చికిత్స పొందుతూ పాత నే రస్తుడి మృతి
పోలీసులు కొట్టడంతోనే మృతిచెందాడంటున్న కుటుంబీకులు
డీసీపీతోపాటు మరో నలుగురిపై కేసు నమోదు
చాంద్రాయణగుట్ట,న్యూస్‌లైన్: కేసు విచారణలో భాగంగా పోలీసులు తీవ్రంగా గాయపర్చారన్న ఆరోపణల కేసులో బాధితుడైన పాత నేరస్తుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన రెయిన్‌బజార్ పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. కాగా ఈ ఘటనపై అప్పటి సౌత్‌జోన్ డీసీపీ తరుణ్‌జోషితోపాటు మరో నలుగురిపై రెయిన్‌బజార్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది.
పోలీసులు, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...యాకుత్‌పురా బాగేజహరాలోని జామామసీదు సమీపంలో నివాసముండే ఖుర్షీద్‌బేగం,అబ్దుల్ రహమాన్‌లకు ఏడుగురు సంతానం. వీరిలో ఒకరైన మహ్మద్ అబ్దుల్‌ఖాదర్(23) అలియాస్ ఆదిల్ ఆటోక్యాడ్ కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటున్నాడు. 2010లో రెయిన్‌బజార్‌లో జరిగిన ఓ హత్యకేసులో అబ్దుల్ ఖాదర్ 6వ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసు విచారణలో భాగంగా గతేడాది సెప్టెంబర్‌లో రెయిన్‌బజార్ ఎస్సై రమేష్ అబ్దుల్‌ఖాదర్‌ను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. అక్కడ్నుంచి దక్షిణ మండలం డీసీపీ కార్యాలయానికి తరలించారు.
అప్పట్లో డీసీపీగా పనిచేసిన ప్రస్తుత నిజామాబాద్ జిల్లా ఎస్పీ తరుణ్‌జోషి కూడా అబ్దుల్‌ఖాదర్‌ను విచారించారు. కాగా విచారణ అనంతరం ఇంటికి చేరుకున్న అబ్దుల్ ఖాదర్ తీవ్రనొప్పితో బాధపడి..పోలీసులు విచారణ పేరుతో తీవ్రంగా కొట్టారని కుటుంబసభ్యులకు వివరించాడు. దీంతో కుటుంబసభ్యులు అప్పట్నుంచి ఆస్పత్రి చుట్టూ తిరుగుతూ అబ్దుల్‌ఖాదర్‌కు చికిత్స నిర్వహించారు. రోజురోజుకు నొప్పి తీవ్రం కావడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం ఈ ఏడాది జనవరి 16న అపోలోకు తరలించారు. శుక్రవారం రాత్రి పరిస్థితి విషమించి అబ్దుల్‌ఖాదర్ మృతిచెందాడు. కాగా మృతుడు అవివాహితుడు.
అప్పటి డీసీపీతోపాటు నలుగురిపై కేసు నమోదు : 2013 సెప్టెంబర్‌లో అబ్దుల్ ఖాదర్‌ను కొట్టారని మృతుడి తల్లి ఖుర్షీద్‌బేగం ఫిర్యాదు మేరకు రెయిన్‌బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి డీసీపీ తరుణ్‌జోషి, రెయిన్‌బజార్ ఎస్సై రమేష్‌తోపాటు మరో ముగ్గురు సివిలియర్స్ ఆసీఫ్, ఇస్మాయిల్, ఇబ్రహీంలపై కేసు నమోదైంది. మహ్మద్ అబ్దుల్ ఖాదర్ కుటుంబానికి ఎవరూ అండగా నిలవకపోవడంతో పీయూసీఎల్ అధ్యక్షురాలు జయవింధ్యాల మృతుడి తల్లిని ప్రోత్సహించింది. జయవింధ్యాలతో పాటు సంఘం నాయకులు మహ్మద్ ఇక్బాల్‌లు వారికి అండగా నిలిచి పోలీసులకు ఫిర్యాదు చేయించగలిగారు.