Rajeev gowda
-
గౌబా పదవీ కాలం మరో ఏడాది పొడిగింపు
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబా పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది శాఖ శుక్రవారం ఉత్తర్వు జారీ చేసింది. రాజీవ్ గౌబా పదవీ కాలాన్ని పొడిగించడం ఇది రెండోసారి. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్న గౌబా 2019లో కేబినెట్ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం గత ఏడాది ఆగస్టులో ముగియగా, ప్రభుత్వం ఏడాదిపాటు పొడిగించింది. తాజాగా మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు కేంద్ర కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదముద్ర వేసింది. 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన గౌబా జార్ఖండ్ కేడర్ అధికారి. -
హైదరాబాద్ సహా 13 నగరాలపై సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌తో తీవ్రంగా ప్రభావితమైన 13 నగరాల్లో పరిస్థితిపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా గురువారం సమీక్షించారు. హైదరాబాద్ సహా 13 నగరాల్లోనే 70 శాతం కరోనా పాజిటివ్ కేసులు నమోదైనందున ఆయా నగరాల మున్సిపల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లతో కేబినెట్ కార్యదర్శి సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఈ సమావేశానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులూ హాజరయ్యారు. హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ/న్యూఢిల్లీ, అహ్మదాబాద్, థానే, పుణే, కోల్‌కతా/హౌరా, ఇండోర్, జైపూర్, జోధ్‌పూర్, చెంగల్పట్టు, తిరువల్లూరు నగరాల్లో కోవిడ్ పరిస్థితులపై చర్చించారు. కేసుల నిర్వహణ కోసం తీసుకున్న చర్యలను సమావేశంలో సమీక్షించారు. పట్టణ ప్రాంతాల్లో కోవిడ్ నిర్వహణపై కేంద్రం ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసింది. పాజిటివ్ కేసుల రేటు, రెట్టింపు రేటు, టెస్టుల సంఖ్య తదితర అంశాలపై దృష్టిపెట్టేలా మార్గదర్శకాలు ఉన్నాయి. కేసులు, భౌగోళిక వ్యాప్తి వంటి అంశాల ఆధారంగా కంటైన్మెంట్ జోన్లను భౌగోళికంగా నిర్వచించాలని కేంద్రం నొక్కి చెప్పింది. తద్వారా లాక్డౌన్ నియమావళిని అమలు చేయడంలో సహాయపడుతుంది. రెసిడెన్షియల్ కాలనీలు, బస్తీలు, మునిసిపల్ వార్డులు లేదా పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతాలు, మునిసిపల్ జోన్లు, పట్టణాలను అవసరమైన విధంగా కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించవచ్చా అన్న అంశాన్ని మునిసిపల్ కార్పొరేషన్లు నిర్ణయించవచ్చు. -
సీఎం కేసీఆర్‌వి కట్టుకథలు
సాక్షి, హైదరాబాద్: ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్ అనేవి కట్టుకథలు మాత్రమేనని, ప్రధాని మోదీని మళ్లీ అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు ఎం.వి.రాజీవ్‌గౌడ ఆరోపించారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాల ఓట్లు చీలిపోయినప్పుడు మాత్రమే ఆ పార్టీ విజయం సాధించిందని, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండటంతో ఓటమిపాలైందని చెప్పారు. 2014 నుం చి జరిగిన ఏ ఒక్క లోక్‌సభ ఉప ఎన్నికలోనూ ప్రతిపక్షాల నుంచి ఒక్క సీటును కూడా బీజేపీ సాధించలేకపోయిందని, ఇప్పుడు ప్రతిపక్షాల ఓట్లను చీల్చడమే లక్ష్యంగా పెట్టుకుని కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనలు చేయడం, బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకేనని ఆయన ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్న లౌకిక పార్టీలన్నీ ఏకమయితే బీజేపీని గద్దె దింపడం సులువవుతుందని, అందుకే ప్రతిపక్ష ఓట్లను చీల్చి మోదీని గెలుపుబాట పట్టించేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నారని అన్నారు. దేశప్రయోజనాలను పరిరక్షించడం జాతీయ పార్టీలతోనే సాధ్యమన్నారు. కేసీఆర్ ఎంత ప్రయత్నించినా మోదీ ఒక్కసారి ప్రధానమంత్రిగా చరిత్రలో నిలిచి పోవడం ఖాయమని, బీజేపీ నుంచి ఈ దేశానికి విముక్తి కలుగుతుందని ఆయన అన్నారు. వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు మోదీ హయాంలో దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారని, అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టిస్తున్నారని రాజీవ్‌గౌడ ఆరోపించారు. లోక్‌పాల్, సీబీఐ, ఆర్బీఐ, సుప్రీంకోర్టు, ఆర్టీఐ.