Railway transport facility
-
‘గ్రీన్హౌస్’కు ప్రోత్సాహం
ఖమ్మం వ్యవసాయం: వాతావరణ పరిస్థితులను నియంత్రించి నాణ్యమైన, అధిక దిగుబడులను ఇచ్చే ఆధునిక గ్రీన్హౌస్ విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, పూణే, నాగపూర్ వంటి నగరాలు, పట్టణాల పరిసర ప్రాంతాల్లో గ్రీన్హౌస్లలో ఉద్యానపంటలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ ఆధునిక విధానాన్ని రవాణా సౌకర్యం ఉన్న ప్రాంతాలన్నింటికీ విస్తరింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి జిల్లాలోని నేలలూ అనువైనవిగా ఉద్యానశాఖ గుర్తించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దగ్గరలో ఉండటం, రేల్వే రవాణా సౌకర్యం ఉండటం, ఖమ్మంతో పాటు విజయవాడ, వరంగల్ వంటి నగరాలు సమీపంలో ఉండటంతో గ్రీన్హౌస్ విధానానికి మన జిల్లా అనుకూలమని గుర్తించారు. కూరగాయలు, పూల సాగుకు ఈ విధానం అనుకూలంగా ఉంటుంది. గ్రీన్హౌస్లకు రాయితీలు, వాటి వల్ల రైతులకు ఉపయోగాల గురించి ఉద్యానశాఖ ఉపసంచాలకులు కె.సూర్యనారాయణ -83744 49066 వివరించారు. గ్రీన్‌హౌస్‌లతో ఉపయోగాలు పూలసాగు దిగుబడి 10-12 రెట్లు అధికంగా (ఆరుబయట సాగుతో పోలిస్తే) ఉంటుంది. జెర్బెరా, కార్నేషన్స్, గులాబి వంటి పంటలకు గీన్హౌస్లు ఎంతో అనువైనవి. సంవత్సరం పొడవునా పూలు, కూరగాయల వంటివి సాగు చేయవచ్చు. వివిధ రకాల శిలీంద్రాలు, కీటకాల నుండి పంటలకు రక్షణ ఉంటుంది. ఎరువులు, పురుగు మందులను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. నీటి వినియోగం తక్కువగా ఉండటమేగాక, డ్రిప్, ఫాగర్స్ ద్వారా నీటి యాజమాన్యాన్ని చేపట్టవచ్చు. గ్రీన్‌హౌస్‌ల ద్వారా ఉద్యాన సాగు లాభదాయకం. ఈ విధానంలో ప్రభుత్వం గ్రీన్‌హౌస్‌ల ఏర్పాటుకు చేయూతనిస్తుంది ఒక రైతుకు సుమారు 4000 చ.మీ వరకు రాయితీ ఇస్తారు. పూల పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులు నీరు, భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి. రైతులు దరఖాస్తు ఫారం, పట్టాదారు పాసుపుస్తకం నకలు, రేషన్కార్డునకలు, బ్యాంక్ ఖాతా నకలు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో వివరాలతో అందుబాటులోని ఉద్యాన అధికారిని సంప్రదించాలి. గ్రీన్‌హౌస్‌ల ద్వారా పూలసాగుకు ఎంపికైన రైతులకు వారం రోజుల పాటు పూర్తి శిక్షణ ఇస్తారు. గ్రీన్‌హౌస్‌లు నిర్మించే ప్రతి దశలోనూ ఫొటోలు తీసుకొని ప్రభుత్వానికి సమర్పించాలి. రైతుకు రావల్సిన రాయితీ మొత్తాన్ని గ్రీన్హౌస్ నిర్మించిన తరువాత వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయాలి. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం 10,000 చ.మీ -
తెలంగాణకు ‘మోడీ రైలు’ వచ్చేనా?
* రేపే రైల్వే బడ్జెట్.. ఎన్నో ఆశలతో ఎదురుచూపు * ఇప్పటికే భారీ సంఖ్యలో ప్రాజెక్టులు పెండింగ్ సాక్షి, హైదరాబాద్: రైల్వే రవాణా సౌకర్యం విషయంలో బాగా వెనుకబడిన తెలంగాణకు.. ఈ సారి బడ్జెట్లోనైనా తగిన ప్రాధాన్యం లభిస్తుందా? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రైల్వే ప్రాజెక్టుల విషయంలో జరిగిన అన్యాయం ఇంకా కొనసాగుతుందా? ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధికి కీలకమైన రైల్వే రవాణా సదుపాయం సమకూరుతుందా? కొత్త ప్రాజెక్టులు మంజూరవుతాయా? కనీసం అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టులకైనా మోక్షం లభిస్తుందా?... ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ప్రజాప్రతినిధులను తొలిచేస్తున్న ప్రశ్నలివి. రైల్వే రవాణా వసతిలో బాగా వెనుకబడిన తెలంగాణ.. మోడీ ప్రభుత్వం కేటాయింపులపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. తెలంగాణ ఆవిర్భావం కోసం సహకరించిన బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక తొలి రైల్వే బడ్జెట్‌ను మంగళవారం ప్రవేశపెట్టబోతోంది. మరోవైపు రైల్వేబడ్జెట్‌లో కొత్త ప్రాజెక్టులపై పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని రైల్వే మంత్రి సదానందగౌడ ఇప్పటికే సంకేతాలిచ్చిన నేపథ్యంలో... తెలంగాణ ప్రాంతానికి, దక్షిణ మధ్య రైల్వేకు నిధులు, ప్రాజెక్టుల కేటాయింపు ఏవిధంగా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే కేంద్రాన్ని గట్టిగా కోరారు. అయితే పక్షం