పాతభవనాలపై రైల్వే అలర్ట్
సాక్షి, ముంబై : రైల్వేలైన్ల వెంట ఉన్న పాతభవనాలు ప్రమాదకరంగా మారాయి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల శ్యాండ్‌హస్ట్ రోడ్ రైల్వే స్టేషన్ వద్ద ఇటీవల ఓ భవనం పాక్షికంగా కూలడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ ఘటనతో సెంట్రల్ రైల్వే పరిపాలన విభాగం కళ్లు తెరిచింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రైలు పట్టాల వెంట ఉన్న పాత భవనాలన్నింటిని గుర్తించి అధ్యయనం చేయాలని పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. అందుకు బీఎంసీపై ఆధారపడకుండా రైల్వే అధికారులే స్వయంగా అధ్యయనం చేసి నివే దిక రూపొందించనుంది. ఆ తరువాత ఆ నివేదికను మహానగర పాలక సంస్థ (బీఎంసీ)కి అందజేయాలని నిర్ణయించిందని సెంట్రల్ రైల్వే పీఆర్వో నరేంద్ర పాటిల్ తెలిపారు.
వర్షాకాలంలో ముప్పు
రెండు రోజుల కిందట శ్యాండ్‌హస్ట్ రోడ్ స్టేషన్ ఎదుట ఉన్న థోరత్ హౌస్ భవనం కొంత భాగం కూలింది. ఆ శిథిలాలు పక్కనే ఉన్న హార్బర్ రైల్వే మార్గంపై వచ్చి పడడంతో కొన్ని గంటలపాటు లోకల్ రైళ్లకు అంతరాయం కలిగింది. ఈ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో దీన్ని కూల్చివేయాలని రైల్వే గతంలోనే బీఎంసీకి సూచించింది. కానీ బీఎంసీ నిర్లక్ష్యం చేయడం వల్ల మళ్లీ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి ప్రమాదకర, శిథిలావస్థకు చేరుకున్న భవనాలు రైల్వే ట్రాక్‌కు ఆనుకుని అనేకం ఉన్నాయి.
అవి వర్షాకాలంలో ఎప్పుడైనా కూలే ప్రమాదం ఉంది. ప్రయాణికుల భద్రతకే పెద్ద పీట వేస్తున్నట్లు ప్రకటించిన రైల్వే పరిపాలన విభాగానికి ఇలాంటి భవనాలు తల నొప్పులు తెచ్చిపెడుతున్నాయి. దురదుష్టవశాత్తు అవి కూలే సమయంలో రైలు వస్తే అప్పుడు ప్రమాద తీవ్రత ఘోరంగా ఉంటుంది. అందుకే ముందుగానే ఇలాంటి పాత భవనాలపై అధ్యయనం చేయాలని సెంట్రల్ రైల్వే వర్గాలు నిర్ణయించాయి. ఈ బాధ్యతలను సీనియర్ అధికారుల బృందానికి అప్పజెప్పనున్నాయి. ముందుగా ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ), శ్యాండ్‌హస్ట్ రోడ్ స్టేషన్ పరిసరాల్లో శిథిల భవనాలపై అధ్యయనం చేయనున్నారు. ఆ తరువాత పట్టాల వెంట ఉన్న మిగతా ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు సెంట్రల్ రైల్వే పీఆర్వో తెలిపారు.