టెస్టింగ్ దశలో కొత్త ఫీచర్.. నచ్చిన ధరకే ఉబర్ రైడ్!
చాలామంది తమ నిత్యజీవితంలో ఎక్కడ ఏం కొనాలన్నా కొంత బేరమాడుతూ ఉంటారు, ఇక ఆటోలో ప్రయాణించాలంటే మాత్రం డ్రైవర్‌తో కొంత బేరమాడకుండా ఉండలేరు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ 'ఉబర్' ఓ కొత్త ఫీచర్ తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇప్పటి వరకు క్యాబ్ బుక్ చేసుకోవాలంటే సంస్థ యాప్‌లో ఎంత రేటు చూపిస్తే అంత చెల్లించాల్సి వచ్చేది, దీంతో బేరమాడే అవకాశం లేకుండా పోయింది. ఉబర్ పరిచయం చేయనున్న కొత్త ఫీచర్ 'ఉబర్ ఫ్లెక్స్’లో మనకు నచ్చిన రేటుకే క్యాబ్ ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలోనే ఉంది. త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
ఉబర్ పరిచయం చేయనున్న కొత్త ఫీచర్ ఒక రేటును కాకుండా.. యూజర్ ప్రయాణించే దూరం, సమయం వంటి వాటిని ఆధారంగా తీసుకుని తొమ్మిది ధరలను చూపిస్తుంది. ఇందులో వింభియోగదారుడు తనకు నచ్చిన రేటుని ఎంచుకోవచ్చు, అయితే ఆ రేటు డ్రైవర్‌కి నచ్చితే యాక్సెప్ట్ చేయొచ్చు, లేదా రిజెక్ట్ చేయొచ్చు.
ఇదీ చదవండి: చైనాను దాటేసిన భారత్.. త్వరలో అమెరికా! - ఆనంద్ మహీంద్రా ట్వీట్
ఒకే రేటు దగ్గర నిలిచిపోకుండా.. కస్టమర్ తనకు నచ్చిన రేటును ఎంచుకునే అవకాశాన్ని ఉబర్ కల్పిస్తోంది. ఇది వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, అదే సమయంలో తక్కువ ధరకే ప్రయాణం చేసే వెసులుబాటుని పొందవచ్చు. ఈ ఫీచర్‌ను ఉబర్ కంపెనీ భారతదేశంలో ఔరంగాబాద్, ఆజ్మీర్, బరేలీ, చండీగఢ్, కోయంబత్తూర్, దేహ్రాదూన్, గ్వాలియర్, ఇందౌర్, జోధ్‌పుర్, సూరత్ ప్రాంతాల్లో టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. భారత్ మాత్రమే కాకుండా లాటిన్ అమెరికా, కెన్యా దేశాల్లో కూడా సంస్థ ఈ ఫీచర్‌ను అమలుచేసే అవకాశం ఉంది.