గోల్కొండ.. ఐతే ఓకే!
మణికొండ, న్యూస్‌లైన్: విభజన ప్రతిపాదనపట్ల వారు విముఖంగా ఉన్నారు. తప్పనిసరైతే ప్రత్యామ్నాయం ఆలోచించాలని కోరుతున్నారు. పాలనాసౌలభ్యం పేరిట ఇక్కట్ల పాలు చేయొద్దని విన్నవిస్తున్నారు రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు. హైదరాబాద్ నగరం చుట్టూరా ఉన్న రంగారెడ్డి జిల్లాను మూడు జిల్లాలుగా విభజించనున్నట్టు ప్రచారం సాగుతోంది. వీటిల్లో వికారాబాద్, గోల్కొండ జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లా కేంద్రం హైదరాబాద్ నగరంలోనే ఉంది. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధి నగరానికి ఆనుకొని ఉంది. తమ అవసరాల రీత్యా నగరానికి రాకపోకలు సాగించడానికి ప్రజలకు పెద్దగా ఇబ్బందులేమీలేవు. ఈ నేపధ్యంలో కొత్తగా ఏర్పడనున్న వికారాబాద్ జిల్లా పరిధిలోకి రాజేంద్రనగర్ నియోజవర్గాన్ని కలపాలనే ప్రతిపాదన సిద్ధమైనట్టు సమాచారం. అది కార్యరూపం దాలిస్తే దూరభారం పెరుగుతుంది. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 60 నుంచి 80 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సిందే. పక్కనే ఉండే గోల్కొండ జిల్లాలో విలీనం చేసినా ఫర్వాలేదని రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. వికారాబాద్‌లో విలీనానికి మాత్రం విముఖంగా ఉన్నారు.
ఒక్క మార్పుతో రెండు నియోజకవర్గాలకు మేలు
రంగారెడ్డి జిల్లాలో ఒక్క మార్పు చేస్తే రెండు నియోజకవర్గాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రతిపాదనల్లో గోల్కొండ జిల్లాలో మెదక్ జిల్లా పరిధిలోని పటాన్చెరును కలపనున్నట్లు తెలుస్తోంది. పటాన్చెరువు నియోజకవర్గానికి చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి, వికారాబాద్ నియోజకవర్గంలోని మొమిన్‌పేట్ మండలాలు ఆనుకుని ఉంటాయి. పైగా మెరుగైన రవాణా సౌకర్యం ఉంది. పటాన్చెరును వికారాబాద్ జిల్లాలో, రాజేంద్రనగర్‌ను గోల్కొండ జిల్లాలో విలీనం చేస్తే సౌకర్యంగా ఉంటుందని ఆ నియోజకవర్గాల ప్రజలు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కోరుతున్నారు.