రోజుల క్రితమే రైల్వేమంత్రి ప్రధాని నరేంద్రమోడీతో చర్చించి రైల్వే బడ్జెట్‌ను సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీలు ప్రతిపాదించిన ప్రాజెక్టుల్లో చాలావాటిని ఆయన పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్ తీవ్రంగా ఒత్తిడి చేసిన పెద్దపల్లి-సిద్ధిపేట-మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణం, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ప్రతిపాదించిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట జంక్షన్‌కు డివిజన్ హోదా కల్పించటం లాంటి కీలక ప్రతిపాదనల విషయంలో రైల్వేమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నారనేది బడ్జెట్లో తేలనుంది. ఆదాయం ఇస్తున్నా నిధులు అంతంతే.. కొంతకాలంగా రైల్వేకు దక్షిణ మధ్య రైల్వే భారీగా ఆదాయం సాధించిపెడుతోంది. కానీ ఈ ప్రాంతానికి ప్రాజెక్టులు మాత్రం దక్కడం లేదు. గత 13 ఏళ్ల కాలంలో ఇక్కడ కేవలం 550 కిలోమీటర్ల మేర మాత్రమే డబ్లింగ్ పనులు జరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొత్త రైళ్ల ఊసే పట్టదు.. హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-చెన్నై, సికింద్రాబాద్-బెంగళూరు, సికింద్రాబాద్-వాస్కోడిగామా (గోవా), హైదరాబాద్-నాందేడ్, హైదరాబాద్- ఢిల్లీ, హైదరాబాద్-షిర్డీ లాంటి ముఖ్యమైన మార్గాల్లో కొత్త రైళ్లు కావాలని గత బడ్జెట్ సమయంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రతిపాదించారు. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని అసలు పట్టించుకోనేలేదు. ఇచ్చేదే కొంత.. అందులోనూ కోత.. గత బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించిన నిధులు రూ. 4,164 కోట్లు. ఇందులో ప్రణాళిక పద్దు కింద అభివృద్ధి పనులకు కేటాయించింది రూ. 2,175 కోట్లే. అంతకుముందు బడ్జెట్ కంటే ఇవి కేవలం రూ. 315 కోట్లు మాత్రమే ఎక్కువ. అయితే.. ఇందులోనూ నిధులు లేవంటూ దాదాపు రూ. వేయికోట్లకుపైగా కోత పెట్టారు. అంతమేర కాంట్రాక్టర్లకు బకాయిలు పేరుకుపోయాయి. పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన ప్రాజెక్టులు.. * కాజీపేటలో వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నట్టు ఐదేళ్ల కింద ప్రకటించారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని సేకరించి దాదాపు ఏడాదిన్నర కింద రైల్వేకు అప్పగించింది. అయినా ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదు. * కాజీపేట-విజయవాడ మార్గంలో మూడో లైన్ పనులకు 2012 బడ్జెట్లో చోటు దక్కింది. రూ. 1,054 కోట్లతో జరగాల్సిన 200 కిలోమీటర్ల పని పెండింగ్‌లో ఉంది. * పెద్దపల్లి-నిజామాబాద్: 20 ఏళ్ల కింద మంజూరైన ప్రాజెక్టులో రూ. 925 కోట్ల వ్యయంతో 178 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ నిర్మాణం చేపట్టగా.. ఇంకా 30 కి.మీ పని మిగిలే ఉంది. * గుల్బర్గా-బీదర్: 107 కిలోమీటర్ల మార్గంలో కొంతే పూర్తయింది. నిధులు లేక 50 కిలోమీటర్ల పని నిలిచిపోయింది. * మునీరాబాద్-మహబూబ్‌నగర్: 247 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులను భరిస్తోంది. అయినా పనులు మాత్రం పూర్తికావటం లేదు. * మహబూబ్‌నగర్-గుత్తి, సికింద్రాబాద్-ముద్ఖేడ్-ఆదిలాబాద్, మంచిర్యాల-మందమర్రి డబ్లింగ్ పనులదీ అదే గతి. * గత బడ్జెట్లో సికింద్రాబాద్‌లో రైల్వే ఫైనాన్స్ విభాగం అధికారుల శిక్షణ కేంద్రం (సెంట్రలైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఫైనాన్స్ ఆఫీసర్స్), కాజీపేటలో ఉద్యోగుల సామర్థ్యం పెంపు శిక్షణ కేంద్రాలను మంజూరు చేశారు. కానీ పనుల ఊసేలేదు. సికింద్రాబాద్ స్టేషన్‌ను పట్టించుకోరేం? రోజుకు లక్షన్నర మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనను పూర్తిగా పక్కనపెట్టేశారు. ప్రతి బడ్జెట్లో దీనిని ప్రస్తావిస్తున్నా నిధులు మాత్రం కేటాయించడం లేదు. ఉగ్రవాదుల నుంచి ప్రమాదమున్న నేపథ్యంలోనూ ఇక్కడ కనీస భద్రతా చర్యలు లేవు. సీసీ కెమెరాలకూ కొరతే. చివరకు ప్రయాణికులకు సరిపడా మూత్రశాలలు, మంచినీటి వసతి కూడా సరిగా లేదు. పది ప్లాట్‌ఫామ్‌లు మాత్రమే ఉండటంతో అవి సరిపోక నగర శివారులో ఒక్కో రైలును అరగంట నుంచి గంటపాటు నిలిపివేయాల్సిన దుస్థితి నెలకొంది.