంటుందో మాటల్లో చెప్పలేమంటూ కన్నీటి పర్యంతమయింది.