గుడ్‌న్యూస్..! కరీంనగర్–హసన్‌పర్తి రైల్వేలైన్‌కు కేంద్రం సుముఖం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త మోసుకొచ్చింది. చాలాకాలంగా జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న కరీంనగర్–హసన్‌పర్తి రైల్వేలైన్ సర్వేకు కేంద్ర రైల్వే బోర్డు ముందుకొచ్చింది. ఇందుకోసం రూ.1.54 కోట్లు కూడా విడుదల చేసింది. దీంతో ఆగిపోయిందనుకున్న ప్రాజెక్టు తిరిగి పట్టాలెక్కనుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రైల్వే కనెక్టివిటీ పరంగా మిగిలిన జిల్లాలతో పోలిస్తే వెనకబడ్డ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఈ ప్రాజెక్టు అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ 21న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి ప్రాజెక్టును పట్టాలెక్కించాలని కోరిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర రైల్వేబోర్డు సర్వేకు ఆమోదం తెలుపుతూ మే 8వ తేదీన ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
ప్రధాని పీవీ హయాంలో కదలిక
వాస్తవానికి కరీంనగర్– ఖాజీపేట రైల్వేలైన్ ఇప్పటిది కాదు. 1976లోనే ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. కానీ, సర్వే, అంచనా వ్యయం తదితర విషయాల్లో ఎలాంటి పురోగతి నమోదు కాలేదు. ప్రధానిగా పీవీ నరసింహారావు బాధ్యతలు స్వీకరించాక 1994లో ఈ ప్రాజెక్టు తిరిగి తెరమీదకు వచ్చింది. గతంలో ఈ ప్రాజెక్టును కరీంనగర్–ఖాజీపేటగా పిలిచేవారు.
వాస్తవానికి కరీంనగర్‌కు భౌగోళికంగా దారితీసే హసన్‌పర్తి రోడ్ స్టేషన్ నుంచి హుజూరాబాద్ మీదుగా మానకొండూరు తరువాత కరీంనగర్– పెద్దపల్లి రైల్వేలైన్ మీదుగా కరీంనగర్ రైల్వేస్టేషన్‌కు చేరాలి. కరీంనగర్–హసనపర్తిల మధ్య రైల్వేలైన్ దూరం 45 కి.మీ మాత్రమే అని గతంలో అధికారులు తెలిపారు. తాజాగా ఈ కేంద్రం జారీ చేసిన ఫైనల్ లోకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్)లో మాత్రం దీని దూరాన్ని 61.8 కిమీగా పేర్కొనడం విశేషం.
కరీంనగర్– హసన్‌పర్తి రైల్వేలైన్ నిర్మాణానికి సంబంధించి 2013లోనే సర్వే చేసినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వ అలసత్వంతో రైల్వేలైన్ నిర్మాణంలో పురోగతి లేకుండా పోయింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 13వ షెడ్యుల్ లోని ఐటం నంబర్–11 ప్రకారం కరీంనగర్– హసన్‌పర్తి రైల్వేలైన్ నిర్మాణం చేపట్టేందుకు అప్పటి ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రజలకు ఎంతో ప్రయోజనం. – ఎంపీ బండి సంజయ్
కనెక్టివిటీ ఇలా..
► కరీంనగర్– హసన్‌పర్తి రైల్వేలైన్ అందుబాటులోకి వస్తే.. పాత వరంగల్– కరీంనగర్ జిల్లాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. ముఖ్యంగా దక్షిణ– పశ్చిమ భారతదేశానికి ఈ రైల్వేలైన్ ఒక సంధానసేతువుగా నిలుస్తుంది. ప్రస్తుతం మహారాష్ట్ర వెళ్తున్న కరీంనగర్, వరంగల్ ప్రజలకు దాదాపు 200 కి.మీ చుట్టూ తిరిగి వెళ్లాల్సిన ప్రయాణభారం తప్పుతుంది.
► ఈ ప్రాజెక్టు పూర్తయితే కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల ప్రజలు మహారాష్ట్రలోని ముంబై, గుజరాత్‌లోని అహ్మదాబాద్ వంటి ఇతర నగరాలకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. మహారాష్ట్రలోని షిరిడీ, ఔరంగాబాద్, గుజరాత్‌లోని పలు పుణ్యక్షేత్రాలను కలిపేలైన్ కావడంతో పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతుంది.
► ఇప్పటికీ వరంగల్ నుంచి నిజామాబాద్ రైలు ప్రయాణం సాకారం కాలేదు. కానీ, నిజామాబాద్–కరీంనగర్–పెద్దపల్లి రైల్వేలైన్ పూర్తి కావడంతో కరీంనగర్ వరకు రైల్వేలైన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇప్పుడు కేవలం హసన్‌పర్తి నుంచి కరీంనగర్ వరకు లైన్ వేస్తే నిజామాబాద్–వరంగల్ మధ్య ప్రయాణం సాకారమవుతుంది.
► ఇక వరంగల్–కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలు ముంబై వెళ్లాలంటే ప్రస్తుతం మహరాష్ట్రలోని చంద్రాపూర్ మీదుగా దాదాపు 200 కి.మీ దూరం తిరిగి వెళ్లాలి. ఈ లైన్ పూర్తయితే.. ఆ ప్రయాణభారం తగ్గుతుంది.
► ప్రస్తుతం కరీంనగర్ ప్రజలు హైదరాబాద్ వెళ్లాలంటే కరీంనగర్– హసన్‌పర్తి రైల్వేలైన్ పూర్తయితే నేరుగా ఖాజీపేటకు లైన్ అందుబాటులోకి వస్తుంది. దీంతో కరీంనగర్ వాసులకు సికింద్రాబాద్‌కు వేగంగా రైల్లో ప్రయాణం చేసే వీలు దక్కుతుంది.
గతంలో ప్రతిపాదన రద్దు
వాస్తవానికి 2013 వరకు ఈ ప్రాజెక్టు అడపాదడపా తెరమీదకు రావడం ఆ తరువాత కనుమరుగవడం పరిపాటుగా మారింది. ఈ క్రమంలోనే కరీంనగర్– ఖాజీపేట రైల్వేలైన్ సర్వే జరిగింది. అప్పట్లో దాదాపు రూ.1.20 కోట్లు వెచ్చించి సర్వే చేసిన అధికారులు దాదాపు రూ.800 కోట్ల ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును చేపట్టడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఈ ప్రాజెక్టు రద్దు అప్పట్లో కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల మంటలు పెట్టింది కూడా. తాజాగా రైల్వే బోర్డు మరోసారి సర్వే చేసేందుకు ముందుకు రావడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.