‘భూ’ భేటీకి కార్యదర్శుల డుమ్మా!
మండిపడ్డ సంయుక్త పార్లమెంటరీ కమిటీ
న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లుపై నిర్వహించిన సమావేశానికి ఉన్నతాధికారులు హాజరుకాకపోవడంపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ మండిపడింది. ఇది కమిటీని అవమానించడమేనని దుయ్యబట్టింది. గురువారం కమిటీ నిర్వహించిన భేటీకి న్యాయ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి, వాణిజ్య శాఖకు చెందిన కార్యదర్శులతోపాటు రైల్వే ఉన్నతాధికారులు రావాల్సి ఉంది.
ఈ మేరకు వారికి ఈనెల 6నే సమాచారం ఇచ్చారు. అయితే భేటీకి వారెవరూ హాజరుకాలేదు. వీరిలో ఒక కార్యదర్శి విదేశాల్లో ఉండగా మరికొందరు వేరే సమావే శాలు ఉండడంతో సమావేశానికి హాజరు కాలేదని తెలిసింది. దీనిపై కమిటీ సభ్యుడు, ఎన్సీపీ అధినేత శరద్ యాదవ్ సమావేశంలో మండిపడినట్టు తెలిసింది. ‘ఈ ప్రభుత్వం పార్లమెంట్‌కే కాదు.. పార్లమెంటరీ కమిటీకి కూడా ముఖం చూపించలేకపోతోందేమో!’ అని కమిటీలో విపక్ష పార్టీకి చెందిన సభ్యుడొకరు దుయ్యబట్టారు. ఉన్నతాధికారులు హాజరుకాకపోవడంపై కమిటీలోని అధికార బీజేపీ సభ్యులు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.
‘భూ’బిల్లుపై వివరణివ్వండి: సుప్రీం
భూసేకరణ ఆర్డినెన్స్ గడువు ముగియడంతో దాన్ని మరోసారి తీసుకురావడాన్ని సవాలు చేస్తూ రైతు సంఘాలు దాఖలు చేసిన పిల్‌పై సుప్రీం కోర్టు గురువారం కేంద్రాన్ని వివరణ కోరింది.