railway bogie
-
ఐసోలేషన్ కోచ్‌లు రెడీ
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడిలో భాగంగా భారతీయ రైల్వే బహుముఖ వ్యూహాలను అమలు చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా 5000 నాన్ ఏసి కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చాలనే ఆలోచనలో భారతీయ రైల్యే ఉంది. ఇందులో భాగంగా 486 కోచ్‌లను తయారు చేయాలని దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు లక్ష్యాన్ని నిర్దేశించింది. తదనుగుణంగా, సికింద్రాబాద్ డివిజన్ 120 కోచ్‌లు, హైదరాబాద్ డివిజన్ 40 కోచ్‌లు, విజయవాడ డివిజన్ 50 కోచ్‌లు, గుంతకల్లు డివిజన్ 61 కోచ్‌లు, నాందేడ్ డివిజన్ 30 కోచ్‌లు, గుంటూరు డివిజన్ 25 కోచ్‌లు, లాలాగూడ వర్క్‌షాప్ 76 కోచ్‌లు, తిరుపతి వర్క్‌షాప్ 84 కోచ్‌లను ఐసోలేషన్ కోచ్‌లుగా మార్చాయి. ఇందుకు సంబంధించి దక్షిణమధ్య రైల్వే ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. (బోగీల్లో 20 వేల ఐసోలేషన్ పడకలు!) ప్రతి ఐసోలేషన్ వార్డులో కరోనా బాధితుల కోసం 8 కూపేలు, వైద్య సిబ్బంది కోసం ఒక కూపే ఉంటాయని నోట్లో తెలిపారు. రైల్వే బోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని కోచ్‌లలో స్నానాల గది, 3 టాయిలెట్లు, కూపేల మధ్య తెరలు, అవసరమైన ఎలక్ట్రిక్, వైద్య పరికరాలు అమర్చడం జరిగిందని ఆ నోట్లో దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నిర్దేశించిన లక్ష్యంలోగా ఐసోలేషన కోచ్‌లను తయారు చేసిన దక్షిణ మధ్య రైల్వే అధికారులను, సిబ్బందిని జనరల్ మేనేజర్ శ్రీగజానన్ మాల్యా అభినందించారు. (రైల్వే బుకింగ్‌లు షురూ!) -
బోగీల్లో 20 వేల ఐసోలేషన్ పడకలు!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యలో దేశవ్యాప్తంగా కనీసం 20 వేల రైల్వే బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చేందుకు సిద్ధంగా ఉండాలని∙రైల్వే బోర్డు ప్రాంతీయ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. జోనల్ రైల్వే మేనేజర్లందరికీ సోమవారం రాసిన ఒక లేఖ ప్రకారం కోవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు ముందుగా 5000 రైల్వే బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చాల్సి ఉంటుందని రైల్వే బోర్డు తెలిపింది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ సర్వీసెస్‌తోపాటు వేర్వేరు రైల్వే జోన్లు, ఆయుష్మాన్ భారత్ వర్గాలతో సంప్రదింపులు జరిపినట్లు బోర్డు తెలిపింది. దేశం మొత్తమ్మీద ఐదు రైల్వే జోన్లు ఇప్పటికే నమూనా ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేశాయని బోర్డు తెలిపింది. కోవిడ్‌ను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా మార్చి 25న జరిగిన ఒక వీడియో సమావేశంలో కొన్ని బోగీలను క్వారంటైన్, ఐసోలేషన్ వార్డులుగా మార్చాల్సి ఉంటుందని నిర్ణయించాం. ఇందులో భాగంగా నాన్ ఏసీ, స్లీపర్ బోగీలను వాడాలని తీర్మానించాం అని ఈ లేఖలో పేర్కొన్నారు. ఐసోలేషన్ వార్డులో ఏమేం ఉండాలన్న విషయాలను కూడా ఈ లేఖలో విపులీకరించారు. చెక్క పలక ఒకదాన్ని పరచడం ద్వారా ఒక టాయిలెట్‌ను స్నానాలగదిగా మారుస్తారు. దీంతో అడుగుభాగం మొత్తం చదునుగా ఉంటుంది. ఇందులోనే ఒక బకెట్, మగ్, సోప్ డిస్పెన్సర్ ఉంచుతారు. వాష్‌బేసిన్లలోని కుళాయిలను మారుస్తారు. బాత్రూమ్ సమీపంలోని తొలి కేబిన్ వద్ద ఆసుపత్రుల్లో