Raja Ravi Varmas paintings
-
వర్ణచిత్రాల బ్రహ్మ: రాజా రవివర్మ (1848–1906)
చిత్రకళ పట్ల ఓ ఆకర్షణను సృష్టించడమే కాక.. వర్గం, భాష, ప్రాంత భేదాలు లేకుండా సామాన్యుడికి సైతం చేరేలా చేసిన ఘనత రవివర్మదే! చిత్రకళను విలాసవంతం చేసిన తొలి కళాకారుడు కూడా ఆయనే. ఆయన గీసిన వర్ణచిత్రాలను అటు బ్రిటిష్‌వారు, ఇటు రాజాస్థానాలవారు ఆత్రంగా అందుకొనేవారు. ఆయనను ఒకరు తిరువాన్కూర్ మహారాజాకు పరిచయం చేశారు. ఆస్థాన చిత్రకారుడి ద్వారా రవివర్మకు చిత్రకళలో మెళకువలు నేర్పాలని మహారాజు భావించారు. అయితే ఆ ఆస్థాన విద్వాంసుడు కానీ, ఆస్థానంలోని డచ్ కళాకారుడు థియోడర్ జెన్సెన్కానీ రవివర్మకు నేర్పడానికి ఇష్టపడలేదు. తైలవర్ణాలతో వారు బొమ్మలు గీయడాన్ని జాగ్రత్తగా గమనించడం ద్వారానే రవివర్మ చిత్రకళ నేర్చుకున్నారు. మద్రాసు గవర్నర్ చిత్రపటాన్ని గీసినప్పుడు రవవర్మ ప్రతిభ తొలిసారి వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత ఆయన చిత్రించిన ‘నాయర్ ఉమన్ విత్ జాస్మిన్ ఫ్లవర్స్ ఇన్ హర్ హెయిర్’ వర్ణచిత్రం మద్రాసు చిత్రకళా ప్రదర్శనలో ఆయనకు స్వర్ణపతకం సంపాదించి పెట్టింది. అలాగే 1887లో వియన్నా చిత్రకళా పోటీలోనూ పతకం వరించింది. తైల మాధ్యమాన్ని ఉపయోగించడం ద్వారా ఆయన తన మోడల్ స్త్రీలను అందంగా చిత్రించగలిగారు. ఆయన గీసిన ‘మలబార్ బ్యూటీ’ చిత్రం భారతదేశ ప్రతీకగా నిలిచింది. చదవండి: (స్వతంత్ర భారతి: ప్రపంచ కప్ విజయం (1983/2022)) అయితే, రవివర్మకు విస్తృతంగా పేరు తెచ్చిపెట్టినవి ఆయన గీసిన చారిత్రక వర్ణ చిత్రాలు. రామాయణం, మహాభారతం, తదితర పురాణ గాథలకు ఆయన వేసిన చిత్రాలు తమదైన ముద్ర సంపాదించుకున్నాయి. రవివర్మ చిత్రాలకు లభించిన ప్రాచుర్యం వల్ల బరోడా, మైసూర్, త్రివేండ్రం లాంటి రాజాస్థానాలు ఆయనతో భారీస్థాయిలో పౌరాణిక వర్ణ చిత్రాలను గీయించాయి. ఆయన ఒక పక్క పాశ్చాత్య విద్యా సంప్రదాయాన్ని వినియోగిస్తూనే, మరోపక్క తంజావూరు వర్ణచిత్రాల ప్రభావాన్ని మిళితం చేసి తనదైన శైలిని ఆ చిత్రాల్లో చూపారు. రవి వర్మ 1892లో బొంబాయిలో ఒక లిథోగ్రాఫిక్ ప్రెస్ స్థాపించారు. ప్లేగు వ్యాధి ప్రబలడంతో ఆయన బొంబాయి నుంచి 1899 లో కర్లాకు ప్రెస్‌ను మార్చారు. చివరకు జర్మనీ దేశస్థుల్లో ఒకరికి దానిని అమ్మేశారు. అప్పటికే ప్రతి ఇంటా రవివర్మ చిత్రాలు చేరాయి. – యశోధరా దాల్మియా, కళాఖండాల సంరక్షకులు -
రవి వర్మ పెయింటిగ్స్: మన అందాల తారల అద్భుతం
-
'రాజా రవి వర్మ'..వాళ్లను ఊహించుకొని పెయింటింగ్స్ వేసేవారట
రాజా రవి వర్మ.. భారతీయ చిత్రకారుడిగా ఆయన పేరు నేటికీ సజీవమే.1848 ఏప్రిల్ 29న కేరళలోని కిలమానూరులో జన్మించిన రవి వర్మ ఏడేళ్ల వయసు నుంచే చిత్రాలు గీయడం ప్రారంభించారు. ప్రతీ రోజూ ఆయన చూసిన దృశ్యాలనే గోడలపై అందమైన చిత్రాలుగా రూపొందించేవారు. రకరకాల పువ్వులు, చెట్ల ఆకులతో తన చిత్రాలకు రంగులద్దేవారు. రవి వర్మ ప్రతిభను మెచ్చిన అప్పటి ట్రావెన్కోర్ మహారాజా ఆయన ఆస్థానంలోకి సగర్వంగా ఆహ్వానించారు. అక్కడే ఆస్థాన చిత్రకారుడయిన శ్రీ రామస్వామి నాయుడు వద్ద శిష్యరికం చేసిన రాజా రవి వర్మ..బ్రిటీషు దేశస్థుడయిన థియోడార్ జెన్సన్ వద్ద ఆయల్ పెయింటింగ్ ఎలా గీయాలో నేర్చుకున్నాడు. వాటర్ కలర్లకు బదులుగా ఆయిల్ పెయింటింగ్‌ని ఉపయోగించిన తొలి భారతీయ చిత్రకారుడిగా రికార్డులకెక్కారు. రాజా రవి వర్మ ఆయన 18వ ఏట రాజ కుటుంబానికి చెందిన భాగీరథీబాయిని వివాహం చేసుకున్నారు. వీరికి సంతానం ముగ్గురు పిల్లలు. అతి తక్కువ కాలంలోనే ప్రఖ్యాత చిత్రకారుడిగా రాజా రవి వర్మ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. దేశంలోని నలమూలల నుంచి పెయింటింగ్స్ గీయాలని రోజూ కొన్ని వందల అభ్యర్థలను వచ్చేవి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఆయన పెయింటింగ్స్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నా, ఆయన గీసే చిత్రాలు కేవలం దర్శనాత్మకంగా, ఛాందసంగా చిత్రాలు ఉంటాయన్న విమర్శలనూ ఎదుర్కోక తప్పలేదు. భారతీయ సాంప్రదాయ చిత్రకళకు పాశ్చాత్యాన్ని జోడించి పెయింటింగ్స్ వేయడంలో రాజా రవి వర్మ సిద్దహస్తులు. అందుకే ఆయన్ను 'ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఇండియన్ ఆర్ట్'గా పిలుస్తారు. రామాయణ, మహాభారతములోని ఘాట్టాలను అందంగా చిత్రీకరంచే రాజా రవి వర్మ..నలదమయంతుల, శకుంతలా దుష్యంతుల చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. 1873 లో వియన్నాలో జరిగిన ఆర్ట్ ఎగ్జిబిషన్లో మొదటి బహుమతిని గెలుచుకొని ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆయన పెయింటింగ్స్‌కు విదేశీయులు కూడా ముగ్ధులయ్యేవారు. హిందూ దేవతా స్త్రీల చిత్రాలను దక్షిణ భారతయ స్త్రీలలాగా ఊహించి ఎన్నో పెయింటింగ్స్ వేసేవారు. దక్షిణ భారత స్త్రీలు ఎంతో అందంగా ఉంటారని బాగా విశ్వసించేవారు. దేశంలోనే మొదటిసారిగా పెయింటింగ్స్ కోసం ముంబైలో అత్యాదునిక ప్రెస్‌ను ప్రారంభించిన రాజా రవి వర్మ ఇందుకోసం దేశం నలుమూలల నుంచి చిత్రకారులను పిలిపించుకున్నారు. ఇక 58 ఏళ్ల వయసులో మధుమేహం కారణంగా 1906లో కన్నుమూశారు. రాజా రవి వర్మ చనిపోయేనాటికి దాదాపు 7వేల పెయింటింగ్స్‌ను గీసినట్లు సమాచారం. రవి వర్మ మరణానంతరం ఆయన పెయింటింగ్స్‌ను తిరువనంతపురములోని చిత్రా ఆర్ట్ గ్యాలరీలో భద్రపరిచారు. -
చేనేత ఫ్యాషన్‌లో విజేత!
