
సభ్యత మరిచి ఫొటోలు తీస్తుంటే అడ్డుకున్నందుకు..
జైపూర్: రాజస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. బహిర్భూమికి వెళ్లిన మహిళలను ఫొటోలు తీసేందుకు ప్రయత్నిస్తున్న కొంతమంది వ్యక్తులను అడ్డుకున్న ఓ 50 ఏళ్ల వ్యక్తిని పెద్ద మనిషి అని కూడా చూడకుండా దారుణంగా కొట్టారు. పిడిగుద్దులు కురిపించి కాళ్లతో తన్నారు. దీంతో ఆస్పత్రిలో చేర్చిన కొద్ది సేపటికే ఆ వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. చనిపోయిన ఆ వ్యక్తి కమ్యూనిస్టు నాయకుడిగా తెలిసింది. దీంతో ఈ ఘటనపట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని ప్రతాప్‌ఘడ్‌లో బాగ్‌వాసా కాచి బస్తీ ప్రాంతంలో ప్రతాప్‌ఘడ్‌కు చెందిన మున్సిపల్ ఉద్యోగులు ఉదయం 6.30గంటల ప్రాంతంలో పర్యటించారు. ఆ సమయంలో బహిర్భూమికి వెళ్లిన మహిళలను ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు. ఇది చూసిన జాఫర్ ఖాన్(50) అనే కమ్యూనిస్టు నాయకుడు జోక్యం చేసుకోని అలా చేయడం తప్పని వారించే ప్రయత్నం చేశాడు. దీంతో వారు మూకుమ్మడిగా దాడి చేసి కొట్టి అతడు చనిపోయేందుకు కారణమయ్యారు.
ఈ దాడికి పాల్పడిన వారిలో నగర్ పరిషద్ కమిషనర్ కూడా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. మొత్తం నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. అయితే, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగానే అలా బహిర్భూమికి వెళ్లే వారి ఫొటోలు తీస్తున్నారంట. అలా చేస్తే వారి ఆలోచనలో మార్పు వచ్చి మరుగుదొడ్లు నిర్మించుకుంటారని వారిని ఆలోచన. ఇందులో భాగంగానే చాలా రోజుల నుంచి వారు ఉదయాన్నే కెమెరాలు పట్టుకొని వెళ్లడం ఫొటోలు తీయడం చేస్తుంటే ఇలాంటి చర్యలు తప్పని జాఫర్ ఖాన్ పలు మార్లు ఫిర్యాదు చేశారంట.