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వ్యవస్థలూ దారుణ స్థితికి చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలు చాలా తెలివిగా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించి రఫేల్ కుంభకోణంలో క్లీన్చిట్ తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓటమిపై పార్టీ అధిష్టానం సమీక్ష జరుపుతోందన్నారు. తెలంగాణ తెచ్చిందన్న కారణంతో తెలంగాణ ప్రజలు వరుసగా రెండోసారి టీఆర్ఎస్కు అధికారం అప్పగించారని, తెలంగాణ ఇచ్చిన జాతీయ పార్టీ కాంగ్రెస్‌ను కూడా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గాంధీభవన్‌లో క్రిస్మస్ వేడుకలు గాంధీభవన్‌లో ఏర్పాటుచేసిన క్రిస్మస్ వేడుకల్లో రాజీవ్‌గౌడ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి తెలంగాణ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో దాసోజు శ్రవణ్, అధికార ప్రతినిధి మొగుళ్ల రాజిరెడ్డి, దేవరకద్ర కాంగ్రెస్ నాయకుడు డోకూరి పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘బీజేపీకి లాభం చేకూర్చేందుకే కేసీఆర్ ఫ్రంట్’
హైదరాబాద్: బీజేపీకి రాజకీయంగా లాభం చేకూర్చేందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌ను కొత్తగా తెరపైకి తెచ్చారని ఏఐసీసీ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ ఎంపీ ఎంవీ రాజీవ్ గౌడ విమర్శించారు. మంగళవారం రాజీవ్ గౌడ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని ఆరోపించారు. మోదీ పాలనలో దేశంలో సెక్యులరిజానికి రక్షణ లేదన్నారు. రైట్ వింగ్ శక్తులను బీజేపీ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమి బంధాన్ని చూసి బీజేపీ భయపడుతోందని వ్యాఖ్యానించారు. నాలుగున్నర ఏళ్లుగా లోక్‌పాల్ బిల్లు ఎక్కడికెళ్లిందో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ, అమిత్ షాల అవినీతి బయటకు రాకుండా ఉండేందుకు రైటు టు ఇన్ఫర్మేషన్ యాక్ట్‌ను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ, ఆర్బీఐలను కూడా మోదీ అప్రజాస్వామిక విధానాలకు వాడుతున్నారని విమర్శించారు. ఆర్బీఐ గవర్నర్లుగా ఉండలేమని చెబుతుండటమే మోదీ పాలన తీరుకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. రాఫెల్ ధరను రక్షణ మంత్రి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. అది బీజేపీ ఆస్తికాదు.. ప్రజల సొమ్మని అన్నారు. రాఫెల్‌పై సుప్రీం కోర్టుకు ప్రభుత్వం చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని అన్నారు. దేశానికి 126 ఎయిర్ క్రాఫ్ట్‌లు అవసరం ఉంటే మోదీ 36 ఎయిర్ క్రాఫ్ట్‌లు మాత్రమే కొనుగోలు చేశారని..ఇది దేశ భద్రతకు నష్టమా కాదా చెప్పాలన్నారు. నాలుగున్నరేళ్లు అబద్ధాలు, మోసాలతో మోదీ పాలన సాగిందని విమర్శించారు. దేశ రక్షణపై మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే మోదీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నదని మండిపడ్డారు. మమతా బెనర్జీ గొప్ప సెక్యులర్ వాదీ అని, ఆమె కాంగ్రెస్‌తోనే ఉంటారని అభిప్రాయపడ్డారు. తెలంగాణాలో పార్టీ ఓటమిని సమీక్షించుకుంటామని చెప్పారు. -
ప్రచారానికే పరిమితమైన ఎన్డీయే ప్రభుత్వం: రాజీవ్‌గౌడ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వేటినీ ఆచరణలో అమలు చేయకుండా... వాటి ప్రచారానికే ఎన్డీయే ప్రభుత్వం పరిమితమైందని ఏఐసీసీ అధికారప్రతినిధి, ఎంపీ రాజీవ్ గౌడ విమర్శించారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీతో కలసి సోమవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. యూపీఏ ఏడాది పాలన అంతా మాట లు, ప్రచారం, మోదీ విదేశీ పర్యటనలతోనే గడిచిపోయిందని వ్యాఖ్యానించారు. యూపీఏ అమలుచేసిన పథకాలకు పేర్లు మార్చి తమ పథకాలుగా చెప్పుకుంటోందని.. పేర్ల మార్పిడి ప్రభుత్వంగా మిగిలిపోతోందని ఎద్దేవా చేశారు. మోదీ వైఫల్యాలపై దేశవ్యాప్త ప్రచారం చేస్తామని చెప్పారు. ఈ ఏడాదిలో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. యూపీఏ హయాంలో ఆర్థికవ్యవస్థ నిలకడ వృద్ధిని సాధించిందన్నారు. ప్రపంచస్థాయిలో ఎన్నో ఆర్థికసంక్షోభాలు వచ్చినా భారత్‌ను ఏమీ చేయలేకపోవడానికి అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ అనుసరించిన విధానాలే కారణమని రాజీవ్‌గౌడ వివరించారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలపై కేంద్రం ఎలాంటి చర్యలనూ తీసుకోవడం లేదన్నారు. రైతులకు అండగా ఉండటానికి రాహుల్ పాదయాత్ర చేశారన్నారు.