రేపు ముంబైలో బెన్ బెర్నాకీ
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ మాజీ చైర్మన్ బెన్ షాలోమ్ బెర్నాకీ మంగళవారం ముంబై రానున్నారు.కోటక్ మహీంద్రా బ్యాంక్ రెండోసారి ఏర్పాటు చేస్తోన్న మేధో నాయకత్వ సమావేశం, కోటక్ ప్రిసీడియమ్కు బెర్నాకీ ఈ ఏడాది ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్‌కు రెండు సార్లు చైర్మన్‌గా(2006 నుంచి 2014 వరకూ) పనిచేసిన బెర్నాకీ ముంబై సందర్శించడం ఇది రెండోసారి. ఇక మంగళవారం సాయంకాలం ఇక్కడ జరిగే కోటక్ ప్రిసీడియమ్లో పలువురు కీలక ప్రభుత్వాధినేతలు, వ్యాపార దిగ్గజాలు పాల్గొంటారని కోటక్ బ్యాంక్ వర్గాలు తెలిపాయి.
ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు, సెబీ చీఫ్ యు.కె. సిన్హా, ఐఆర్డీఏ చీఫ్ టి.ఎస్. విజయన్, టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ, అంబానీ సోదరులు, దీపక్ పరేఖ్, కుమార మంగళం బిర్లా, ఆది గోద్రేజ్ వంటి వ్యాపార దిగ్గజాలు, ప్రముఖ బ్యాంకుల అధినేతలు కూడా పాల్గొంటారని ఈ వర్గాలు వెల్లడించాయి. అయితే రఘురామ్ రాజన్ వాషింగ్టన్లో ఉన్నందున ఆయన ఈ సమావేశానికి హాజరుకాకపోవచ్చు.