Raj Bhavan staff
-
‘కోడ్’ ఉల్లంఘనులపై చర్యలు తీసుకోండి
సీఈవో భన్వర్‌లాల్‌కు బీజేపీ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: శాసన మండలి ఉపాధ్యాయ కోటా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి రాజ్‌భవన్ సిబ్బంది గృహ సముదాయాన్ని ప్రారంభించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) భన్వర్‌లాల్‌కు బీజేపీ బృందం విజ్ఞప్తి చేసింది. సోమవారం సచివాలయంలో సీఈవోను ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, పార్టీనాయకులు ఎస్ మల్లారెడ్డి, సాంబమూర్తి, కాసం వెంకటేశ్వర్లు, ప్రకాశ్‌రెడ్డి, దాసరి మల్లేశం కలసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ నెల 9న పోలింగ్ ఉన్న విషయం తెలిసినా రాజ్‌భవన్ సిబ్బంది గృహ సముదాయాన్ని ఆదివారం గవర్నర్, సీఎం, మంత్రులు కలసి ప్రారంభించారని వెల్లడించారు. అంతకు ముందు బీజేపీ కార్యాలయంలో చింతల రామచంద్రారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ గవర్నర్ వ్యవహారంపై రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
పొంగిపోను.. కుంగిపోను..: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: ‘‘నేను సన్మానాన్ని, అవమానాన్ని ఒకే విధంగా స్వీకరిస్తా. సన్మానించారని పొంగిపోను.. అవమానించారని కుంగిపోను. స్థిరంగా ఉంటా’’ అని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. రాజ్‌భవన్ సిబ్బంది గృహ సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన గైర్హాజరైన విషయం తెలిసిందే. దీనిపై విలేకర్లు ప్రశ్నించగా పైవిధంగా బదులిచ్చారు. ఆహ్వానం అందిందా.. లేదా.. అనే అంశంపై తాను స్పందించనన్నారు. సోమవారం ఈఎస్ఐసీ కార్యాలయంలో బండారు దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. పార్ల మెంటులో మహిళా బిల్లు ఆమోదం పొందితే మహిళలకు మరింత లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. దీనికి అన్ని పార్టీలూ మద్దతివ్వాలని కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నగరంలో మహిళా కార్మికు లు, సంబంధిత అంశాలపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఈ సంద ర్భంగా మంత్రి తెలిపారు. -
రాజ్‌భవన్ సిబ్బందికి నూతన గృహాలు
సముదాయాన్ని ప్రారంభించిన గవర్నర్, ముఖ్యమంత్రి సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్ సిబ్బంది నూతన గృహాల సముదాయాన్ని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్, ముఖ్యమంత్రి గృహ సముదాయ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. రాజ్‌భవన్ సిబ్బంది గృహ సముదాయానికి గతేడాది ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు. అత్యాధునిక హంగులతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులను గవర్నర్ నరసింహన్ స్వయంగా పర్యవేక్షించి రికార్డుస్థాయిలో 13 నెలల్లోనే గృహ సముదాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్, విశిష్ట వసతులతో, అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో తలపెట్టిన ఈ నిర్మాణం 2.70 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 152 ఫ్లాట్లు ఉన్నాయి. ఇందులో ఏ, బీ, సీ క్వార్టర్లలో నివాస సముదాయం, పాఠశాల భవనం, కమ్యూనిటీ హాలును నిర్మించారు. ఈ భవనాలకు పూర్తిగా సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో గార్డెనింగ్‌కు హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు నీటిని సరఫరా చేయనుంది. -
రాజ్‌భవన్ సిబ్బంది క్వార్టర్స్ ప్రారంభం
హైదరాబాద్ : రాజ్‌భవన్ ఆవరణలో కొత్తగా నిర్మించిన స్టాఫ్ క్వార్టర్లను గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. గవర్నర్ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మేయర్ బొంతు రామ్మెహన్ తదితరులు పాల్గొన్నారు. రూ. 98 కోట్లతో రాజ్‌భవన్ స్టాఫ్క్వార్టర్లు, ప్రభుత్వ పాఠశాల భవనం, పోలీస్ బ్యారెక్స్, సమావేశ మందిరం వంటి వసతుల నిర్మాణాలు చేపట్టారు.