కొంప ముంచుతున్న రాజస్థాన్ గ్రానైట్
⇒ ఆర్థిక సంక్షోభంలో గ్రానైట్ పరిశ్రమ
⇒ ముడి ఖనిజం దిగుమతికి తడిసి మోపెడు
⇒ నిర్వహణ భారంతో 50 పరిశ్రమలు మూత
⇒ అమ్ముడుపోని సరుకు.. యజమానులు అప్పులపాలు
⇒ కార్మికులు వలస బాట
తాడిపత్రి : ఒకప్పుడు గ్రానైట్ పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న తాడిపత్రిలో ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఆర్థిక సంక్షోభం కారణంగా పరిశ్రమలు నడపలేని పరిస్థితి నెలకొంది. రవాణా ఖర్చులు పెరగడంతో పాటు ముడి సరుకు ధరలకు అనుగుణంగా ఉత్పత్తి చేసిన గ్రానైట్‌కు ధర లభించకపోవడంతో పరిశ్రమలు మూసేయాల్సిన పరిస్థితి నెలకొంది. ముడి సరుకు తెప్పించుకోవడం భారంగా మారడంతో ఆరు నెలల వ్యవధిలో ఏకంగా 50కి పైగా పరిశ్రమలు మూతపడ్డాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇదే పరిస్థితి కొనసాగితే మరిన్ని పరిశ్రమలు మూతపడే పరిస్థితి దాపురించింది. 212 పరిశ్రమల యజమానులు బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జిల్లాలోనే పరిశ్రమలకు కేంద్రంగా ఉన్న తాడిపత్రి ప్రాంతంలో గ్రానైట్ గనులు, ముడి సరుకు లేకున్నా నీరు, రవాణా తదితర సౌకర్యాలు ఉండడంతో సుమారు 300 గ్రానైట్ పరిశ్రమలున్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యేగానైట్ దేశంలోని అన్ని రాష్ట్రాలకు రవాణా అవుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మంది కార్మికులకు ఉపాధి లభిస్తోంది. ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడకు వచ్చి పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు.
కొంప ముంచుతున్న రాజస్థాన్ గ్రానైట్
రాజస్థాన్ రాష్ట్రంలోని జాలురు ప్రాంతంలో కలర్ గ్రానైట్ ఇక్కడి కన్నా తక్కువ ధరకు లభిస్తోంది. ఒక అడుగు రూ.50కే లభించడం వల్ల ఇతర రాష్ట్రాలకు కూడా అక్కడి నుంచే సరఫరా అవుతోంది. దీనికి తోడు నిర్మాణ రంగంలో అత్యధిక బరువు ఉన్న గ్రానైట్‌ను కాకుండా వివిధ రకాలైన, ఆకర్షణీయమైన టైల్స్ వాడడం వల్ల గ్రానైట్‌కు డిమాండ్ తగ్గింది. దీనికి తోడు ఇక్కడ ఉత్పత్తి అయ్యే గ్రానైట్ ధరకు రాజస్థాన్ నుంచి సరఫరా అయ్యే ధరకు చాలా వ్యత్యాసం ఉండటంతో ఇక్కడ ఉత్పత్తిపై వ్యాపారులు అసక్తి చూపడం లేదు. పైగా నిర్మాణ రంగం కూడా రెండు సంవత్సరాలుగా అనుకున్న రీతిలో సాగడం లేదు. గ్రానైట్ ముడి సరకు దిగుమతి ధరలు రెట్టింపయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రానైట్ పరిశ్రమ కుదేలవుతోంది.
పరిశ్రమల్లో ఆగిపోయిన సరుకు
దాదాపు ఏడాదిగా గ్రానైట్ ఉత్పత్తులకు డిమాండ్ లేకపోవడంతో ప్రతి పరిశ్రమలో పాలిష్ చేసిన గ్రానైట్ ఉత్పత్తులు ఎగుమతి కాకుండా ఆగిపోయాయి. మొత్తం పరిశ్రమల్లో రూ.5 కోట్ల వరకు ఉత్పత్తి ఆగిపోయిందని తెలుస్తోంది. నష్టాలు రావడంతో ప్రస్తుతం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకే పరిశ్రమలను నడిపిస్తున్నారు. గతంలో 24 గంటలు పనిచేసేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీంతో చాలా పరిశ్రమలను మూసి వేశారు. సొంతంగా నడిపించుకోలేక లీజుకు ఇస్తామని కొన్నింటి వద్ద బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితిలో చాలా మంది కార్మికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వలస వెళ్లలేని వారు ఇక్కడే మరో పని చూసుకుంటున్నారు.
రాయల్టీ విధానంలో మార్పు తెస్తే ఊరట
ప్రస్తుతం ప్రభుత్వం గ్రానైట్ ముడిసరుకుపై విధిస్తున్న రాయల్టీ విధానంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్లాబ్ విధానంలో ఒక మీటర్‌కు సాధారణ గ్రానైట్ (బ్లాక్)కు రూ.1950, కలర్ గ్రానైట్‌కు రూ.1650 రాయల్టీ వసులు చేస్తున్నారు. కానీ స్లాబ్ పద్ధతిన ఇతర రాష్ట్రాల్లో యంత్రానికి రాయల్టీ వసులు చేస్తున్నారు. రాయాల్టీ విధానంలో కూడా మార్పులు తెస్తే కొంత ఊరట లభించనుంది.