నేడు రంజాన్
స్టేషన్ మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్: షవ్వాల్ నెలవంక గురువారం రాత్రి దర్శనమివ్వడంతో 29 రోజుల పాటు ముస్లింలు చేపట్టిన ఉపవాసాలను, తరావీ నమాజును విరమించారు. చంద్రుడు కనిపించడంతో ముస్లింలు పరస్పరం ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. శుక్రవార జిల్లావ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ జరుపుకుని, సర్వ మానవ కల్యాణం కోసం ప్రార్థనలు చేస్తారు. జామియ మసీదు నుంచి శుక్రవారం ఉదయం 9 గంటలకు ముస్లిం సోదరులు సామూహికంగా గడియారం చౌరస్తా మీదుగా స్థానిక వానగట్టు ఈద్గా వద్దకు చేరుకుంటారని ఈద్గా కమిటీ ఉపాధ్యక్షుడు మహ్మద్ జకీ తెలిపారు.
ఈద్గా వద్ద ఉదయం 10 గంటలకు జామియా మసీదు ప్రధాన ఇమామ్ మహ్మద్ అబ్దుల్ కరీం ప్రత్యేక ప్రార్థనలు చేయిస్తారని తెలిపారు. స్థానిక మదీనా మజీదులో ఉదయం 9.30 గంటలకు, రైల్వేస్టేషన్‌లోని చౌరస్తాలోని ఒమర్ ఓ ఆమేనా మజీదులో ఉదయం 10.15 గంటలకు రంజాన్ నమాజు నిర్వహిస్తున్నట్లు ఆయా మజీదుల నిర్వాహకులు తెలిపారు. ముస్లిం సోదరులకు కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ ఎం.గిరిజాశంకర్, ఎస్పీ నాగేంద్రకుమార్, వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, ఇతర నాయకులు ఈద్గా వద్దకు వచ్చి పండుగ శుభాకాంక్షలు తెలుపనున్నారు.