సోమశిలకు వరద ప్రవాహం
సోమశిల: రాయలసీమలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సోమశిలకు శనివారం వరద ప్రవాహం రావచ్చని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం రాత్రి పెన్నానది ఎగువ ప్రాంతాలైన వైఎస్సార్ జిల్లా చెన్నూరు గేజీ వద్ద 1000 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం కొనసాగుతోంది. కడపతో పాటు సిద్ధవటం, తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పెన్నానది ఉపనది అయిన సగిలేరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడుతుండడంతో జలాశయానికి శనివారం ఉదయం వరద ప్రవాహం చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. రెండో పంటకు ఇంకా సెప్టెంబరు వరకు నీటిని విడుదల చేయాల్సి ఉన్నా సోమశిల జలాశయంలో నీటి నిల్వ 10.968 టీఎంసీలకు చేరుకుంది. జలాశయం అడుగంటుతున్న తరుణంలో వరద ప్రవాహం కొనసాగనుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.