Railway institute
-
సేవ చేయడం అదృష్టం
సాక్షి, విజయనగరం టౌన్ : రైల్వే హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్థానిక రైల్వే ఇనిస్టిట్యూట్ ఆవరణలో ఆదివారం స్కూల్ బ్యాగ్‌లు, పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్ ఇతరత్రా వస్తువులను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వన్‌టౌన్ ఎస్ఐ కిల్లారి కిరణ్ కుమార్ నాయుడు హాజరై మాట్లాడారు. సమాజానికి సేవ చేసే అవకాశం రావడం చాలా గొప్ప అదృష్టమని, ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని, ఉద్యోగంతో పాటూ సేవా కార్యక్రమాలు చేపడుతున్న సభ్యులను అభినందించారు. రైల్వే అసిస్టెంట్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ సత్యనారాయణ, సంస్థ సభ్యులు వైశాఖ్, ఎం.కనకరాజు, నాగేశ్వరరావు, మురళీ, జైశంకర్, మారుతి తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా రైల్వే విజిలెన్స్ వారోత్సవాలు
విజయవాడ (రైల్వేస్టేషన్) : రైల్వే విజిలెన్స్ వారోత్సవాలు బుధవారం సాయంత్రం రైల్వే ఇనిస్టిట్యూట్ హాల్లో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్ఎం అశోక్‌కుమార్ మాట్లాడుతూ రైల్వే విభాగంలో అక్రమాల నిరోధం, ఆస్తుల పరిరక్షణలో విజిలెన్స్ విభాగానిది కీలకపాత్ర అని కొనియాడారు. రైల్వే వివిధ విభాగాల్లో అవినీతి, అక్రమాలకు తావులేకుండా విజిలెన్స్ విభాగం చురుకైన పాత్ర పోషిస్తోందన్నారు. ఏడీఆర్ఎం కె.వేణుగోపాలరావు మాట్లాడుతూ ఎంతో ఒత్తిడితో విధులు నిర్వహించే విభాగం విజిలెన్స్ అని, ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొని విధులు నిర్వహిస్తున్న ఈ విభాగం అధికారులు, సిబ్బందిని ఏడీఆర్ఎం ఈ సందర్భంగా అభినందించారు. రాయనపాడు వర్క్‌షాపు నిర్వహణ విభాగ ముఖ్య అధికారి ఆర్.వి.ఎన్.శర్మ, సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ నహేమియా, సౌత్‌సెంట్రల్ రైల్వే ఉమెన్ వెల్ఫేర్ విజయవాడ డివిజన్ ప్రెసిడెంట్ చిత్రారాణి, విజయవాడ డివిజన్ ఇన్చార్జ్ పీఆర్వో జె.వి.ఆర్.కె.రాజశేఖర్, అకౌంట్స్ విభాగ అధికారులు కె.బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
దేశ ప్రగతిలో రైల్వేలు కీలకం
గుత్తి, న్యూస్‌లైన్: దేశ ప్రగతిలో రైల్వేలు కీలకమని గుత్తి రైల్వే డీజిల్‌షెడ్ సీనియర్ డీఎంఈ శ్రీనివాస్ అన్నారు. రైల్వే ఇన్స్టిట్యూట్ మైదానంలో ఆదివారం ఆయన బెలూన్లను ఎగురవేసి గుత్తి రైల్వే లోకో డీజిల్ షెడ్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ భారతీయ రైల్వేలు ప్రజా జీవితంతో పెనవేసుకుపోయాయన్నారు. డీజిల్షెడ్గా అవతరించి 50 వసంతాలు పూర్తి చేసుకోవడం ఆనందదాయకమన్నారు. అధికారులు, ఉద్యోగులు, కార్మికుల కృషి, ప్రజల సహాయ సహకారాలతోనే డీజిల్‌షెడ్ ఇంత అభివృద్ధి చెందిందన్నారు. అనంతరం రైల్వే ఇన్స్టిట్యూట్ మైదానంలో ఏర్పాటు చేసిన ఎస్వీ మోటార్స్ (హీరో షోరూమ్), శ్రీకరం మోటార్స్ స్టాల్స్‌ను ఉమెన్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు లీలా శ్రీనివాస్‌తో కలిసి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎస్బీహెచ్, ఫాస్ట్‌ఫుడ్, బేకరీ, హైదరాబాద్ శారీస్, ధర్మవరం పట్టు చీరలు, కిచెన్ వేర్స్, యమహా, టీవీఎస్, తదితర స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన భరత నాట్యం, కూచిపుడి, కథక్ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమా పాటలకు చేసిన డాన్స్‌లు అలరించాయి. అంతకు ముందు రైల్వే ఉద్యోగులు, సిబ్బంది, వివిధ యూనియన్ల నాయకులు సీనియర్ డీఎంఈ శ్రీనివాస్‌కు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో రైల్వే యూనియన్ల నాయకులు రాజమోహన్‌రెడ్డి, నారాయణ, రాజేంద్ర ప్రసాద్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, ఆంజనేయులు, ప్రభాకర్, చినబాబు, పలువురు ఉన్నతాధికారులు, ప్రజలు పాల్గొన్నారు.