rahul srivasthava
-
‘గ్రాండ్‌మాస్టర్’ రాహుల్
సాక్షి, హైదరాబాద్: మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ తెలంగాణ యువ చెస్ ప్లేయర్ రాహుల్ శ్రీవత్సవ్ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదాను దక్కించుకున్నాడు. భారత్ తరఫున 74వ గ్రాండ్‌మాస్టర్‌గా రాహుల్ నిలిచాడు. హర్ష భరతకోటి, ఇరిగేశి అర్జున్, రాజా రిత్విక్ తర్వాత తెలంగాణ నుంచి గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందిన నాలుగో ప్లేయర్‌గా రాహుల్ నిలిచాడు. జీఎం టైటిల్ ఖరారు కావాలంటే ఓ చెస్ ప్లేయర్ మూడు జీఎం నార్మ్‌లను అందుకోవడంతోపాటు 2500 ఎలో రేటింగ్ పాయింట్లను సాధించాలి. 19 ఏళ్ల రాహుల్ 2019లోనే మూడు జీఎం నార్మ్‌లను సాధించినా 2500 ఎలో రేటింగ్ పాయింట్లకు దూరంగా నిలిచాడు. దాంతో అతనికి జీఎం టైటిల్ ఖరారు కాలేదు. అదే సమయంలో అమెరికాలోని యూనివర్సీటీ ఆఫ్ టెక్సాస్‌లో రాహుల్ ఎకనామిక్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో చేరాడు. ఒకవైపు చదువు కొనసాగిస్తూ యూనివర్సిటీ చెస్ జట్టులో తన ప్రావీణ్యానికి మరింత పదును పెట్టాడు. నెల రోజుల క్రితం 2468 ఎలో రేటింగ్ పాయింట్లతో ఇటలీ చేరుకున్న రాహుల్ అక్కడ మూడు టోర్నీలలో బరిలోకి దిగాడు. తాజాగా కాటోలికా చెస్ ఫెస్టివల్లో రాహుల్ ఎనిమిదో రౌండ్లో జార్జియా గ్రాండ్‌మాస్టర్ లెవాన్ పంత్సులైతో జరిగిన గేమ్‌ను ‘డ్రా’ చేసుకోవడంతో అతను 2500 ఎలో రేటింగ్ పాయింట్ల మైలురాయిని అందుకొని జీఎం టైటిల్‌ను ఖరారు చేసుకున్నాడు. -
జీఎం హోదాకు చేరువలో రాహుల్ శ్రీవత్సవ్
సాక్షి, హైదరాబాద్: చదరంగంలో తెలంగాణ నుంచి త్వరలోనే మరో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) అవతరించనున్నాడు. హైదరాబాద్ క్రీడాకారుడు, 18 ఏళ్ల రాహుల్ శ్రీవత్సవ్ ఈ హోదాకు చేరువయ్యాడు. వెనిస్ వేదికగా జరిగిన మోంట్బెలూనా ఓపెన్ చెస్ టోర్నీలో మెరుగ్గా రాణించిన ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) రాహుల్... గ్రాండ్ మాస్టర్ హోదా పొందడానికి అవసరమైన మూడో నార్మ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో తనకన్నా మెరుగైన ప్రత్యర్థులతో ఆడిన రాహుల్ నాలుగు గేమ్‌ల్లో గెలుపొంది, ఐదు గేమ్‌ల్ని డ్రా చేసుకున్నాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్లు ముగిశాక 6.5 పాయింట్లతో అతను మూడో స్థానంలో నిలిచాడు. తొలి రెండు గేమ్‌ల్లో సాహిన్ ఓజ్గన్ (టర్కీ), ఐఎం సంకల్ప్ గుప్తా (భారత్)లపై గెలుపొందిన రాహుల్ మూడు, నాలుగు గేమ్‌ల్లో వరుసగా మార్టినెజ్ జోస్ ఎడ్యుర్డో (పెరూ), ఓజెన్ డెనిజ్ (టర్కీ)లతో డ్రా చేసుకున్నాడు. తర్వాతి రెండు గేమ్‌లలో బర్సెయాన్ హరుత్యున్ (ఫ్రాన్స్), నికోలోవ్స్కీ నికోలా (మసెడోనియా)లపై నెగ్గాడు. తర్వాత వరుసగా ముగ్గురు గ్రాండ్‌మాస్టర్లు స్మిర్నోవ్ అంటోన్ (ఆస్ట్రేలియా), జనన్ ఇవ్‌జెనీ (ఇజ్రాయెల్), టెర్ సమక్యాన్ సామ్వెల్ (అర్మేనియా)లతో గేమ్‌లను డ్రా చేసుకున్నాడు. నిబంధనల ప్రకారం గ్రాండ్‌మాస్టర్ హోదా పొందడానికి మూడు జీఎం నార్మ్‌లతో పాటు 2500 ఎలో రేటింగ్ పాయింట్లు కచ్చితంగా సాధించాల్సి ఉంది. అయితే రాహుల్ మరో 31 ఎలో రేటింగ్ పాయింట్లు వెనుకబడి ఉండటంతో జీఎం హోదా పొందడానికి మరింత కాలం ఆగాల్సి ఉంటుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొనే రాహుల్ ఇటలీలో జరిగే మరిన్ని టోర్నీల్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. రాహుల్ అనుకున్నది సాధిస్తే... ఇరిగైసి అర్జున్, హర్ష భరతకోటి తర్వాత తెలంగాణ తరఫున మూడో గ్రాండ్‌మాస్టర్‌గా అవతరిస్తాడు. -
దుబాయ్ చెస్ టోర్నీలో సత్తాచాటిన రాహుల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన పి. రాహుల్ శ్రీవాస్తవ దుబాయ్ జూనియర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో మెరిశాడు. దుబాయ్‌లో మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో అతను రజత పతకం సాధించాడు. 9 రౌండ్ల పాటు స్విస్ లీగ్ ఫార్మాట్లో జరిగిన ఈ ఈవెంట్లో అతను 7.5 పాయింట్లు సాధించాడు. ఈ టోర్నీలో హైదరాబాద్ కుర్రాడు... ఒకే ఒక్క మ్యాచ్‌లో మొహమ్మద్ రహమాన్ (బంగ్లాదేశ్) చేతిలో ఓడాడు. రహమాన్ 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఏడున్నర పాయింట్లతో రాహుల్‌తో కలిసి మట్విషెన్ విక్టర్ (ఉక్రెయిన్) ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నప్పటికీ మెరుగైన టైబ్రేక్ స్కోరుతో రాహుల్‌కు రెండు, విక్టర్ మూడో స్థానం దక్కాయి. రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ కుర్రాడికి పతకంతో పాటు రూ. లక్షా 5వేల (1600 డాలర్లు) ప్రైజ్‌మనీ లభించింది.