rajesh goel
-
పండుగల నాటికి సివిక్ రీ–ఎంట్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా నుంచి ప్రీమియం సెడాన్ ‘సివిక్’ రీ–ఎంట్రీ ఇవ్వబోతోంది. 2013లో ఈ మోడల్ కార్ల అమ్మకాలను కంపెనీ నిలిపివేసింది. 55,000లకు పైగా సివిక్ కార్లు భారత రోడ్లపై పరుగెడుతున్నాయి. కస్టమర్ల నుంచి డిమాండ్ రావడంతో తిరిగి ఈ కారును ప్రవేశ పెట్టాలని నిర్ణయించామని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ గోయల్ మంగళవారం పేర్కొన్నారు. ఎస్యూవీ అయిన సీఆర్–వీ అప్‌గ్రేడెడ్ మోడల్ సైతం రంగ ప్రవేశం చేయనుందని చెప్పారు. ఈ రెండు మోడళ్లు పండుగల సీజన్ నాటికి అడుగుపెట్టే అవకాశం ఉందని వెల్లడించారు. హైదరాబాద్‌లో కొత్త అమేజ్ కారును ప్రవేశపెట్టిన సందర్భంగా సౌత్ సేల్స్ హెడ్ సెంథిల్ కుమార్ నటరాజన్‌తో కలసి మీడియాతో మాట్లాడారు. రెండంకెల వృద్ధి.. కంపెనీ 2017–18లో భారత్‌లో 1,70,000 పైగా కార్లను విక్రయించింది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 8 శాతం అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ కార్ల పరిశ్రమ వృద్ధి రేటు 8 శాతం ఉండనుందని రాజేశ్ గోయల్ తెలిపారు. ‘హోండా వృద్ధి రేటు పరిశ్రమను మించి రెండంకెలు సాధిస్తుందన్న ధీమా ఉంది. కొత్త అమేజ్ కోసం ఈ ఏడాది మార్చిలోపే 50,000లకు పైగా ఎంక్వైరీలు వచ్చాయి. నూతన ప్లాట్‌ఫామ్‌పైన ఈ కారును అభివృద్ధి చేశాం. ఫస్ట్ జనరేషన్ అమేజ్ మోడల్లో 2.6 లక్షల కార్లు ఇప్పటి వరకు అమ్ముడయ్యాయి. 241 నగరాల్లో 353 ఔట్లెట్లను నిర్వహిస్తున్నాం’ అని వివరించారు. -
కిరాణా కొట్టు నుంచి రూ 251 కే స్మార్ట్‌ఫోన్ వరకూ..
మీరట్: ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ. అదే 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్. అమ్మకాలు మొదలెట్టగానే సర్వర్లు క్రాష్ అయ్యేంత రష్. ఇంతలా భారీగా హైప్ క్రియేట్ చేసిన రింగింగ్ బెల్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మోహిత్ గోయల్ ప్రస్థానం మాత్రం అతిసాధారణంగా ఉంది. ఉత్తరప్రదేశ్ లోని షమ్లీ జిల్లాలో గర్హిపుక్త అనే చిన్న పట్టణంలో కిరాణా కొట్టు నిర్వహించే కుటుంబానికి చెందిన మోహిత్ గోయల్ ఎవరో నిన్నటి వరకు ఆపట్టణంలోని వారికే సరిగా తెలియదు. అయితే ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా చర్చంతా గోయల్ గురించే. పెద్ద పెద్ద వ్యాపార దిగ్గజాలకు సైతం సాధ్యం కాని ధరకు స్మార్ట్ ఫోన్‌ను అందించేందుకు పూనుకున్న మోహిత్ గోయల్ తండ్రి రాజేష్ గోయల్ గర్హిపుక్తలో 'రామ్ జీ' పేరుతో చిన్న కిరాణం కొట్టును నడిపిస్తున్నాడు. మోహిత్ చిన్నతనంలో తండ్రికి కిరాణా దుకాణం నిర్వహణలో సహకరించేవాడు. గర్హిపుక్తలోనే ఓ కాన్వెంట్ పాఠశాలలో చదువు పూర్తి చేసిన మోహిత్.. నోయిడాలోని అమితి యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఇటీవల మోహిత్ గర్హిపుత్ర వెల్లినప్పుడు ఓ కంపెనీని ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పాడని, అయితే అప్పుడు అది ఇంతగా ప్రజల్లోకి వెళ్లేదని అనుకోలేదని అక్కడి వారు చెబుతున్నారు. బీజేపీ సీనియర్ లీడర్ మురళీ మనోహర్ జోషీ చేతుల మీదుగా జరిగిన ఫ్రీడమ్ 251 మొబైల్‌ను లాంచ్ కార్యక్రమానికి మేం కూడా వెళ్లామని చెబుతూ కొందరు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.