పరువు కాపాడిన అశోక్‌రావ్ చవాన్
సాక్షి, ముంబై: దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో నామరూపాల్లేకుండా ఊడ్చుకుపోయే పరిస్థితి నుంచి కొంతమేర ఊరట కల్పించారు మాజీ ముఖ్యమంత్రి అశోక్‌రావ్ చవాన్. లోక్‌సభ ఎన్నికల్లో నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్ తరఫున రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేసిన 26 మంది అభ్యర్థుల్లో గెలుపొందిన ఒకే ఒక్కడు అశోక్‌చవాన్. ఈయన కూడా గెలవకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కనీసం ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా ఉండేవాడు కాదు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా బీజేపీ హవా వీస్తున్న సందర్భంలో బీజేపీ అభ్యర్థి డీబీ పాటిల్‌ను 81,455 ఓట్ల భారీ మెజార్టీతో ఓడించి, కాంగ్రెస్ పరువును కాపాడారు.
ఈ స్థానమైనా నిలిచేనా...
కనీసం ఒక్కస్థానమైనా దక్కిందనుకొంటున్న కాంగ్రెస్‌కు ఆ కాస్త ఊరట కూడా ఐదేళ్లపాటు నిలిచే పరిస్థితి కనిపించడంలేదు. ఎందుకంటే నాందేడ్ నుంచి గెలుపొందిన అశోక్‌రావ్ చవాన్‌పై పెయిడ్ న్యూస్ కేసులతోపాటు ఆదర్శ్ కుంభకోణంలో కూడా నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయన దోషిగా నిరూపితమై, జైలుశిక్ష పడితే ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడమేగాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్‌కు దక్కిన ఆ ఒక్క స్థానం కూడా ఖాళీ అయ్యే దుస్థితి నెలకొంటుంది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో లేనందున ఇక చవాన్ తన పార్లమెంటు స్థానాన్ని నిలబెట్టుకోవడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు.