బహిర్భూమికెళితే ఫొటోలు తీస్తారా?
జైపూర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మానస పుత్రిక ‘స్వచ్చ్ భారత్ అభియాన్’ పథకాన్ని అమలు చేయడంలో బాగా వెనకబడి పోయిన రాజస్థాన్‌లో పథకాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ముఖ్యమంత్రి వసుంధర రాజె నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా ఆలోచించింది. తరతరాలుగా ఇంటి వెలుపల బహిర్భూమికి వెళ్లే అలవాటున్న రాష్ట్రంలో ఆ పద్ధతికి స్వస్తి చెప్పాలంటే అలా బహిర్భూమికి వెళ్లే వాళ్ల ఫొటోలు తీయాలని, వారెవరే గుర్తించి అవమానపర్చాలని గతేడాది ఆమె ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగానే రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో మున్సిపల్ కమిషనర్ అశోక్ జైన్ ఆధ్వర్యంలో ఐదుగురు మున్సిపల్ ఉద్యోగులు శుక్రవారం ఉదయం ఆరున్నర గంటలకు బహిర్భూమికి వెళుతున్న మహిళల ఫొటోలు తీశారు. అసభ్యంగా ఇలా ఫొటోలు తీయడం ఏమిటంటూ సీపీఎం (ఎంఎల్)కు చెందిన 52 ఏళ్ల జఫర్ ఖాన్ అడ్డుకుంటే ఆయన్ని కొట్టారు. దాంతో ఆయన మరణించడంతో ఇప్పుడు రాద్ధాంతం జరుగుతోంది. ఆరుబయట బహిర్భూమికి వెళ్లడం సరైన సంస్కృతి కాదని, అయితే అలాంటప్పుడు మహిళలను ఫొటోలు తీయడం ఏ సంస్కృతని సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని 22 శాతం ఇళ్లకు ఇంకా టాయ్లెట్లు లేనప్పుడు వారంతా ఎక్కడికెళ్లాలలని ప్రశ్నిస్తున్నారు.
స్వచ్ఛ్ భారత్ అభియాన్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా 80 లక్షల టాయ్లెట్లను నిర్మించామని, అందులో రాజస్థాన్‌లోనే ఎక్కువ నిర్మించామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ రాజస్థాన్ ప్రభుత్వం స్వచ్ఛతలో దారుణంగా వెనకబడి ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే గత జనవరి, ఫిబ్రవరి నెలల్లో దేశంలోని 434 నగరాలో ‘స్వచ్చ్ సర్వేక్షన్ (సర్వే)–2017’ పేరిట నిర్వహించిన సర్వేనే తెలియజేస్తోంది. రాజస్థాన్‌లోని కిషాన్గఢ్ 419వ స్థానంలో ఉండగా, 29 నగరాలకుగాను 18 నగరాలు 300 నగరాలకన్నా వెనకబడ్డాయి.
స్వచ్ఛ భారత్‌ను ముందుకు తీసుకెళ్లడం కోసం పంచాయతీలకు పోటీ చేసే అభ్యర్థుల ఇళ్లలో తప్పనిసరిగా టాయ్లెట్లు ఉండాలని, అభ్యర్థి కుటుంబ సభ్యులెవరూ బహిర్భూమికి వెళ్లరాదంటూ పంచాయతీ రాజ్ చట్టంలో వసుంధర రాజె ప్రభుత్వం గతేడాది సవరణను తీసుకొచ్చింది. ఈ సవరణ స్ఫూర్తితో కొంతమంది మహిళా సర్పంచ్‌లు ‘నో టాయ్‌లెట్, నో మ్యారేజ్’ నినాదంతో ప్రచారోద్యం చేపట్టారు. చట్ట సవరణను చిత్తశుద్ధితో అమలు చేస్తూ మహిళా సర్పంచ్‌లు చేపట్టిన ఉద్యమాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా అసభ్యంగా ఫొటోలు తీయడం వల్ల దుష్ఫలితాలే ఎక్కువ ఉంటాయని సామాజిక శాస్త్రవేత్తలు అంటున్నారు.