నిరాశపరచిన ‘నైరుతి’
– 24 శాతం లోటు వర్షపాతం
– ఆగస్టు, సెప్టెంబర్‌లో తీవ్ర వర్షాభావం
– నిట్టనిలువునా ఎండిన ఖరీఫ్ పంటలు
అనంతపురం అగ్రికల్చర్ : నైరుతీ రుతుపవనాలు నిరాశ పరచడంతో ఈ ఏడాది కూడా ‘అనంత’ వ్యవసాయం అతలాకుతలమైంది. తొలకరి వర్షాలు మురిపించడంతో ఖరీఫ్‌పై ఆశలు పెంచుకున్న రైతులు అప్పోసప్పో చేసి పంటల సాగుకు సాహసం చేశారు. 6.09 లక్షల హెక్టార్ల వేరుశనగ, 1.50 లక్షల హెక్టార్ల విస్తీర్ణంతో ఇతరత్రా పంటలు సాగులోకి వచ్చాయి. జూన్, జూలైలో విత్తు పూర్తయిన తర్వాత ఆగస్టులో వరుణుడు మొహం చాటేయడంతో కీలక దశలో ఉన్న వేరుశనగ, ఇతర పంటలు ఎండిపోయాయి. చాలా ఆలస్యంగా మేల్కొన్న పాలకులు, అధికారులు రక్షకతడి పేరుతో హడావుడి చేసినా ఫలితం లేకుండా పోయింది. రూ.వందల కోట్ల పెట్టుబడులు, రూ.వేల కోట్ల పంట దిగుబడులు దక్కకుండా పోయాయి.
ఆగస్టులో తారుమారైంది...
ఖరీఫ్ సీజన్ (జూన్–సెప్టెంబర్)లో 338.4 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి వుండగా 257.3 మి.మీ వర్షం కురిసింది. అంటే 23.9 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మొదటి రెండు నెలలు పరిస్థితి అదుపులోనే ఉన్నా ఆగస్టు రెండో వారం నుంచి తారుమారైంది. ఆగస్టు 10వ తేదీకి కాస్త అటుఇటుగా మంచి వర్షం నమోదై ఉంటే పంటలకు ఇబ్బందిగా ఉండేది కాదు. కానీ... ఆగస్టు నెలంతా వాన చినుకు పడకపోవడంతో వేరుశనగ నిలువునా ఎండిపోయింది. చాలా మండలాల్లో నెలల కొద్దీ వర్షం పడలేదు. అగళి, రొళ్ల లాంటి మండలాల్లో ఆగస్టులో కనీసం ఒక మి.మీ కూడా నమోదు కాలేదంటే వర్షాభావ తీవ్రత అర్థమవుతుంది. ఆగస్టులో 88.7 మి.మీ గాను 18.1 మి.మీ వర్షం పడింది. సెప్టెంబర్‌లో 118.4 మి.మీ గాను 41.9 మి.మీ వర్షం కురిసింది. ఇటీవల వారం పది రోజులుగా తేలికపాటి వర్షాలు పడుతుండటంతో ఈ మాత్రం వర్షపాతం నమోదైంది.
మూడు మండలాల్లోనే సాధారణం
జిల్లాలో పెద్దవడుగూరు, కూడేరు, ఆత్మకూరు మండలాలు మినహా తక్కిన 60 మండలాల్లో సాధారణం అంతకన్నా తక్కువ వర్షపాతం నమోదుకావడం విశేషం. అందులోనూ గుమ్మగట్ట మండలంలో 71 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. బొమ్మనహాల్, పెద్దపప్పూరు, పామిడి, గార్లదిన్నె, రాప్తాడు, కనగానపల్లి, రామగిరి, ఉరవకొండ, బెళుగుప్ప, రాయదుర్గం, బ్రహ్మసముద్రం, నార్పల, ఎన్పీ కుంట, తనకల్లు, నల్లచెరువు, గాండ్లపెంట, కదిరి, ఆమడగూరు, ఓడీ చెరువు, పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు, పెనుకొండ, రొద్దం, చిలమత్తూరు, హిందూపురం, పరిగి, అమరాపురం, రొళ్ల తదితర మండలాల్లో సాధారణం కన్నా చాలా తక్కువగా వర్షపాతం నమోదు కావడంతో పంటల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇప్పటికే వేరుశనగ పంట తొలగింపు ప్రారంభం కాగా దశరా తర్వాత ఊపందుకోనుంది.
ఖరీఫ్ వర్షపాతం ఇలా...
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
నెల సాధారణం కురిసిన వర్షపాతం వ్యత్యాసం
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
జూన్ 63.9 94.5 47.9 శాతం ఎక్కువ
జూలై 67.4 102.8 52.5 శాతం ఎక్కువ
ఆగస్టు 88.7 18.1 79.5 శాతం తక్కువ
సెప్టెంబర్ 118.4 41.9 64.6 శాతం తక్కువ
––––––––––––––––––––––––––––––––––––––––––––––––
మొత్తం 338.4 257.3 23.9 శాతం తక్కువ
––––––––––––––––––––––––––––––––––––––