ఫ్యాషన్ ప్రపంచంలో అత్యుత్తమ వేదికలైన న్యూయార్క్, ప్యారిస్, లండన్, వాంకోవర్ నగరాల్లో నిర్వహించే అంతర్జాతీయ స్థాయి ఫ్యాషన్ వీక్‌లో డిజైన్లను ప్రదర్శించే అవకాశం రావడం డిజైనర్ల స్వప్నం. చిన్న వయసులోనే ఆ విశ్వ వేదికలపై అనేకమార్లు తను ప్రేమించిన చేనేత అద్భుతాలను ప్రదర్శిస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్ శ్రవణ్ కుమార్ రామస్వామి. హైదరాబాద్‌కు చెందిన ఈ సృజనశీలి. సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే మన చేనేతలతో సంప్రదాయ దుస్తులను రూపుకట్టడంలో మేటిగా నిలుస్తున్నారు. నగరంలో ఆలయం పేరుతో సొసైటీ ఏర్పాటు చేసి కంచి, బెనారస్, మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, నారాయణపేట.. మొదలైన చేనేతకారులకు ఒక వేదికను ఏర్పాటు చేశారు. శ్రవణ్ కుమార్ ఆవిష్కరించిన సరికొత్త అందాలు ఇటీవలే వాంకోవర్ ఫ్యాషన్ వీక్‌లో సందడి చేశాయి. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో కనువిందు చేయబోతున్నాయి. ఈ సందర్భంగా శ్రవణ్‌కుమార్ తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 18 వరకు (కెనడా) వాంకోవర్ ఫ్యాషన్ వీక్ జరిగింది. అందులో నేను రూపొందించిన ప్రత్యేక దుస్తుల ప్రదర్శన జరిగింది. ఎంతో మంది మన్ననలు పొందాయి. రాజా రవివర్మ పెయింటింగ్స్ నుంచి స్ఫూర్తి పొంది ఆ దుస్తులను డిజైన్ చేశాను. వీనుల విందైన సంగీతం మదిని ఎంత రంజింపజేస్తుందో, చూపరులకు అంతగా నా డిజైన్లు కనువిందు చేయాలన్నదే నా ప్రయత్నం. చేనేతకే పెద్ద పీట.. హాలీవుడ్ ప్రపంచానికి రాజధాని అయిన లాస్ ఎంజిల్స్‌లో న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ జరగనుంది. అందులో మన నారాయణ పేట అందాలు, గుజరాత్‌కి చెందిన్ అబ్రక్ చేనేత వస్త్రాలను కూడా ఈ షో లో ప్రదర్శించబోతున్నాను. నారాయణపేట అందాలు ఇప్పటికే లండన్, దుబాయ్ ఫ్యాషన్ వీక్‌లలో ప్రదర్శించడంతో అంతర్జాతీయంగా ఈ చేనేతకు మంచి పేరు వచ్చింది. ట్రెండ్‌ను ఫాలో అయ్యే ఫ్యాషన్ ప్రపంచం చేనేత వస్త్రాలను ఎప్పటికీ ముందువరసలో నిలుపుతుంది. చేనేతకారుల చేతుల్లో ఊపిరిపోసుకున్న ఖాదీ, పోచంపల్లి, గద్వాల్, కలంకారి, బెనారస్... వంటి ఫ్యాబ్రిక్స్ అంటే నాకు ప్రాణం. చేనేతకారులను సంప్రదించి నాకు నచ్చిన విధంగా డిజైన్లు చెప్పి మరీ వస్త్రాలను నే యిస్తాను. ఇందుకు దేశంలోని చేనేతకారులను చాలామందిని సంప్రదించాను. నేను డిజైన్ చేయించే ప్రతి చీరకూ చేనేతకారుడు ఆర్గానిక్ ఫ్యాబ్రిక్‌ను ఉపయోగించేలా జాగ్రత్తలు తీసుకుంటాను. సంప్రదాయ దుస్తులదే హవా! చేనేతలతో సంప్రదాయ దుస్తులను తయారు చే యడం నా ప్రత్యేకత అని చెప్పుకోవడానికి ఎప్పుడూ గర్వపడతాను. భారతీయతను చాటే లంగా ఓణీలు, షేర్యానీ, ధోతి, బ్లౌజ్‌లు, చీరలు.. ఇలా సంప్రదాయ తరహా దుస్తుల డిజైన్లు ఎంత మందిలో ఉన్నా చూపు తిప్పుకునేలా చేస్తాయి. చలికి.. ఇవి బెస్ట్... ♦ కాలానుగుణంగా దుస్తుల ఎంపిక ఉండాలంటున్న ఈ డిజైనర్ సూచనలు... ♦ చలికి సిల్క్ దుస్తులు బాగుంటాయి. వీటిలో ముఖ్యంగా బెనారస్ అందాన్ని, చలిని తట్టుకునే వెచ్చదనాన్నీ ఇస్తుంది. ♦ హై నెక్, ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్‌లు, ఎక్కువ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన దుస్తులు మేలు. ♦ ఎరుపు, మెరూన్, గోల్డ్, రాయల్ బ్లూ, పర్పుల్, ఆరెంజ్...ఇలా చలికాలానికి మంచి రంగు దుస్తులు ఆకర్షణీయంగా ఉంటాయి. ♦ మన దేశీయ చర్మతత్త్వాలకు అన్ని రంగులు సూటవుతాయి. ♦ దుస్తులు మిమ్మల్ని ధరించవు. మీరే దుస్తులను ధరించాలి. అవి సౌకర్యవంతంగా, చూడచక్కగా ఉండాలి. తారల ‘కళ’నేత... సినీ తారలు, రాజకీయ ప్రముఖులు దాదాపు అందరికీ నా డిజైన్స్ సుపరిచితమే! సినీ తారలలో నయనతార, తాప్సీ, ప్రణీత, శ్రేయ శరణ్, సమంత, దీక్షాసేథ్, సిమ్రాన్ కౌర్, అమలాపాల్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీ ఆర్... ఇలా చాలా మందికి దుస్తులు డిజైన్ చేశాను. అలాగే మురారీ, గ్రీకువీరుడు... వంటి తెలుగుదనం ఉట్టిపడే ఎన్నో సినిమాలకు డ్రెస్ డిజైనర్‌గా ఉన్నాను. సంతోషకరమైన పనిలోనే వృద్ధి... ‘నచ్చిన పనే ఎంచుకో! అందులోనే సంతోషం ఉంటుంది. ఆనందంగా చేసే పనిలోనే వృద్ధి ఉంటుంది’అని మా అమ్మ పార్వతీదేవి ఎప్పుడూ అంటుంటారు. దుస్తుల డిజైన్లు సృష్టించడం నాకు అమితంగా నచ్చిన విషయం. అందుకే ఈ రంగంలో ఎప్పుడూ కష్టమనిపించలేదు. ఒడిదొడుకులూ ఎదురుకాలేదు. మా పూర్వీకులు కర్నాటక వాసులైనా నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే! నాన్న రామస్వామి. మేం ఆరుగురు అన్నదమ్ములు, ఇద్దరు చెల్లెళ్లు. మా పెద్ద చెల్లెలు జ్యోతి కూడా 15 ఏళ్ల వయసులో నాతో పాటు ఈ రంగంలో అడుగుపెట్టింది. దాదాపు 20 ఏళ్లుగా ఇద్దరం ఈ రంగంలోనే ఉన్నాం. హైదరాబాద్‌లో అత్యంత చిన్నవయసు డిజైనర్లుగా పేరు తెచ్చుకున్నాం. ఎప్పుడూ కోరుకునేది... చేనేతకు పూర్వవైభవం తేవాలన్నదే నా ఆశయం. ‘శ్రవణ్‌కుమార్ అంటే అంకితభావంతో పనిచేస్తాడు. చెప్పిన సమయానికి దుస్తులు అందంగా రూపొందించి ఇస్తాడు. ఎంతో సౌకర్యంగా ఉంటాయి. మరెంతో రిచ్ లుక్‌తో ఉంటాయి’ అని వినియోగదారుల మనసుల్లో నిలిచిపోతే చాలు. జీవితాంతం నేను కోరుకునేవి ఇవే!’’ - నిర్మలారెడ్డి