వాడే తెరలను ఉపయోగిస్తారు. తొలి కేబిన్‌లో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది సామాగ్రి ఉంటుంది. ఇదే కేబిన్‌లో ఆక్సిజన్ సిలిండర్లను బిగించాల్సి ఉంటుంది. మధ్యలో ఉండే బెర్త్‌లను తొలగిస్తారు. ప్రతి కేబిన్‌లోనూ అదనంగా బాటిల్ హోల్డర్లను ఏర్పాటు చేస్తారు. కిటికీలపై దోమతెరలు ఏర్పాటవుతాయి. ప్రతి కేబిన్‌లో డస్ట్‌బిన్స్, బయటి వేడి తగలకుండా వెదురు లేదా వట్టివేళ్లవంటివి కేబిన్ పైన, కింద అమరుస్తారు. ల్యాప్‌టాప్, మొబైల్ చార్జింగ్ పాయింట్లన్నీ పని చేస్తాయి. -
రైలు బోగినే.. ప్రసూతి గదైన వేళ
సీతాపూర్: రైలు బోగే ఆ తల్లికి ప్రసూతి గది అయింది. స్ధానిక రైల్వే పోలీసు ఆమె పాలిట దేవుడయ్యాడు. అధికారులు, తోటి ప్రయాణికుల సాయంతో ఆ మహిళ రైలు బోగిలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన సోమవారం రాత్రి జననాయక్ ఎక్స్‌ప్రెస్‌లో చోటు చేసుకుంది. రైల్వే అధికారుల వివరాల ప్రకారం సుమన్ దేవీ (30), తన భర్త హరి ఓంతో కలిసి ప్రసవం కోసం ఉత్తరప్రదేశ్‌లోని ఘోరక్‌పూర్‌కి బయలుదేరింది. మార్గమధ్యలో సుమన్ దేవికి నొప్పులు ప్రారంభమయ్యాయి. రైలు సీతాపూర్ చేరుకునే సరికి పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో ఆమె భర్త హరిఓం సీతాపూర్ స్టేషన్ ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారి (జీఆర్పీ) సురేష్ యాదవ్‌ని సహాయం చేయవలసిందిగా కోరాడు. అదృష్టవశాత్తు ఆ అధికారి కూడా డాక్టర్ కావడంతో ఆయన వెంటనే స్పందించి తన తోటి మహిళా కానిస్టేబుల్, ఇతర మహిళా ప్రయాణికుల సాయంతో సుమన్ దేవికి రైలు బోగిలోనే ప్రసవం చేశారు. సుమన్ దేవి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ లోపు అధికారులు అంబులెన్స్‌ని ఏర్పాటు చేయడంతో తల్లి, బిడ్డలను సీతాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో రైలు ఒక గంట ఆలస్యమైంది. రైలులోనే ప్రసవం జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ సల్మా షైక్ (26) అనే మహిళ ముంబై లోకల్ రైలులోనే ప్రసవించింది. సల్మా ఛత్రపతి శివాజీ టెర్మినల్‌కు వెళ్తుండగా ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే సమీప దాదర్ స్టేషన్‌లోని ఒక్క రూపాయి ఆస్పత్రి వైద్యులు వచ్చి ఆమెను పరీక్షించారు. సల్మాకు క్రోనింగ్ మొదలవ్వడంతో ఆస్పత్రికి తీసుకెళ్లే వ్యవధి లేకపోయింది. వెంటనే రైలులోని ఆడవారి కంపార్ట్మెంట్లో ఆమెకు ప్రసవం చేశారు. అనంతరం తల్లీ, బిడ్డలను సమీప కేయీఎమ్ ఆస్పత్రికి తరలించారు. ముంబై లోకల్ రైలులో సల్మా షైక్ బిడ్డతో రైల్వే అధికారులు, వైద్య సిబ్బంది (పాత ఫొటో) -
అమ్మకానికి ‘రత్నాచల్’ బోగీ
విజయవాడ: తూర్పుగోదావరి జిల్లా తునిలో దగ్ధమైన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బోగీలను పాత ఇనుముగా విక్రయించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఈ టెండర్‌ను దక్షిణ మధ్య రైల్వే అధికారులు పిలిచారు. మొత్తం 17 బోగీలను వేలం ద్వారా విక్రయిస్తున్నారు. ఎక్కువ ధరకు టెండర్ వేసిన వారికి ఖరారు చేస్తామని విజయవాడ డివిజన్ అధికారులు చెబుతున్నారు. జనవరి 30న తునిలో కాపుగర్జన సందర్భంగా రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను దహనం చేసిన విషయం విదితమే. ఘటన జరిగిన తర్వాత ఈ బోగీలను తుని స్టేషన్‌కు తరలించి ఇటీవలే విజయవాడ తీసుకొచ్చి వేలం నిర్వహిస్తున్నారు.